(Local) Sat, 24 Jul, 2021

బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత్ కైవసం

November 11, 2019,   12:52 PM IST
Share on:
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...

ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా ఇన్నింగ్స్‌ను దీపక్ చాహర్ కోలుకోలేని దెబ్బ తీశాడు . అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన దీపక్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి రికార్డు స్థాయిలో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉండడం విశేషం.

చిరకాలం గుర్తుండి పోయే బౌలింగ్‌తో చెలరేగిన దీపక్ బంగ్లా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. తన మూడో ఓవర్ చివరి బంతికి షఫివుల్ ఇస్లామ్‌ను వెనక్కి పంపాడు. అంతేగాక ఆఖరి ఓవర్ తొలి రెండు బంతుల్లో కూడా వరుస వికెట్లు తీసి అరుదైన హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ముస్తఫిజుర్ రహ్మాన్, అమినుల్ ఇస్లామ్‌లను చాహర్ వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు. తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.

మరోవైపు శివమ్ దూబే కూడా మూడు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ జట్టులో మహ్మద్ నయీం ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్‌ను ఆడిన నయీం 48 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో పది ఫోర్లతో 81 పరుగులు చేశాడు. మిథున్ (27) పరుగులు సాధించాడు. మిగతావారు కనీసం రెండంకెలా స్కోరును కూడా అందుకోలేక పోయారు. ఒక దశలో రెండు వికెట్ల నష్టానికి 110 పరుగులతో పటిష్టస్థితిలో ఉన్న బంగ్లా ఇన్నింగ్స్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రాజ్‌కోట్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి షఫివుల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లోకేశ్ రాహుల్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే 4 ఫోర్లతో 19 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన రాహుల్‌ను కూడా షఫివుల్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

అయితే శ్రేయస్ అయ్యర్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారింది. ఒకవైపు రాహుల్, మరోవైపు అయ్యర్‌లు దూకుడుగా ఆడారు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ కోలుకుంది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాహుల్ కాస్త సమన్వయంతో బ్యాటింగ్ చేయగా అయ్యర్ దూకుడును ప్రదర్శించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 35 బంతుల్లోనే ఏడు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 59 పరుగులు జోడించాడు.

రాహుల్ ఔటైనా శ్రేయస్ అయ్యర్ జోరును కొనసాగించాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచాడు. పంత్ ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే మనీష్ పాండే అండతో అయ్యర్ చెలరేగి పోయాడు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్ వరుస సిక్సర్లతో కనువిందు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన అయ్యర్ భారీ షాట్లతో స్కోరును పరిగెత్తించాడు.

విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 33 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 62 పరుగులు సాధించాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన మనీష్ పాండే మూడు ఫోర్లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యువ ఆటగాడు శివమ్ దూబే 9 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగుల భారీ స్కోరును సాధించింది. బంగ్లా బౌలర్లలో షఫివుల్, సౌమ్య సర్కార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.