(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: సైరా నరసింహారెడ్డి

October 02, 2019,   12:44 PM IST
Share on:
రివ్యూ: సైరా నరసింహారెడ్డి

మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో మెగావారసుడు రామ్ చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి నటించారు. ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్,  శాండిల్ ఉడ్‌లకు సంబంధించిన స్టార్లు.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సైరా’ కోసం మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం భారీ అంచనాలతో అట్టహాసంగా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : 18వ శ‌తాబ్దం మ‌ధ్యలో కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ప్రజలను పాలిస్తూ ఉంటారు. నాటి నిజాం ప్రభువు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వళ్ల‌కు ద‌త్తత ఇవ్వడంతో వీటిని ద‌త్త మండ‌లాలు అని పిలుస్తుంటారు. అయితే, ఎవరి మధ్యా ఐకమత్యం ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు. రేనాడుపై పన్ను వసూలు చేసుకునే హక్కు ఆంగ్లేయులు పొందడంతో ఎవరికీ స్వయం పాలన ఉండదు. మరోవైపు వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ప్రజలను ఆంగ్లేయులు హింసిస్తుంటారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు (పాలెగాడు) ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(చిరంజీవి) బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకోబోతున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. ఈ క్రమంలో నరసింహా రెడ్డి తను ఇష్టపడిన లక్ష్మి (తమన్నా)ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ తనకు చిన్నప్పుడే సిద్దమ్మ (నయనతార)తో పెళ్లి అయిపోయింది అని నరసింహా రెడ్డికి తెలుస్తోంది. ప్రజల కోసం తన ప్రేమను త్యాగం చేసిన నరసింహా రెడ్డి, దేశం స్వేచ్ఛ కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకుంటాడు. కోవెలకుంట్ల బ్రిటీష్ రేంజర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అంతమొందించే క్రమంలో.. నరసింహారెడ్డే అతడిని చంపేస్తాడు. అప్పటి నుంచి బ్రిటీష్ వారు న‌ర‌సింహారెడ్డిని అంత‌మొందించేందుకు అనేక కుట్రలు ప్లాన్ చేస్తారు. అయితే.. బ్రిటీష్‌వాళ్ల‌ను ఎదిరించే క్రమంలో అవుకు రాజు(సుదీప్), రాజ పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతి బాబు)లు ఎలా న‌ర‌సింహారెడ్డితో క‌లిసి వ‌చ్చారు..? ఆ తర్వాత నరసింహా రెడ్డి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఈ జ‌ర్నీలో ఆయ‌న‌కు సిద్ధ‌మ్మ (న‌య‌న‌తార‌), వీర‌వెంక‌ట మ‌హాలక్ష్మి (త‌మ‌న్నా)కు ఉన్న లింక్ ఏంటి ? ఈ పోరాటంలో ఆయ‌న తుదిశ్వాస వ‌ర‌కు నిల‌బ‌డ్డారా లేదా.. అన్న‌ది మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

ప్లస్ పాయింట్స్ : చిరు 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. తెర‌పై సినిమా చూస్తున్నంత‌సేపూ నిజంగా రోమాలు నిక్క‌బొడుస్తాయ‌ని చెప్పొచ్చు.  ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్, అమితాబ్ లతో పాటు మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ అలాగే భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. ‘సైరా’ కి భార్యగా నయనతార కూడా బాగా నటించారు. ఈమె క్రేజ్, నటన సినిమాకి అదనపు ఆకర్షణ. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా తన పరిపక్వతమైన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. అవుకు రాజుగా సుదీప్, పాండిరాజాగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, బసిరెడ్డిగా రవికిషన్, తమన్నా అనుష్క వంటి స్టార్ లు కూడా తమ పాత్రలో ఇమిడిపోయి నటించారు.  ఇక పవన్ కళ్యాణ్, నాగబాబు వాయిస్ ఓవర్ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ..

మైనస్ పాయింట్స్ : ఝాన్సీ లక్ష్మీబాయి తన సైనికులలో స్ఫూర్తి నింపడానికి పదేళ్ల క్రితం జరిగిన స్ఫూర్తిమంతుడి కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. ఒక్కొక్క పాత్ర పరిచయం, అప్పటి పరిస్థితులను ప్రేక్షకులకు వివరంగా చూపించాలని ప్రయత్నించడంతో మొదటి గంట సినిమా నెమ్మ‌దిగా న‌డిచిన‌ట్టు అనిపించినా.. రెండో భాగంలో మాత్రం క‌థా గ‌మ‌నం అద్భుతంగా సాగుతుంది. కొన్ని యాక్షన్ స‌న్నివేశాల‌ను, విజువల్స్ ను చూస్తుంటే మాత్రం నిజంగానే 18వ శతాబ్దంలో ఉన్నామ‌న్న భావన ప్రేక్ష‌కుల్లో క‌లుగుతుంది.  

సాంకేతిక విభాగం : స్టైలిష్‌ దర్శకుడిగా పేరున్న సురేందర్‌రెడ్డి చరిత్ర ప్రాధాన్యమున్న కథను అద్భుతంగా మలిచాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని వార్ సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమా ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియంలు ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జూలియస్‌ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది.  ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవచ్చనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతం. తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం చరణ్ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కించాడు. శ్రీక‌ర్ ప్రసాద్ ఎడిటింగ్ కొన్ని చోట్ల ట్రిమ్ చేసేలా ఉన్నా ద‌ర్శకుడు క‌థ‌నం ప్లాట్‌గాను, స్లోగా ఉండ‌డంతో ఇక్కడ ఎడిట‌ర్‌ను త‌ప్పు ప‌ట్టలేని ప‌రిస్థితి. బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్‌లు చిరు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ ఆనాటి రోజులను కళ్లకు కట్టింది. 

తీర్పు : ఒక స్ఫూర్తిమంతుడైన స్వతంత్ర పోరాట యోధుని కథను మన ప్రేక్షకులకు నచ్చే విధంగా మలచడంలో సైరా టీమ్ సక్సెస్ అయింది. ‘సైరా’ తెలుగు సినిమా ఖ్యాతిని చాటి ‘ఔరా’ అనిపిస్తుంది!

రేటింగ్‌: 3.75 / 5

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.