(Local) Sun, 17 Oct, 2021

రివ్యూ: 'కౌసల్య కృష్ణమూర్తి'

August 23, 2019,   12:39 PM IST
Share on:
రివ్యూ: 'కౌసల్య కృష్ణమూర్తి'

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మ‌రో భాషలో రీమేక్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు... డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీనివాస‌రావు ఇలాంటి రీమేక్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి త‌గిన‌ట్లు మార్చి భావోద్వేగాలను మ‌న ప్రేక్ష‌కుల‌కు త‌గిన‌ట్టుగా సినిమాల‌ను రూపొందించే భీమ‌నేని డైరెక్ష‌న్‌లో రూపొందిన చిత్రం ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’. త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న ‘క‌ణ’ని ఇప్పుడు ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’గా తెలుగులోకి తీసుకొచ్చారు. తమిళ తంబీలను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రంతెలుగులో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

కథ : తూగోజీల్లాలోని ఇర‌గ‌వ‌రం గ్రామంలో నివ‌సించే కృష్ణ‌మూర్తి(రాజేంద్ర‌ ప్ర‌సాద్‌)కి వ్య‌వ‌సాయం అంటే ప్రాణం. వ్య‌వ‌సాయం అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా కృష్ణ‌మూర్తికి అంతే ఇష్టం. ఇండియా మ్యాచ్‌ ఓడిపోయిందని తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన కౌసల్య(ఐశ్వర్యా రాజేష్‌).. తాను పెద్ద క్రికెటర్‌ అయి, ఇండియా తరుపున ఆడి, టీమ్‌ను గెలిపించి, తండ్రిని సంతోషపెడుదామనే ఆలోచనతో పెరుగుతుంది. దాంతో కౌస‌ల్య అబ్బాయిల టీమ్‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌టం నేర్చుకుంటుంది. చిన్న‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోరు కానీ.. పెద్దమ్మాయి అయిన త‌ర్వాత కౌస‌ల్య‌ను అడ్డుగా పెట్టుకుని కృష్ణ‌మూర్తిని అంద‌రూ తిడుతుంటారు. కానీ కృష్ణ‌మూర్తి భార్య ఆడ‌పిల్ల క్రికెట్ ఆడ‌టం ఏంట‌ని అంటున్నా, ఊర్లో ఎవ‌రేమ‌న్నా ప‌ట్టించుకోకుండా కూతురిని ఎంక‌రేజ్ చేస్తాడు. ఎన్ని హేళనలు చేసినా ఆమె ఇండియన్ టీమ్ కి ఎలా వెళ్ళింది...? కౌస‌ల్య క్రికెట్‌లో ఏ రేంజ్‌కు ఎదుగుతుంది?త‌ండ్రి ఆనందం కోసం ఇండియాను గెలిపిస్తుందా? అనే సంగ‌తులు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్ పాయింట్స్: ‘క‌ణ‌’లో మంచి ఎమోష‌న్స్ ఉన్నాయి. మ‌న‌కు న‌చ్చే క్రికెట్ ఉంది. ఆ రెండింటినీ మిక్స్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’ కూడా దాన్నే ఫాలో అయిపోయింది. చిన్నప్పటి నుంచి తండ్రి ఇష్టాన్ని చూస్తూ పెరిగి.. తన తండ్రి కన్న కల కోసం పాటుపడే కౌసల్య పాత్రలో ఐశ్యర్యా రాజేష్‌ అద్భుతంగా నటించింది. కళ్లతోనే భావాలను పలికించి ప్రేక్షకులను కట్టిపడేసింది.  భూమినే ప్రాణంగా నమ్ముకునే రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ చక్కగా నటించాడు. రైతు పడే కష్టాలను చూపించే సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. కృష్ణమూర్తి భార్యగా, కౌసల్య తల్లి సావిత్రి పాత్రలో ఝాన్ని తన అనుభవాన్ని చూపించింది. ఓ క్రీడానేప‌థ్యం ఉన్న క‌థ‌ని ఎంచుకుని, దాన్ని స‌మ‌కాలీన రైతు ప‌రిస్థితుల‌కు మేళ‌వించి చెప్ప‌డం బాగుంది. క‌ణ‌లో శివ కార్తికేయ‌న్ స‌న్నివేశాల‌న్నీ య‌ధావిధిగా వాడుకున్నారు. ఇక్కడ రీమేక్ చేసింది కాదు.. డబ్బింగ్ చేసారు. శివ కార్తికేయ‌న్ న‌ట‌న‌ బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే..

మైనస్ పాయింట్స్:  క్రికెటర్‌గా ఎదిగేందుకు కౌసల్య పడే కష్టాలను చూపిస్తూ.. మరోవైపు ఈ దేశంలో రైతుగా బతకడం ఎంత కష్టమో, వారు అనుభవించే దుర్భర పరిస్థితులను చూపించాడు. అయితే కథనం మొత్తం ప్రేక్షకుడు ముందే ఊహించేలా సాగడమే కాస్త నిరాశ కలిగించే విషయం. శివ కార్తికేయన్ కోచ్‌గా ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ్నుంచి కథ మరో స్థాయికి వెళ్లిపోవడం బాగుంది. అయితే తమిళ సినిమాను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కనీసం లిప్ సింక్ కూడా లేకపోవడం విడ్డూరం. మొత్తానికి కౌసల్య కృష్ణమూర్తిలో స్పూర్థి ఉంది కానీ కథనం లేదు.

సాంకేతిక విభాగం: క్రికెట్‌ను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలను కూడా గతంలో మనం చూశాం. ఈ చిత్రానికి వచ్చే సరికి కథ కొత్తది కాకపోయినా.. రైతుల కష్టాలను కథలో భాగం చేస్తూ కథనాన్ని రాసుకున్నారు. ఈ మూవీలో క్రికెట్‌ను ఓ ట్రాక్‌గా చూపిస్తూనే.. రైతు, వ్యవసాయం గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీనివాస‌రావు కౌసల్య కృష్ణమూర్తి ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చి దిద్దాడు. ఇక సంగీత దర్శకుడు దిబు నిన్నాన్ థామస్ పాటలు బాగున్నాయి. ముద్దబంతి పాట ఇప్పటికే బ్లాక్ బస్టర్. కెమెరా వ‌ర్క్ పర్లేదు. ఒరిజినల్ సినిమాలోని సన్నివేశాలను అలాగే వాడేసుకున్నారు కాబట్టి టెక్నీషియన్స్ గురించి చెప్పడానికి లేకుండా పోయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

తీర్పు: ఓవరాల్ గా చూస్తే కౌసల్య కృష్ణమూర్తి స్పూర్తి నింపే సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్: 3/5

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.