(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: గద్దలకొండ గణేష్

September 20, 2019,   4:16 PM IST
Share on:
రివ్యూ: గద్దలకొండ గణేష్

 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'వాల్మీకి. మనుషులు చాలా డబ్బు సంపాదిస్తారు.. కానీ నేను చాలా భయం సంపాదించాను. ఈ ఒక్క డైలాగ్‌తో క్యారెక్టర్ తో సినిమానీ నడిపించేశాడు దర్శకుడు హరీష్. 'వాల్మీకి' టైటిల్‌తో మొదలై, 'గద్దలకొండ గణేశ్'‌‌గా మారి విడుదలైన వరుణ్ తేజ్ మూవీ, జిగర్తాండ అనే తమిళ సినిమా రీమేక్. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. మరి గద్దలకొండ గణేష్ గా వరుణ్ ఎంత వరకు మెప్పించారో సమీక్షలో చూద్దాం.

కథ: అభిలాష్ (అధర్వ) సినిమాపై ఉన్న మక్కువతో మూవీ డైరెక్టర్ అవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు.ఒక సీనియర్ దర్శకుడితో ఎలాగైనా ఒక ఏడాదిలో సినిమా తీస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ క్రమంలో గద్దలకొండ గణేష్ అనే ఓ దాదా దగ్గరకు చేరతాడు. అతని జీవితం నేపధ్యంలో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో అభిలాష్ గురించి తెలుసుకున్న గద్దలకొండ గణేష్, తన గురించి కాదు, తానే హీరోగా సినిమా తీయాలని అభిలాష్ ని బెదిరిస్తాడు. మరి అభిలాష్ గద్దలకొండ గణేష్ తో సినిమా తీశాడా? అసలు ఈ గద్దలకొండ గణేష్ ఎవరు? సినిమా డైరెక్టర్ కావాలని కలలుకన్న అభిలాష్ కోరిక తీరిందా? గద్దలకొండ గణేష్ మరియు అభిలాష్ ల కథ చివరికి ఎలా ముగిసింది? అన్నది తెరపైన చూడాలి.

ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాను వరుణ్‌తేజ్‌ వన్‌మెన్‌షోగా అభివర్ణించవొచ్చు. గద్దలకొండ గణేష్‌గా పవర్‌ఫుల్‌ డాన్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం అనిపిస్తుంది. పూజాహెగ్డే క‌నిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా... ఆక‌ట్టుకున్నారు. ఎల్లువొచ్చి గోదార‌మ్మ... రీమిక్స్ పాట‌లో వ‌రుణ్‌, పూజా చేసిన సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. అధర్వ, మృణాళిని పాత్రల ప‌రిధి మేర‌కు చక్కగా న‌టించారు. ద‌ర్శకుడిగా ఎద‌గాల‌నే త‌ప‌న ఉన్న యువ‌కుడి పాత్రలో అధ‌ర్వ మెప్పిస్తారు. స‌త్య, బ్రహ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, అన్నపూర్ణమ్మ, ర‌చ్చరవి, శ‌త్రు త‌దిత‌రుల పాత్రలు కూడా ఆక‌ట్టుకుంటాయి. డింపుల్ హ‌యాతి చేసిన ప్రత్యేక‌ గీతం, ఆమె అందం సూప‌ర్‌హిట్టు అనిపించేలా ఉంది.

మైనస్ పాయింట్స్ : అధర్వ మరియు మృణాలిని రవి మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సత్య కామెడీ తో ఎంటర్టైనింగ్ గా సాగిన ఫస్ట్ హాఫ్ రెండవ సగంలో ఈ రెండు మిస్సయ్యాయి. సినిమా నిడివి కూడా ఇంకాస్త తగ్గించుకుని ఉంటే బాగుండేది.  అలాగే తల్లీ కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాను పండించడంలోనూ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఆ ట్రాక్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా రేంజ్ మారి ఉండేది. అలాగే పూజాహెగ్డేను వదిలేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.


సాంకేతిక విభాగం: దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజిన‌ల్ స్టోరీకి మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. మిక్కీ జె మేయర్ అందించిన నేపధ్య సంగీతం బావుంది. పాటల చిత్రీకరణ కూడా బాగ కుదిరింది. రెండు పాటలు విజువల్ గా బావున్నాయి. ఛాయాగ్రాహ‌కుడు ఐనాంక బోస్ గ్యాంగ్‌స్టర్ సినిమాకి త‌గ్గట్టుగా ప్రత్యేక‌మైన క‌లరింగ్‌, మూడ్‌తో త‌న కెమెరా ప‌నిత‌నాన్ని ప్రద‌ర్శించారు.  14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.  ద‌ర్శకుడిగా హ‌రీష్‌ శంక‌ర్ ప‌నితీరు మెప్పిస్తుంది.

తీర్పు: ఇది గద్దలకొండ గణేష్ వన్ మ్యాన్ షో...

రేటింగ్ :  3/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.