(Local) Fri, 17 Sep, 2021

రివ్యూ: దొరసాని

July 12, 2019,   6:48 PM IST
Share on:
రివ్యూ: దొరసాని

రాజశేఖర్, జీవిత చిన్న కుమార్తె అయిన శివాత్మిక కథానాయకురాలిగా, హీరో విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘దొరసాని’. తెలంగాణాలో ఉండే దొరబిడ్డలు అప్పట్లో ఎలా ఉండేవారు. మిగతా వారిని ఎలా చూసేవారు అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. కేవీఆర్ మహేంద్ర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం అందమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్లిని ఆకర్షించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆనంద్‌ దేవరకొండ-శివాత్మిక ఎలా అలరించారు? మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !


కథ : 1980 కాలం నాటి దొరల సంస్కృతి లో జరిగే కథ. తక్కువ కులానికి చెందిన పేద కుటుంబంలో పుట్టిన రాజు (ఆనంద్ దేవరకొండ) దొర కూతురు ‘చిన్న దొరసాని’ దేవకి(శివాత్మిక)ని చూడగానే ప్రేమిస్తాడు. రాజు త‌న‌ను ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకుని మెల్లిగా దేవకి కూడా అత‌ని ప‌ట్ల ఆక‌ర్షితురాల‌వుతుంది. నిదానంగా గ‌డి నుంచి అడుగుబ‌య‌ట‌పెట్టి అత‌న్ని క‌లుసుకుంటుంది. త‌మ మ‌ధ్య ఉన్న ఆక‌ర్ష‌ణ మాత్ర‌మే కాద‌నీ, ప్రేమ అనీ వారిద్ద‌రికీ తెలుస్తుంది.  కానీ, ప్రతి ప్రేమకథలాగానే ఈ ప్రేమకూ ఆస్తులు, అంతస్తులు, కులం, పరువు అడ్డుగోడలుగా నిలుస్తాయి. దేవకి’ ప్రేమ గురించి దొరకు తెలుస్తోంది. దొర వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి కథ ఎలా మలుపు తిరుగుతుంది ?  వాటిని ఈ ప్రేమ జంట ఎలా ఛేదించింది? చివరికి రాజు, దేవకిల కథ ఎలా ముగిసింది? రాజు ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు ? చివరికి రాజు – దేవకి ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : శివాత్మిక రాజశేఖర్ ‘దొరసాని’ పాత్రలో గంభీరంగా కనిపిస్తూ.. కళ్లతోనే ముఖ్యమైన హావభావాలను పలికిస్తూ.. సినిమాలోనే హైలెట్ అని చెప్పాలి. ఆనంద్ దేవరకొండలో నటించాలన్న తాపత్రయం ఉంది కానీ అందుకు తగ్గట్లుగా నటన కనపడలేదు. చాలా చోట్ల నెర్వస్ గా కనిపించారు.  తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా నేపధ్యం, లొకేషన్లు, నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ముఖ్యంగా బయట ప్రపంచం అంటే ఏంటో తెలీని దొరసానితో రాజు ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. సినిమాలో శివాత్మిక రాజశేఖర్ తండ్రిగా నటించిన నటుడు కూడా తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. బలమైన క్లైమాక్స్ తో మెయిన్ ఎమోషన్ హైలెట్ అయింది. 

మైనస్ పాయింట్స్ : పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌ ఇప్పటికే చాలా లవ్ స్టోరీల్లో చూశాం. దాంతో స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏమి లేదు. తెలిసిన కథనే ఫ్రెష్ గా చెప్పాలని చూసాడు.. కథ ముందే తెలిసిపోవడంతో ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయాడు. దొరసాని సినిమా చూస్తున్నంత సేపు మరాఠీలో సూపర్ డూపర్ హిట్ అయిన సైరాత్ సినిమా గుర్తుకు వస్తుంది.  ఫ‌స్టాఫ్ అంతా ఏం క‌థ లేకుండానే సాగిపోయింది. సెకండాఫ్ కూడా క‌థనం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు.

సాంకేతిక విభాగం : సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. కథ నేపథ్యానికి తగ్గ కెమెరా పనితనంతో సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు సన్నీ. ఓ చిన్న సినిమా స్థాయికి మించి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఎడిటింగ్ చాలా వీక్. వ‌చ్చిన సీన్సే మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చాయి. ద‌ర్శ‌కుడిగా మ‌హేంద్ర ఎంచుకున్న క‌థ బాగానే ఉన్నా దాన్ని తెర‌కెక్కించిన విధానం మాత్రం అస్స‌లు ఆక‌ట్టుకోలేదు. 

తీర్పు :   స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం. రెగ్యులర్‌ సినిమాల నడుమ ప్రత్యేకం అనిపించుకోవాల్సిన చిత్రం కాస్తా... ఎందుకు తీసారోనని కారణం వెతుక్కునేట్టు చేయడం బాధాకరం.

రేటింగ్ : 2/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.