(Local) Mon, 20 Sep, 2021

రివ్యూ : వజ్ర కవచధర గోవింద

June 14, 2019,   10:57 PM IST
Share on:
రివ్యూ : వజ్ర కవచధర గోవింద

కథానాయకుడిగా నిలబడేందుకు హాస్య నటుడు సప్తగిరి తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన మూడో చిత్రం వజ్ర కవచధర గోవింద. తనతో గతంలో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అరుణ్‌ పవార్‌కు మరోసారి అవకాశాన్నిచ్చారు సప్తగిరి. వజ్ర కవచధర గోవింద సినిమా సప్తగిరి నమ్మకాన్ని నిలబెట్టిందా…? లేదా ? సమీక్షలో చూద్దాం…

కథ :సోమల అనే చిన్న గ్రామంలో ఉండే గోవింద్‌ తన గ్రామ ప్రజలు పడే కష్టాలు చూడలేక దొంగగా మారతాడు. ఊళ్లో ఒక్కొక్కరు క్యాన్సర్‌తో చనిపోతుండటంతో వారిని కాపాడేందుకు చాలా డబ్బు కావాలనే ఉద్దేశంతో ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో వారికి 150 కోట్ల విలువైన మహేంద్ర నీలం అనే వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని అమ్మి పంచుకోవాలనుకుంటారు గోవింద్‌ అండ్‌ బ్యాచ్‌. అయితే వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్‌ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. వజ్రాన్ని దాచిన చోటు కూడా మర్చిపోతాడు. చివరకు గోవింద్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చాడా..? ఈ కథతో బంగారప్పకు ఉన్న సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ : సప్తగిరి నటనే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాయిక వైభవి జోషి పాత్రోచితంగా నటించింది. నటుడు శ్రీనివాస రెడ్డి తన వంతు నవ్వించే ప్రయత్నం చేశాడు.విలన్ బంగారయ్యగా నటించిన తంబిదొరై కూడా తన ఆహార్యంతో కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చారు.అర్చన, టెంపర్ వంశీ, అప్పారావు ఫర్వాలేదనిపిస్తారు. 

మైనస్ పాయింట్స్ :మనం చేసే పనే కాదు వెళ్లే మార్గం కూడా సరిగ్గా ఉండాలని చెప్పే చిత్రమిది అంటూ ప్రచార సందర్భంలో దర్శకుడు అరుణ్‌ పవార్‌ చెప్పుకున్నారు. అదే విషయాన్ని ఆయనకు గుర్తు చేస్తే…సినిమా కథను ఊహించడమే కాదు…ఆ కథను అంతే సహజంగా తెరకెక్కించగలగాలి. ఉపయోగం ఉన్న కథైనా వజ్ర కవచధర గోవింద చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. వేళ్ల మీద లెక్కపెట్టే కొన్ని సన్నివేశాలు తప్పితే ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడి బలం కనిపించలేదు. మొదటి భాగం ఏదో అయ్యిందిలే అనిపిస్తే…ఇక ద్వితీయార్థం దర్శకుడు కథను గాడి తప్పించి వింత వింత విన్యాసాలు చేశాడు. హీరోకు అనవసర బిల్డప్‌ ఇవ్వడం, కథనానికి అతకని హాస్యం, ఒక పద్దతిగా సాగని సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.

సాంకేతిక వర్గం :సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమాను రిచ్‌గా నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. ఫస్టాఫ్‌లో వచ్చిన రెండు పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 

తీర్పు :లాజిక్ లేని కామెడీ సన్నివేశాలు అలాగే ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని కథాకథనం లాంటి కొన్ని అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా వజ్రకవచధర గోవింద సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు.

రేటింగ్ :  2 / 5

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.