(Local) Fri, 05 Jun, 2020

మౌనం వీడిన కడియం శ్రీహరి

July 01, 2019,   3:09 PM IST
Share on:
మౌనం వీడిన కడియం శ్రీహరి

బీజేపీలో చేరతున్నామంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలపై తెరాస నేత కడియం శ్రీహరి ఎట్టకేలకు మౌనం వీడారు.బీజేపీలో చేరుతున్నట్లు వినిపిస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించిన కడియం శ్రీహరి తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల విషయం తనకు కాస్తా ఆలస్యంగా చేరిందని ఇటువంటి నిరాధార వార్తలను ఇంత బాధ్యతారహితంగా ఎలా ప్రచురిస్తారంటూ కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకు సంబంధించి కడియం శ్రీహరి బహిరంగ లేఖ విడుదల చేశారు.

                                          బహిరంగ లేఖ

డెక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవి, మహాన్యూస్…గౌరవ సంపాదకులకు..
మిత్రులారా….
నాపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, వెంటనే ఖండన వార్త ప్రచురించాలి. నేను బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల మీ డెక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవీ, మహాన్యూస్ లలో ప్రచురించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా నాకు చేరింది. ఇంతటి సత్యదూరమైన వార్తను ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ప్రచురించారు. రాజకీయ వారసత్వం, కోట్లాది రూపాయల సంపదలు కలిగిన కుటుంబం నాది కాదని అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో నిజాయితీ, సమర్ధత, విలువలే పెట్టుబడిగా కొనసాగుతున్నాను. నాలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాడిని మీడియా ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి.నాకు బిజెపీలో చేరే ఆలోచన కానీ, అవసరం కానీ లేదన్న విషయాన్ని మీ, మీ మీడియా ద్వారా సమాజానికి తెలపాలి. లేదంటే న్యాయపరమైన చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నాను. ప్రజలారా, మీడియా మిత్రులారా…నేను సమాజంలో అట్టడుగు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఉన్నతవిద్య చదివి లెక్చరర్ గా పనిచేస్తున్న కాలంలోనే నాకు రాజకీయ అవకాశాలు వచ్చాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాను. వాటికి వన్నె తెచ్చాను. రాజకీయాల్లో అనేక అద్భుత సందర్భాలను, క్లిష్టకాలాలను మరియు ఒడిదుడికులను చూసిన వాడిని. ఎదుగుతున్న దళిత నాయకత్వాన్ని బలహీనపర్చి, బదనాం చేసే కుట్రలో భాగంగా కొన్ని స్వార్థపర శక్తులు వారి వ్యక్తిత్వాన్ని, అవకాశాలను దెబ్బతీసేవిధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. దీనిని గమనించాల్సిందిగా ప్రజలను, మీడియాను కోరుతున్నాను.

ఒకే ఒక్క మాట..

రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారాల్సిన అవసరం కానీ, పదవుల కోసం పాకులాడాల్సిన పరిస్థితి కానీ నాకు లేదు. అవినీతి, అక్రమాలను పెంచి పోషించి, విలువలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏనాడు ఓటు వేయలేదు. నేను అంబేద్కర్ వాదిని. వామపక్ష భావజాలంతో పెరిగిన వ్యక్తిని. కులం, మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు దూరంగా ఉండే వ్యక్తిని. అందులోనూ దళిత, ముస్లిం మరియు క్రైస్తవ వ్యతిరేకమైన, సిద్ధాంతపరంగా విబేధించే బిజిపిలోకి వెళ్లే దుస్థితి లేనే లేదు.యావత్తు తెలంగాణ ప్రజానీకం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మద్దతు తెలుపుతున్నారు. దేశం మొత్తం కేసిఆర్ గారి వైపు చూస్తోంది. కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా నిలవబోతోంది. కేసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో నావంతు బాధ్యతను నిర్వర్తిస్తాను.

ఇట్లు 
కడియం శ్రీహరి
ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రం

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.