(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ : సాహో

August 30, 2019,   10:24 AM IST
Share on:
రివ్యూ : సాహో

బాహుబ‌లి త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా ఈ రోజు ఏకంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అతిపెద్ద బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి ట్రైలర్, పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. దేశం మొత్తం సాహో ఫీవ‌ర్‌తో ఊగిపోయింది. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన `సాహో` ఆ క్రేజ్ ని నిలబెట్టగలిగిందా, బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటి ఏమిటి, దర్శకుడుగా సుజీత్ ఏం మ్యాజిక్ తెరపై చేశాడు ? అన్న‌ది చూద్దాం.

కథ:పృథ్వీ రాజ్‌ తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌... రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ పగ పెంచుకుంటాడు. మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి సీన్‌లోకి వస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. చివ‌ర‌కు అశోక్ గురించి ఆమెకు తెలిసే షాకింగ్ నిజం ఏంటి? అనేది సస్పెన్స్ గా ఉంటుంది. ఇక ముంబైలో జ‌రిగిన దొంగతనానికి ప్ర‌భాస్‌కు సంబంధం ఏంటి, చివ‌ర్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వ‌చ్చే సిద్ధార్థ‌రామ్ సాహో ఎవ‌రు ? అన్న‌ది తెరపై చూడాలి. ఏం రివీల్ చేసినా మీ ఆసక్తి పోతుందని... కథ గురించి ఇక్కడితో ఆగిపోతున్నాం. 

ప్లస్ పాయింట్స్ :ప్రభాస్ ఎంట్రీ... మన అంచనాలకు తగ్గట్టే థియేటర్లు దద్దరిల్లిపోతాయి.ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో ‘మిర్చి’ రోజులను గుర్తు చేశాడు. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ... అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి.గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్‌ లుక్‌లో తన స్టైల్‌ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు. 

మైనస్ పాయింట్స్ :సుజీత్‌ యాక్షన్‌ సన్నివేశాల రూపకల్పన మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద కూడా చూపించాల్సింది. డైలాగ్స్‌ కూడా అంతగా పేలలేదు. కథానుసారం ఫస్టాఫ్ లోనే రెండు పాటలు వచ్చేస్తాయి. సినిమాలో ఉన్న దాదాపు ముఖ్య పాత్రలు అన్నీ కూడా ఫస్టాఫ్ లోనే పరిచయం చేసిన ద‌ర్శ‌కుడు..ఆ ప‌రిచ‌యం చేయ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడు. క‌థ‌ను మెయిన్ ట్రాక్‌లోకి ఎక్కించేందుకే దాదాపుగా గంట సేపు తీసుకుంటాడు... ఇక్కడ టైం కిల్ అయ్యింది.యాక్షన్ ఎపిసోడ్ లు ఎక్కువైన భావన కలుగుతుంది. యాక్షన్ సీన్స్ ఎక్కువ కావడం వల్ల దర్శకుడి ఏకాగ్రత వాటిమీదే ఎక్కువ ఫోకస్ అయి మిగతా అంశాల్లో క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమా కథ బేస్ లైన్ డైరెక్టర్ యొక్క మొదటి సినిమా రన్ రాజా రన్ నుంచే తీసుకున్నట్టు అనిపిస్తుంది. స్పష్టంగా... రెగ్యులర్ తెలుగు సినిమాలు నుంచి ఆశించే ఫన్, రొమాన్స్ కు పెద్దగా అవకాశం లేకపోవడం మైనస్. 

సాంకేతిక వర్గం :భారీ యాక్షన్‌ సీన్లతో తెలుగు తెరను హాలీవుడ్‌ స్టైల్‌ ఫైట్లతో నింపేశారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఫర్వాలేదు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ సినిమాకు అదనపు బలం. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. వాళ్లు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపించేలా సినిమాటోగ్రాఫర్‌ మది చాలా కష్టపడ్డారు. డాన్‌ సిటీని క్యాప్చర్‌ చేయడంతో చక్కటి పనితనం చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కమల్‌ కణ్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ బాగుంది.

తీర్పు:మొత్తం మీద చూసుకుంటే ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా పండగ. 

రేటింగ్ :  3/5

 

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.