(Local) Sat, 30 May, 2020

ప్రపంచకప్ : ఇండియా X బాంగ్లాదేశ్

July 02, 2019,   12:52 PM IST
Share on:
ప్రపంచకప్ : ఇండియా X బాంగ్లాదేశ్

ప్రపంచకప్ 2019లో ఇవాళ మరో ఆసక్తికరమైన పోరు సాగనుంది... ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియాకు మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా భారత్‌పై విజయం సాధించాలి. అంతేగాక పాకిస్థాన్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కూడా తప్పక గెలవాల్సిందే. క, ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌కు మరో ఛాన్స్ మిగిలే వుంటుంది. అయితే కోహ్లి సేన మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా బంగ్లాపై గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. అయినా టాప్ ఆర్డర్ రాణించడంతో టీమిండియా దాదాపు మ్యాచ్ గెలిచినంత  పని చేసింది.

భారత్ :

ఇంగ్లండ్‌పై అద్భుత సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్, కోహ్లిలు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. దీంతో భారత్ ఒక దశలో సునాయాసంగా గెలుస్తుందనే నమ్మకం కలిగింది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఏకంగా మూడు సెంచరీలు సాధించి సత్తా చాటాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే బంగ్లా బౌలర్లకు కష్టాలు ఖాయం. కాగా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో మరో ఓపెనర్ రాహుల్ ఘోర వైఫల్యం చవిచూశాడు. 9 బంతులు ఆడినా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వోక్స్ వేసిన బంతులను ఎదుర్కొవడంలో తడబాటుకు గురయ్యాడు. చివరికి డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లోనైనా రాహుల్ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇదిలావుండగా టీమిండియా కెప్టెన్ కోహ్లి ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. ఇంగ్లండ్‌పై కోహ్లి నీలకడగా ఆడాడు. ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కోహ్లి విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు సాధించడం అసాధ్యమేమి కాదు. ఇక, కిందటి మ్యాచ్‌లో ఆశించని స్థాయిలో ఆడని యువ సంచలనం రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పంత్‌పై ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కూడా మరింత మెరుగ్గా ఆడక తప్పదు. వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా ధోని వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. నెమ్మదిగా ఆడడం జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ధోని ధాటిగా ఆడక తప్పదు. కేదార్ జాదవ్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. వేగంగా ఆడి స్కోరును పరిగెత్తించాలి.

మరోవైపు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జోరుమీదున్నాడు. ప్రతి మ్యాచ్‌లో నిలకడగా ఆడుతూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇంగ్లండ్‌పై కూడా మెరుపులు మెరిపించాడు. అయితే కీలక సమయంలో వికెట్‌ను పారేసు కోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ లోపాన్ని సరిదిద్దు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలకమైన బంగ్లాదేశ్ మ్యాచ్‌లో హార్దిక్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాట్‌తో బంతితో చెలరేగే సత్తా కలిగిన హార్దిక్ విజృంభిస్తే భారత్‌కు ఎదురే ఉండదు. ఇక, బుమ్రా, షమి, చాహల్, కుల్దీప్‌లతో బౌలింగ్ బలంగానే ఉంది. కానీ, కిందటి మ్యాచ్‌లో ఒక్క బుమ్రా తప్ప మిగతావారు భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. షమి ఐదు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. చాహల్ కూడా ఎప్పుడూ లేని విధంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరోసారి ఇబ్బందులు తప్పక పోవచ్చు.

బాంగ్లాదేశ్ :ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు చావోరేవోగా మారింది. సెమీస్ అవకాశాలు కాపాడు కోవాలంటే భారత్‌పై భారీ విజయం సాధించాల్సిందే. ఈ మ్యాచ్‌లో కూడా షకిబ్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న షకిబ్ ఒంటిచేత్తో బంగ్లాను గెలిపిస్తున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. వరుస సెంచరీలతో షకిబ్ ప్రపంచకప్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. బంగ్లా సాధించిన మూడు విజయాల్లో కూడా షకిబ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్‌తో బంతిలో షకిబ్ రాణిస్తున్నాడు. ముష్ఫికుర్ రహీం, తమీమ్ ఇక్బాల్‌లు కూడా ఫామ్‌లో ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో నిలకడగా రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే బంగ్లాదేశ్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే టోర్నీ నుంచి వైదొలగక తప్పదు.

జట్లు :

భారత్‌: కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషబ్ పంత్‌, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్‌/ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్, కుల్దీప్ యాదవ్/ యుజువేంద్ర చాహల్‌, మొమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్‌: తమీమ్‌ ఇక్బల్, సౌమ్య సర్కార్‌, షకీబల్‌ హాసన్ , ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, మొసద్దెక్‌ హసన్‌, మెహిదీ హసన్‌, సైఫుద్దీన్‌, మష్రాఫె మోర్తజా, ముస్తాఫిజుర్‌ రెహమాన్.

పిచ్, వాతావరణం : ఆదివారం భారత్, ఇంగ్లండ్‌ ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇది పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. భారీ స్కోరుకు అవకాశం ఉంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు. బౌండరీ దూరం తక్కువగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది పిచ్ సీమర్లకు అనుకూలంగా మారనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం  ప్రమాదం లేదు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.