(Local) Wed, 21 Aug, 2019

టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

August 07, 2019,   1:05 PM IST
Share on:

మూడవ టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (52; 45బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. భారత యువ బౌలర్ దీపక్ చాహర్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీపక్ ధాటికి ఓ దశలో 14 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన దీపక్ వెంటవెంటనే మూడు వికెట్లు తీసి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అతని ధాటికి ఎవిన్ లెవిస్ (10), సునీల్ నరైన్ (2), షిమ్రోన్ హెట్‌మెయిర్ (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ దశలో     ఇన్నింగ్స్ ను  ఆదుకునే బాధ్యత సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ తనపై వేసుకున్నాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు.

ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను సిక్స్‌లుగా మలుస్తూ పొలార్డ్ స్కోరును పరిగెత్తించాడు. అప్పటి వరకు కనీసం 70 పరుగులు దాటడమే కష్టంగా కనిపించిన స్కోరు ఊపందుకుంది. కుదురుకున్న తర్వాత పొలార్డ్ వరుస సిక్సర్లతో చెలరేగి పోయాడు. అతన్ని కట్టడి చేయడంలో  భారత బౌలర్లు విఫలమయ్యారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్ 45 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 58 పరుగులు చేశాడు. మరోవైపు రొమాన్ పొవెల్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో విండీస్‌ను ఆదుకున్నాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పొవెల్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో అజేయంగా 32 పరుగులు చేశాడు. కాగా, భారత బౌలర్లలో దీపక్ చాహర్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. నవ్‌దీప్ సైనికి రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం 147 పరుగుల లక్ష్య చేధనకై బ్యాటింగ్ కి దిగిన భారత్ కి ఆదిలో నే  ..  ఓపెనర్ శిఖర్ ధావన్‌ ను (3) విండీస్ పేసర్ థామస్‌ రెండో ఓవర్‌ ఆఖరి బంతికి ఔట్ చేశాడు.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (20; 18బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించాడు .. అయితే ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో అలెన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.అటు తరువాత  క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో 16వ ఓవర్‌లో కోహ్లీ.. 17వ ఓవర్‌లో పంత్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే థామస్‌ బౌలింగ్లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.కోహ్లీ నిష్క్రమణ అనంతరం థామస్‌ బౌలింగ్లోనే పంత్ సిక్స్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేసాడు. కాట్రెల్‌ వేసిన 19వ ఓవర్లో మనీష్ పాండే (2) తడబడంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఇక బ్రాత్‌వైట్‌ వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతికే పంత్ సిక్సర్‌ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమయిన పంత్.. ఈ మ్యాచులో ఆకట్టుకున్నాడు.

సంబంధిత వర్గం

భారత్‌, వెస్టిండీస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.