(Local) Mon, 26 Aug, 2019

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం

June 06, 2019,   3:44 PM IST
Share on:

కాంగ్రెస్ శాసన సభ పక్షాన్ని తెరాసలో విలీనం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలంటూ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. అనంతరం ఈ ఎమ్మెల్యేలంతా కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

తాజాగా గురువారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి తెరాసలో చేరికపై చర్చించారు. దీంతో సీఎల్పీని తెరాసలో విలీనం చేసేందుకు అవసరమై మెజార్టీ సమకూరింది.

సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ శాసనసభ్యుల సంఖ్య 18కి పడిపోయింది. ఇక 18 మంది ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతులంటే 12 మంది సంఖ్యాబలం ఉంటే చాలు. ఈ నేపథ్యంలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సభాపతికి అందజేశారు. గతంలో తెదేపా శాసనసభాపక్షం, కాంగ్రెస్ శాసనమండలి పక్షం ఇలాగే తెరాసలో విలీనమయ్యాయి. మరోవైపు తాజా పరిణమాలు కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు మింగుడపడటం లేదు. సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్న భట్టి విక్రమార్క.. పార్టీ నేతలతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.