(Local) Sat, 06 Jun, 2020

నెక్ట్స్ ఎవ‌రు ... ?

November 21, 2018,   5:17 PM IST
Share on:
నెక్ట్స్ ఎవ‌రు ... ?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికెట్ పడింది. తర్వాత ఎవరు? గతంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. మరో ఇద్ద‌రు  ఎంపీలు కూడా ఎన్నికలకు ముందే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలి. ఒకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే, మరొ ఇద్ద‌రు ఎవరనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి కేటీఆర్ కొండాతో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌ను పిలిపించి మాట్లాడారు. వారు పార్టీ మారడం లేదని ప్రకటించారు. అలా ప్రకటించిన వారం రోజుల్లోనే చేవెళ్ల ఎంపీ టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడంతో మ‌హ‌బూబాబ‌ద్ ఎంపి సీతారాం నాయక్ తో పాటు మ‌రొక ఎంపీ కూడా పార్టీ మారతారా అనే చర్చ జరుగుతోంది. 
ఇప్పటికే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో టచ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో హస్తం నేతలు డీఎస్‌కు కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. అంటే డీఎస్ అధికారికంగా టీఆర్ఎస్‌లో ఉన్నా.. ఆయన మనసు మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంద‌నేది న‌గ్న స‌త్యం.
ఫ‌లించిన రేవంత్ జోస్యం :
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి వస్తారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దమ్ముంటే ఆపుకోవాలని సవాల్ విసిరాడు. అప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి  మైండ్ గేమ్ ఆడుతున్నారని, తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లరని తెరాస నేతలు చెప్పారు. ఇలాంటి మైండ్ గేమ్ ఆపకుంటే బాగుండదని హెచ్చరించారు. స్వయంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సీయం క్యాంప్ కార్యాల‌యంలో కేసీఆర్ తో స‌మావేశం అయిన ఆయ‌న అనంత‌రం మీడియాతో  మాట్లాడుతూ తాము ఎవరం పార్టీ మారడం లేదని ప్ర‌క‌టించారు. కాని కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే  విశ్వేశ్వ‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామ చేయ‌డం, అనంత‌రం ఆయ‌న‌ తెలంగాణ కాంగ్రేస్ వ్య‌వ‌హారాల ఇంచార్జి కుంతియాతో క‌లిసి ఏఐసీసీ ప్ర‌సిడెంట్ రాహుల్ గాంధీతో స‌మ‌వేశం కావ‌డం చ‌క చ‌క జ‌రిగిపోయింది. మరో ఎంపీ సీతారాం నాయక్ కూడా రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కాని అయ‌న మార‌తాడేమో అనే అనుమానాలు పార్టీ వ‌ర్గాల్లో చర్చించుకుంటున్నారు.  టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రేస్‌లో చేరేందుకు చాలా మంది త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని   గ‌తంలోనూ టీ పీసీసీ వ‌ర్కంగ్ ప్ర‌సిడెంట్ మ‌ళ్ళు బ‌ట్టి విక్ర‌మార్క అన‌డాన్ని తేలిగ్గా తీసుకున్న టీఆర్ఎస్ నాయ‌కులు టికెట్ల విష‌యంలో పార్టీలో తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  ప‌లువ‌రు అసంతృప్తులు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో టీఆర్ఎస్ నుండి ఇత‌ర పార్టీలోకి వెళ్ళనీయ కుండా అసంతృప్తుల‌ను బుజ్జ‌గంచేందుకు స్వయంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత రంగంలోకి దిగి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దారు.
మ‌రో బాంబు పేల్చిన రేవంత్ :
తెలంగాణ రాష్ట్ర సమితికి చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాను చెప్పిందే నిజం అవుతోందని అన్నారు. తాను గతంలో ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతారని చెప్పానని, కానీ ఇద్దరు కాదని, ముగ్గురు కాంగ్రెస్‌లో చేరుతారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ఎంపీ బాట‌లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి :
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బాటలోనే ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పయనించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన టీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పబోతున్నారు. బుధవారం లేదా గురువారం ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తమ పార్టీని వీడి, కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. 
తెరాసలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కుదుపు: 
 కొండా విశ్వేశ్వరరెడ్డి దారిలోనే మరో ఇద్దరు ఎంపీలు తెరాసకు రాజీనామా చేస్తారని తెలిరు. డిసెంబర్ 7వ తారీఖు డెడ్‌లైన్ అన్నారు. తెరాస నుంచి మరో రెండు వికెట్లు త్వ‌ర‌లో  పడబోతున్నాయని జ్యోస్యం చెప్పారు. గ‌తంలో తాను  చెప్పినపుడు  పెద్దగా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కొండా రాజీనామా చేశారు. మ‌రి రేవంత్ రెడ్డి  అన్న‌ట్టు పార్టీ మార బోతున్న మ‌రో ఇద్దరు ఎంపీలు ఎవ‌రనే దానిపై పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. డిప్యూటి సీఎం క‌డియం శ్రీ‌హ‌రి సైతం కాంగ్రేస్ గూటికి చేరుతార‌ని గ‌తంలో జోరుగా  ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో తాను పార్టీ మ‌ర‌డం లేద‌ని స్వ‌యంగా ఆయ‌నే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఎప్పుడు ఎవ‌రు పార్టీ  మారుతారో తెలియ‌ని అయోమ‌యం పార్టీలో నెల‌కొంది. తెలంగాణ ద్రోహుల‌కు టీఆర్ఎస్  పార్టీలో పెద్ద పీట వేస్తున్నార‌ని, అస‌లైన తెలంగాణ వాదుల‌కు పార్టీలో స‌రైన గుర్తిపు ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువ‌రు టీఆర్ ఎస్ నాయ‌కులు ఇంటా బ‌య‌టా చ‌ర్చించుకుంటున్నారు.  ఏది ఏమైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు నిజ‌మై వీరు పార్టీని వీడితే మ‌రో రెండు వారాలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది. 
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.