(Local) Mon, 23 Sep, 2019

ఎన్నిక‌ల్లో పోటీ చేయాలనుందా- అయితే ఇవి తెలుసుకోండి.

November 13, 2018,   2:53 PM IST
Views: 265
Share on:
ఎన్నిక‌ల్లో పోటీ చేయాలనుందా- అయితే ఇవి తెలుసుకోండి ...

Image Credit:elections.in
ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చింద‌టే చాలు ప్ర‌తి పార్టీలోనూ ఆశావ‌హులు ఉంటారు. ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న అభిలాష ఉన్నా.. ఈ  అదృష్టం అందరికీ రాదు. అయినా ఓ సారి నామినేష‌న్ పత్రం దాఖలు చేసి అదృష్టం పరీక్షించుకుంటే పోలే అని అనుకొనే వారూ ఎంద‌రో ఉన్నారు. పార్టీల్లో టికెట్ రాక, పార్టీ బీ ఫారం ద‌క్క‌క మ‌రి కొంద‌రు ఉంటారు. అలాంటి వారు ఇకపోతే ఇండిపెంట్‌గా పోటీ చేసేవారు, ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసే వారు  ఉన్నారు. మ‌రి ఇంత‌కీ ఎమ్మెల్యేగా   పోటీ చేసేందుకు ఏయే అర్హతలు ఉండాలో ముందుగా  ఈ నియ‌మ నిబంధ‌న‌లు తెలుసుకోండి. తెలంగాణ‌లో ఎన్నికల న‌గారా మోగింది. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సోమ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో నామినేష‌న్ పత్రాల దాఖ‌లు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.  శాసనసభకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ వరకు నామినేష‌న్  పత్రాలను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేయొచ్చు. ఈ నామినేష‌న్ పత్రాలను స్వీకరించడానికి ఈ నెల 19వ తేదీ వరకు స‌మ‌ర్పించేందుకు తుది గ‌డువు విధించారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాటిని సమర్పించవచ్చు. 
 పోటీ చేయాలంటే ఉండాల్సిన‌ అర్హ‌తలు ...
ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థి  భారత దేశ పౌరుడై ఉండి, నామినేష‌న్ పత్రాలు దాఖలు చేసే రోజు నాటికి 25 సంవత్సరాలు నిండి  ఉండాలి. వారు  రాష్ట్రంలో ఏదేని ఒక నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. ఇక ఏదైన రాజ‌కీయ‌ పార్టీ అభ్యర్థులైతే నలుగురు, స్వతంత్ర అభ్యర్థులైతే 10 మంది ఓటర్లు బలపరచాల్సి ఉంటుంది. బలపరిచేవారు కూడా అదే నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి.  రిజర్వ్‌డ్ కేట‌గిరీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు కుల దృవీక‌ర‌ణ‌కు  సంబంధించిన పత్రం జతచేయాల్సి ఉంటుంది.  జ‌న‌ర‌ల్‌ కేటగిరీ వారు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలను ధరావత్తుగా చెల్లించాలి.  ఫారం- 2బిలో నామపత్రాన్ని దాఖలు చేయాలి. నామ‌నేష‌న్ పత్నాలు  దాఖలు చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నోటరీతో కూడిన అఫిడవిట్‌ సమర్పించాలి. అందులో అభ్యర్థి, తన కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను తెలియ‌ప‌రచాలి. అదేవిధంగా అభ్య‌ర్థి పై ఏవైనా కేసులు ఉంటే వాటి  వివరాలనూ క్రైం నం తో సహా పొందుపరచాల్సి ఉంటుంది.  నామినేష‌న పత్రాల‌ను  దాఖలు చేయడానికి 48 గంటలకు ముందుగా అభ్యర్థులు విధిగా తమ పేరిట ఏదేని గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. ఈ ఖాతా ద్వారానే తన ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు చేయాలి. బ్యాంక్  ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీ ఒక‌టి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికీ ఇవ్వాలి.  అలాగే అభ్యర్థుల త‌మ ఇంటిపన్నులు, కరెంట్‌ బిల్లు, నీటి పన్నులు బకాయిలు లేనట్లుగా ఆయా శాఖ‌ల అధికారుల‌చే జారీ చేయ‌బ‌డిన‌ ధ్రువీకరణపత్రాలు అందజేయాలి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి విధిగా రాజీనామా చేయాలి. ఆ రాజీనామాను ఆమోదించినట్లు ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని ఈ నామ‌నేష‌న్ పత్రాల‌తో పాటు దాఖలు చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లోని అన్ని ఖాళీలను తప్పనిసరిగా పూరించి పూర్తి వివరాలను నమోదు చేయాలి. 
అభ్య‌ర్థుల వివరాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ...
అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్‌ కాపీలను ప్రజలు కావాలంటే ఆ పత్రాలు ఉచితంగానే వారికి అందజేస్తారు. అలాగే వాటిని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను పూర్తిగా వీడియో తీయిస్తారు. ప్ర‌తి మూడు గంటల అనంతరం ఆరోజు వచ్చిన నామినేషన్లపై పూర్తి కసరత్తు చేసి ఎన్నికల కమిషన్‌కు వివరాలు తెలియజేస్తారు. నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌, నోటీస్‌ బోర్డుల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచుతారు.
పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌లు...
నామినేష‌న్ పత్రాలు  దాఖలు చేసే స‌మ‌యంలో ఎన్నికల రిటర్నింగు అధికారి గదిలోకి అయిదుగురు వ్యక్తులనే అనుమతిస్తారు.అభ్యర్థులు తమ బి-ఫారమ్‌, ఎ-ఫారమ్‌లను ఒరిజినల్ వాటినే  అందించాల్సి ఉంటుంది. వీటిని నవంబరు 19 మధ్యాహ్నం 3గంటలలోగా అందజేయవచ్చు. అభ్యర్థులు ఒకటి స్టాంప్‌సైజ్‌, మరోటి పాస్‌పోర్టు సైజ్ ఫొటోల‌ను నామినేష‌న్ పత్రంతోపాటు  అందించాల్సి ఉంటుంది. అదే విధంగా అభ్యర్థి ఓటరు గుర్తింపు కార్డు, అభ్యర్థిని బలపరిచే వారి గుర్తింపుకార్డుల ప్రతులు వాటికి జ‌త చేయాలి. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు జతల నామినేష‌న్ పత్రాలను దాఖలు చేయొచ్చు. ఈ నామినేష‌న్ పత్రాలు  దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞను కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞ చేసినట్లు రిట‌ర్నింగ్ అధికారుల వ‌ద్ద నుండి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి.  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అభ్యర్థి తన సంతకం ఉండే విధానాన్ని విధిగా తెలియజేయాలి. అలాగే బ్యాలెట్‌ యూనిట్‌లో తన పేరును ఎలా ముద్రించాలో వివరించి చెప్పాల్సి ఉంటుంది. అనంతరం తాను చెల్లించిన ధరావత్తుకు సంబంధించి రసీదుతోపాటు ఎన్నికల ఖర్చును నమోదు చేసే నిర్ణీత నమూనాలోగల రిజిస్టరును ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి తీసుకోవాలి. అభ్యర్థులపై ఏమైనా క్రిమినల్‌ కేసులు ఉంటే వారే మూడు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనల ద్వారా వాటిని బహిర్గతం చేయాలి. ఆయా ఖర్చులు లెక్క చూపాలి.  ప్రతి ఎన్నికల నామినేషన్‌ కేంద్రంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.  

 

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.