(Local) Tue, 26 Oct, 2021

రివ్యూ: రాక్షసుడు

August 02, 2019,   11:11 PM IST
Share on:
రివ్యూ: రాక్షసుడు

2014లో అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ ప్లాప్స్ కావడంతో డీలా పడకుండా... తనవంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాజాగా తమళంలో సంచలన విజయం సొంతం చేసుకొన్న "రాక్షసన్" చిత్రాన్ని తెలుగులో "రాక్షసుడు"గా రీమేక్ చేయించి మరీ నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన కోరుకుంటున్న హిట్ పడిందా లేదా అనేది తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాలి కదా.. 

కథ: అరుణ్‌కు (బెల్లంకొండ శ్రీనివాస్‌) దర్శకుడు కావాలన్నది లక్ష్యం. స్క్రిప్ట్‌లు పట్టుకొని నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగినా పరిస్థితి ఎక్కడా ఆశాజనకంగా కనిపించదు. కుటుంబ పరిస్థితులు, ఒత్తిడుల రీత్యా తన తండ్రి ఉద్యోగమైన పోలీస్ అధికారిగా చేరతాడు. నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి,చంపబడుతున్న సీరియల్ మర్డర్స్ కేసు చేధించే బాధ్యత అరుణ్ టీంకి దక్కుతుంది. ఈ క్ర‌మంలోనే ఈ కేసుల‌కు సంబంధించి అరుణ్ కీల‌క‌మైన ఆధారాల‌ను సేక‌రిస్తాడు. అందులో భాగంగానే యువ‌తుల‌ను ఎవ‌రు హ‌త్య చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కార‌ణాల‌ను తెలుసుకునే ప‌నిలో ప‌డ‌తాడు. అయితే పోలీస్ శాఖ‌లో ఉండే ఉన్న‌తాధికారుల వ‌ల్ల అత‌ను త‌న ద‌ర్యాప్తును స‌జావుగా చేయ‌లేక‌పోతుంటాడు. ఈలోగా అరుణ్‌ మేనకోడలును కూడా కిడ్నాప్‌ చేసి హత్య చేస్తారు. ఈ పరిస్థితుల్లో అరుణ్‌ ఏం చేశాడు?  కృష్ణ వేణి (అనుపమ ) కి అరుణ్ కు సంబంధం ఏంటి..? అసలు ఎవరు ఈ కృష్ణవేణి..? ఈ కేస్ ను అర్జున్ ఎలా సాల్వ్ చేశాడు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. 

ప్లస్ పాయింట్స్: మాస్ హీరో పాత్రలలో కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు. కుటుంబ అవ‌స‌రాల కోసం అయిష్టంగానే పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యే వ్య‌క్తిగా కథకు అవసరమైన వేరియేషన్ ని చాలా చ‌క్క‌గా చూపించాడు. అనుపమ పరమేశ్వరన్ కనిపించేది  కొన్ని సీన్స్ అయినా కూడా బాగా చేసింది. సైకో కిల్లర్ క్యారెక్టర్ సినిమాకి హైలెట్.  రాజేవ్ కనకాల ఎమోషనల్ రోల్లో ఎప్పట్లానే ఆకట్టుకొన్నాడు. సొంత కూతురు కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ గా రాజీవ్ కనకాల ఎమోషనల్ సన్నివేశాలలో చక్కగా నటించారు. మరికొన్ని కీలకమైన పాత్రల్లో తమిళ నటులు కనిపించి మెప్పించారు. మొదటి సగంకి మించి రెండవ భాగం మరింత ఉత్కంఠ గా సాగడం ఈ చిత్రం కి కలిసొచ్చే మరో అంశం.

మైనస్ పాయింట్స్: క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు కొన్ని ఆసక్తిగా సాగలేదు. సినిమా నిడివి కొరకు పెట్టినట్లున్న కొన్ని సన్నివేశాలు అసలు కథను ప్రక్కదారి పట్టించేలా ఉన్నాయి. 

సాంకేతిక విభాగం: రమేష్‌ వర్మ  కథకు సరిపోయే పరిసరాలను, పాత్రలను ఎక్కడా దారి తప్పకుండా చూసుకున్నాడు. మాతృకను దాదాపుగా అనుసరించినా, రీమేక్‌తో మెప్పించడం అంత సులువు కాదు. దర్శకుడు ఇక్కడ విజయం సాధించాడు. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలవడమే కాకుండా మ్యూజిక్ తో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసినట్టు ఉంది. విజువల్స్ బాగున్నాయి. వెంకట్ సి.దిలీప్ కెమెరా యాంగిల్స్, కలర్ గ్రేడింగ్, లైటింగ్ & డి.ఐ విషయంలో తన మార్క్ చూపించాడు. ఏ స్టూడియో కోనేరు స‌త్య‌నారాయ‌న ప్రొడక్షన్ వేల్యుస్ బాగున్నాయి.  సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకొనేలా సాగుతుంది. సినిమా ఓ సైకో కిల్లర్ ని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ, దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడు. 

తీర్పు: ఈ చిత్రం ఎక్కడా ప్రేక్షకుడిని నిరాశపరచకుండా ఆద్యంతం ఉత్కంఠగా సాగే క్రైమ్ థ్రిల్లర్. థ్రిల్లర్‌ జోనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు కావాల్సిన హంగులున్న చిత్రమిది.  అయితే తమిళ రీమేక్‌ అని కాకుండా స్ట్రెయిట్‌ తెలుగు చిత్రమనే భావనలో సినిమా చూస్తే ఈ ‘రాక్షసుడు’ మరింత థ్రిల్‌ని అందిస్తాడు.

రేటింగ్‌: 3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.