(Local) Sat, 15 Aug, 2020

జాతీయ రహదారుల ఏర్పాటుకు రూ 15 లక్షల కోట్లు

June 06, 2019,   1:31 PM IST
Share on:
జాతీయ రహదారుల ఏర్పాటుకు రూ 15 లక్షల కోట్లు

జాతీయ రహదారుల ఏర్పాటుకు రూ 15 లక్షల కోట్లు వెచ్చిస్తామని, ఇందులో భాగంగా హైవే గ్రిడ్ ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మోడీ కేబినెట్‌లో అత్యంత కీలకమైన రవాణా, హైవేలు, ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకున్న గడ్కరీ వార్తాసంస్థలతో తొలిసారిగా మాట్లాడారు. రాదారుల విస్తరణ కీలకమైన ఘట్టం అని, ఇది మరింత సమర్థదంతమైన అనుసంధాన ప్రక్రియగా సాగేందుకు భారీ స్థాయి కేటాయింపులు ఉంటాయని గడ్కరీ తెలిపారు. ఖాదీ, చిన్న, మధ్య తరహా రంగ సంస్థల ఉత్పత్తులకు సరైన ప్రపంచ మార్కెట్ కల్పించడం ద్వారా తలసరి వృద్ధి రేటు (జిడిపి)ని ఉజ్వలం చేయడం జరుగుతుందని చెప్పారు. గడ్కరీ గతంలో కూడా ఈ మంత్రిత్వశాఖ బాధ్యతలనే తీసుకున్నారు. ఖాదీ, ఇతర స్వదేశీ ఉత్పత్తులకు విశేష ప్రచారం కల్పిస్తే అవి అంతర్జాతీయ స్థాయిలో సరైన విధంగా మనకు తగు ఆదా యం తెచ్చిపెడుతాయని, ఈ విధంగా జిడిపి పెరుగుతుందని గడ్కరీ విశ్లేషించారు. హైవేల పటిష్టత, కొత్తవి నిర్మించడం ఇక స్వదేశీ ఉత్పత్తులకు సరైన విక్రయ వ్యవస్థ కల్పించడం వంటివి తనకున్న పలు ఆలోచనలు అని, వీటిని సరైన విధంగా అమలులో పెడుతామని స్పష్టం చేశారు. హైవేలకు భారీ స్థాయి పెట్టుబడులకు సరైన బ్లూప్రింట్ ఇప్పటికే సిద్ధం అయిందని, ఇదంతా కూడా ఒక గ్రిడ్‌గా ఉంటుందని, రూ 15 లక్షల కోట్లతో ఏర్పాటు కాబోయే జాతీయ రాదార్లలో 22 హరిత రాదార్లు పర్యావరణ పరిరక్షణ దిశలో ఉంటాయని, పవర్ గ్రిడ్‌తో సమానంగా గ్రిడ్ ఆఫ్ రోడ్ ఏర్పాటు జరుగుతుందని, దేశానికి ఇంధన శక్తి ఎంత అవసరమో, సరైన రాకపోకల వ్యవస్థ కూడా అంతే అవసరం అని, దీని వల్లనే పలు అనుబంధ రంగాలు సరైన విధంగా వృద్ధి చెందేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. రాదార్ల విషయంలో తమ మంత్రిత్వశాఖ వచ్చే 100 రోజుల నిర్ణీత కార్యక్రమాన్ని ఖరారు చేసుకుందని లక్షానికి అనుగుణంగానే కదలిక వేగవంతం అవుతుందని గడ్కరీ చెప్పారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గడ్కరీ షిప్పింగ్, జల వనరులు, గంగా పునరుజ్జీవ, నదుల అభివృద్థి వంటి పలు మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. మొత్తం కలిపి ఈ మంత్రిత్వశాఖ పరిధిలో రూ. 17 లక్షల కోట్లు వెచ్చించారు. ఇందులో జాతీయ రాదారుల రంగానికి రూ 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మోడీ అఖండ విజయం వెనుక పార్టీలు, కలాలు మతాలు వర్గాలకు అతీతమైన అంశం ఉందని, ప్రజలంతా అభివృద్ధిని ప్రాధాన్యతాంశంగా ఎంచుకుంటున్నారని, ఈ క్రమంలోనే మోడీని ప్రజలు నమ్మారని ఘన విజయం అందించారని గడ్కరీ తెలిపారు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులను వంద రోజులలో సరైన విధంగా ముందుకు తీసుకోవడానికి తాను ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. అన్నిఅంశాలపై తాను సమీక్షించినట్లు, ఆర్థిక చిక్కులతో ఇప్పటికీ 225 ప్రాజెక్టులు కదలడం లేదని వెల్లడైందన్నారు. ఇప్పటివరకూ హైవేల నిర్మాణానికి బిడ్డర్స్ ఎక్కువగా ముందుకు రాలేదని, అయితే ఇప్పుడు ఆ వాతావరణం లేదని, అంతా తిరిగి పట్టాలపైకి వచ్చిందని, ఇక రాదార్ల పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. ఇక సూక్ష్మ చిన్న తరహా మంత్రిత్వ శాఖ లక్షాల గురించి తెలియచేస్తూ ఖాదీకి సరైన ఆదరణ దక్కేలా చేస్తామని, పీచు పరిశ్రమతో చిన్న తరహా పరిశ్రమలు విలసిల్లుతాయని, దీనిని ఇప్పటి రూ పదివేల కోట్ల ఆర్థిక స్థితిగతి నుంచి రూ 20,000కోట్ల స్థాయికి చేర్చే లక్షం పెట్టుకున్నట్లు తెలిపారు. ఆదాయ వనరులు పెరగడం,ఉద్యోగ ఉపాధి కల్పన దక్కడం వంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా సరైన జిడిపికి మార్గం ఏర్పడుతుందని వెల్లడించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.