(Local) Sun, 19 Sep, 2021

రివ్యూ : గేమ్‌ ఓవర్‌

June 14, 2019,   8:42 PM IST
Share on:
రివ్యూ : గేమ్‌ ఓవర్‌

కొత్త తరహా ప్రయత్నాలు చేయాలంటే తను తెరకెక్కించే కథా కథనాల్లో దర్శకుడు నిజాయితీ చూపించాలి. అప్పుడే ఆ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించగలుగుతారు. చిన్న చిన్న లోపాలున్నా సర్దుకుపోయి విజయాన్ని అందిస్తారు.నయనతార ప్రధాన పాత్రలో మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌.. గేమ్‌ ఓవర్‌ను తెరకెక్కించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్‌లోనూ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న తాప్సీకి  ఆశించిన సక్సెస్‌ ఇచ్చిందా..తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

కథ :వీడియో గేమ్ డిజైనర్ గా వర్క్ చేసే  స్వప్న , తల్లిదండ్రులకు దూరంగా కోకాపేట శివారులోని గేటెడ్ కమ్యూనిటీలో పనిమనిషి కాలమ్మతో ఒంటరిగా ఉంటుంది. ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆమెను కొన్ని మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. యానివర్సరీ రియాక్షన్ తో తను బాధపడుతోందని ఒంటరిగా ఉండొద్దని సూచిస్తాడు తనను ట్రీట్ చేసిన డాక్టర్. మరోవైపు ఆమె వేయించుకున్న గేమింగ్ టాటూ కూడా ఆమెను ఇబ్బంది పెడుతుంటుంది. టాటూకు గతంలో చనిపోయిన అమృతకి లింక్ ఉందని తెలుసుకుంటుంది. ఈ క్రమంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించి గాయపడి వీల్ ఛైర్ కు పరిమితమవుతుంది స్వప్న.ఈ సంఘటన తరువాత పరిణామాలు స్వప్న జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? స్వప్న జీవితంతో అమృతకి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవారికి గేమ్‌ ఓవర్‌ నచ్చుతుంది. కథా కథనాలు ఆకట్టుకునేలా సాగుతాయి. సినిమా ముందుకు వెళ్తుంటే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా మారుతుంటాయి. కొత్త తరహా సినిమా రూపొందించడంలో ఎక్కడా దారి తప్పని దర్శకుడి నిజాయితీ కనిపిస్తుంది.ఓ వీడియో గేమింగ్ డెవలపర్ పాత్రలో నటించన తాప్సీ తన పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఒక పక్క ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో అలాగే  తనకు వస్తోన్న కలలతో భయపడుతూ ఇలా ప్రతి సన్నివేశంలో తాప్సీ చక్కని నటనతో ఆకట్టుకుంది. పైగా అయోమయ పరిస్థితుల్లో.. ఆమె తన అభినయంతో మరింతగా ఉత్సుకతను పెంచుతూ సినిమాకే హైలెట్ గా నిలిచింది.అమృత అనే అమ్మాయిగా సంచిత కనిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా.. ఆమె కూడా ఆక‌ట్టుకుంటుంది.మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

మైనస్ పాయింట్స్ :కథను మొదటి నుంచీ ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. కథ చిన్నది కావడంతో తొలిభాగం విషయమేమీ చెప్పకుండా లాక్కొచ్చాడు. ద్వితీయార్థంపైనే దృష్టంతా పెట్టాడు. దాంతో ప్రథమార్థం అంతగా ఆకట్టుకోదు. సాగతీతగా అనిపిస్తుంది. మొదటి భాగాన్ని మరికొంత ఎడిటింగ్‌ చేయొచ్చు. ఇక కథనంలో మరిన్ని వివరాలు అవసరం అయ్యాయి. స్వప్న జీవితాన్ని వెంటాడే ఆగంతుకులు ఎవరన్నది సరళంగా చెప్పాల్సింది. ఇలాంటి మరికొన్ని విషయాలు దర్శకుడు ప్రేక్షకుల మేథస్సుకే వదిలేశాడు. ఇది ఇబ్బందికరంగా మారింది.

సాంకేతిక వర్గం : సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అశ్విన్‌, కావ్య రామ్‌కుమార్‌లు క‌లిసి క‌థ‌, క‌థ‌నాల్ని రాసుకున్న విధానం మెప్పిస్తుంది. రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం, ద్వితీయార్ధంలో రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్‌, ఎ.వసంత్ ఛాయాగ్రహ‌ణం చిత్రానికి ప్రధాన బ‌లం. ఇదివ‌ర‌కు ‘మ‌యూరి’తో ఆక‌ట్టుకున్న దర్శకుడు అశ్విన్, మ‌రోసారి త‌న ప్రత్యేక‌త‌ని ప్రద‌ర్శిస్తూ ఈ సినిమా తీశాడు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. 

తీర్పు :చిన్న చిన్న తప్పులు వదిలేస్తే థ్రిల్లర్‌ సినిమాలు చూసి ఆనందించేవారిని గేమ్‌ ఓవర్‌ నిరుత్సాహపరచదు. ప్రథమార్థం కాస్త ఓపిగ్గా కూర్చుంటే…రెండో భాగాన్ని ఆస్వాదించవచ్చు.

రేటింగ్ : 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.