(Local) Tue, 21 Sep, 2021

రివ్యూ: ఓ బేబీ

July 05, 2019,   2:59 PM IST
Share on:
రివ్యూ: ఓ బేబీ

సామ్ అనగానే ఒక క్రేజ్ వస్తుంది అభిమానులకి, దానికి కారణం ఆమె అక్కినేని వారి కోడలు అనే కాకుండా  ఆమె నటించే చిత్రాలు రొటీన్ కి భిన్నంగా ఉండటమే మరొక కారణం. మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన అనేక సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానుల ఊహలకు తగ్గట్టుగానే ఆమె ‘ఓ బేబీ’ అనే సినిమాను ప్రకటించారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించడం.. సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో నటించడం.. ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘బేబీ’ ఆకట్టుకుందో లేదో చూద్దాం. 

కథ : సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ,  చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. బేబీ తన చిన్ననాటి స్నేహితుడు చంటి (రాజేంద్రప్రసాద్‌)తో క‌లిసి ఒక క్యాంటీన్‌ని నిర్వహిస్తూ ఉంటుంది. పాత‌కాల‌పు మ‌నిషి కావ‌డంతో ఆమె చాద‌స్తంతో ఇంట్లో కోడ‌లు (ప్రగతి) ఇబ్బంది పెడుతుంటుంది. కోడ‌లికి గుండెపోటు కూడా వ‌స్తుంది. అందుకు బేబీనే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు భావించ‌డంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయిన ఆమె 24 ఏళ్ల ప‌డుచు పిల్ల స్వాతి (స‌మంత‌)గా మారిపోతుంది. దాని వ‌ల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? కొత్త జీవితంలోకి వ‌చ్చిన విక్ర‌మ్ (నాగ‌శౌర్య‌) ఆమెను ఎలా చూసుకున్నాడు? ఆమె వల్ల ఆమె మ‌న‌వ‌డు రాఖీకి జ‌రిగిన లాభం ఏంటి? య‌వ్వ‌నం వ‌చ్చాక స్వాతి రూపంలో ఉన్న జీవితం ఆనందాన్ని క‌లిగించిందా? లేకుంటే బేబీగానే బావుంద‌నుకుంటుందా? స్వాతినే బేబి అని తెలిశాక చంటి, కుమారుడు శేఖ‌ర్ (రావు ర‌మేష్‌) ఎలా స్పందించాడు? తదిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : కొరియ‌న్ చిత్రం మిస్ గ్రానీకి రీమేక్‌ అయినా ఓ బేబీ చిత్రం తనదైన శైలిలో అదరహో అనిపించింది. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఆమె కథను చిత్రీకరించిన తీరు అభినందనీయం. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలతో పోల్చితే నందిని రెడ్డి అత్యుత్తమ సినిమాగా ఓ బేబీ నిలుస్తుంది. స‌మంత త‌న పాత్రకి ప్రాణం పోసింది. ప‌డుచు పిల్లగా క‌నిపించే బామ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు చిత్రానికే హైలెట్‌. క‌ళ్లతో, హావ‌భావాల‌తోనే ఆమె అభిన‌యం ప్రద‌ర్శిస్తూ న‌వ్విస్తారు, ఏడిపిస్తారు. సీనియర్ నటి లక్ష్మి గురించి కొత్తగా చెప్పేదేముంది.  సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా తన పాత్ర పరిధిలో చక్కగా నటించాడు.. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొదటి సగం మొత్తం చక్కని కామెడీ సన్నివేశాలతో పాటు సున్నితమైన ఎమోషన్స్ తో అలరించిన నందిని, పతాక సన్నివేశాలలో చక్కని ప్రతిభతో ఆకట్టుకున్నారు. సినిమాకి ఆమె రాసుకున్న ముగింపుకూడా ప్రేక్షకుడికి నచ్చేలా ఉంది.

మైనస్  పాయింట్స్ : సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను తగ్గిస్తే బాగుండు అని భావన కలుగుతుంది.  మూవీ నెమ్మదించడంతో పాటు,తరువాత సన్నివేశాలు తేలికగా ఊహించే విధంగా ఉన్నాయి.

సాంకేతిక వర్గం : నందిని రెడ్డి సినిమాలంటే కలర్ ఫుల్ గా ఉంటాయి.  ఈ మూవీ కూడా అలాగే ఉన్నది.  గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నందిని ఆకట్టుకుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి హృదయాలకు హత్తుకునేలా చిత్రీకరించడంలో కెమెరా మెన్  రిచర్డ్ ప్రసాద్ ప్రతిభ కనబడుతుంది.  మిక్కీ జే మేయర్  మ్యూజిక్‌తో పాటు ఆర్ ఆర్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌కు 10నిమిషాల కత్తెర పడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు : ఓ బేబీ మూవీ ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా. సమంత అంతా తానై అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఆమె ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తుంది. ఓ బేబీ కచ్చితంగా చూడాల్సిన సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు.

రేటింగ్ : 4.5/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.