(Local) Sat, 15 May, 2021

చిదంబరం అరెస్ట్

August 22, 2019,   11:09 AM IST
Share on:
చిదంబరం అరెస్ట్

ఐఎన్‌ఎక్స్ మీడియా అవకతవకల కేసులో మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరాన్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. బుధవారంనాడు రాత్రి దాదాపు గంటపాటు సాగిన హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికొచ్చిన సిబిఐ, ఇడి అధికారులను చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా సాగింది. దీంతో అధికారులు ఆయన నివాసం గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత సిబిఐ ప్రధాన కార్యాలయానికి కారులో చిదంబరాన్ని తరలించారు. అక్కడ విచారణ జరిపి గురువారంనాడు కోర్టులో హాజరు పరచనున్నారు.

అంతకుముదు మంగళవారం ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. దీంతో మంగళవారమే చిదంబరం ఇంటికి సిబిఐ అధికారులు వెళ్లారు. అయితే అక్కడ లేకపోవడంతో ఆ బృందం వెనుదిరిగింది. మరోవైపు హైకోర్టు ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన నేపథ్యంలో చిదంబరం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఊహించని విధంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. తాను ఏ నేరమూ చేయలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.

సంబంధిత వర్గం
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.