(Local) Fri, 22 Nov, 2019

సొసైటీ ఛైర్మన్ నుంచి స్పీకర్ దాకా… పోచారం ప్రస్థానం

January 20, 2019,   5:45 PM IST
Share on:
సొసైటీ ఛైర్మన్ నుంచి స్పీకర్ దాకా… పోచారం ప్రస్థాన ...

నిజామాబాద్ జిల్లాలోని పోచారం గ్రామానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపేరు ‘పరిగె’ అయినప్పటికీ ఆయన తన స్వస్థలం పేరునే ఇంటిపేరుగా మార్చుకునేలా ప్రజలతో మమేకమై గుర్తింపు పొందారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుకునే వయసులో పాల్గొని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధానికి గురయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర సాధన కోసం చదువును సైతం ఆపివేశారు. వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమైన పోచారం 1977లో రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరుపున దేశాయిపేట్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980లో కాంగ్రెస్ తరఫున సమితి అధ్యక్షుడిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో 1984లో ఆ పార్టీలో చేరి 1985లో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు. 1987లో బుర్గి సొసైటీ చైర్మన్‌గా ఎన్నికై ఆ తర్వాత జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989లో తెలుగుదేశం తరఫున ఎంపిగా పోటీచేసి ఓడిపోయారు. 1991 నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఏడుసార్లు, రాష్ట్ర కార్యదర్శిగా రెండుసార్లు పదవులు చేపట్టారు. అనంతరం 1994లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుపొంది 1998లో గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రాష్ట్ర బొగ్గు గునుల శాఖ మంత్రిగా, 2000 సంవత్సరంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌పై పోటీచేసి ఓడిపోయారు. 2009లో తెలుగుదేశం తరఫున గెలుపొందినా 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ఎంఎల్‌ఏ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో 2011లో జరిగిన ఉపఎన్నికల్లో తిరిగి పోచారం విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ గెలుపొంది వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లోనూ బాన్సువాడ నుంచి గెలుపొందారు. 15 సంవత్సరాలపాటు బాన్సువాడ శాసనసభ్యులుగా కొనసాగారు.

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.