(Local) Fri, 22 Oct, 2021

రివ్యూ: ఏదైనా జరగొచ్చు

August 23, 2019,   4:48 PM IST
Share on:
రివ్యూ: ఏదైనా జరగొచ్చు

టాలీవుడ్‌లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్‌ నటుడు శివాజీ రాజా తనయుడు.. విజయ్‌ రాజాను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఏదైనా జరగొచ్చు. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించగా నూతన దర్శకుడు రమాకాంత్ ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ పెండ్యాలలు పరిచయం అయ్యారు. మరి వీరందరికీ ఈ సినిమా బ్రేక్‌ ఇచ్చిందా..? లేదో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం….

కథ: సులభంగా డబ్బు సంపాదించి జీవితంలో ఎదగాలని ఎప్పుడూ ఆలోచించే జై (విజయ్ రాజా), ఓ ప్రైవేట్‌ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా జాయిన్ అవుతాడు. అటు తరుణంలో జైకి శశిరేఖ(పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ(బాబీ సింహా) జోలికి వెళతారు. ఆ రౌడీ నుండి తమని తాము కాపాడుకొనే క్రమంలో ఈ ముగ్గురు మిత్రులు కాళీ వ్యక్తిగత జీవితాన్ని డిస్టబ్ చేస్తారు.దీనితో ఈ ముగ్గురు కాళీ కోపానికి కారకులవుతారు.  కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ.


ప్లస్ పాయింట్స్: ఈ చిత్రంలో హీరోగా చేసిన విజయ్ రాజా పాత్రను ఎలివేట్ చేశేలా ఎటువంటి ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్స్ లేకుండా కథకు తగ్గట్టుగా పరిచయం చేసిన విధానం బాగుంది. ఉత్కంట కలిగే సన్నివేశాలతో పాటు, సీరియస్ గా నడిచే సన్నివేశాలలో విజయ్ రాజా కొత్తవాడైనప్పటికీ చాలా వరకు మెప్పించారు. విజయ్ రాజా స్నేహితులుగా చేసిన రాఘవ, రవి శివ తేజ మొదటి సగంలో చక్కని వినోదాన్ని పంచడంతో పాటు, రెండవ భాగంలో వచ్చే సీరియస్ సన్నివేశాల్లో కూడా నటనతో ఆకట్టుకుంటారు. ఇక హీరోయిన్ పూజా సోలంకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో తన పరిధిమేర మంచి నటనను కనబరిచింది. తమిళ నటుడు బాబీ సింహాదే ఈ చిత్రంలో కీలకపాత్ర, మాస్ అవతార్ లో కనిపించే సీరియస్ విలన్ పాత్రలో ఆయన అలరించారు. బాబీ సింహా పై వచ్చే కొన్ని సన్నివేశాలు ఉత్కంఠత కలిగిస్తాయి. బాబీ సరసన చేసిన నటి తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది . సెకండ్‌ హాఫ్‌లో వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:  ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా చేసినా, ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. అసలు ట్విస్ట్ రివీల్‌ అయిన తరువాత కూడా కథనం నెమ్మదిగా సాగుతూ విసిగిస్తుంది.మూవీ పతాక సన్నివేశాలు హడావిడిగా ముగించినట్లుగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ లో వచ్చిన కొన్ని వి ఎఫ్ ఎక్స్ సన్నివేశాలు కథకు అవసరం లేదన్న భావన కలిగించాయి.

సాంకేతిక విభాగం: సూపర్‌ నేచురల్‌ పాయింట్‌తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ స్థాయిలో సినిమాను తెరకెక్కించటంలో తడబడ్డాడు.ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించినా తరువాత రొటీన్‌ సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు.ఎడిటింగ్ వర్క్ పర్వాలేదని పించింది.  ఇక కథకు తగ్గట్టుగా కెమెరా వర్క్ సాగింది. చేసింగ్, క్యాచింగ్ సన్నివేశాలలో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.హారర్‌ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తొలి ప్రయత్నంలో శ్రీకాంత్ పెండ్యాల తన మార్క్‌ చూపించలేకపోయాడు.
చిన్న బడ్జెట్ చిత్రాల నుండి భారీ నిర్మాణ విలువలు ఆశించకూడదు కాబట్టి, చిత్ర పరిధిలో నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించాయి.

తీర్పు: మొత్తంగా చెప్పాలంటే ఏదైనా జరగొచ్చు అక్కడక్కడా అలరించే క్రైమ్ నేపథ్యంలో సాగే హారర్ కామెడీ చిత్రం.

రేటింగ్ :  2/5

సంబంధిత వర్గం
బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్...
బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.