(Local) Sat, 19 Oct, 2019

సీఎంను మాజీ గవర్నర్ రాజకీయంగా ఢీ కొట్టగలరా...?

September 20, 2019,   4:47 PM IST
Share on:
సీఎంను మాజీ గవర్నర్ రాజకీయంగా ఢీ కొట్టగలరా...?

గవర్నర్ వంటి అత్యున్నత రాజ్యాంగపదవులు చేపట్టిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. అయితే ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ... మహారాష్ట్ర గవర్నర్‌గా ఇంతకాలం బాధ్యతలు నిర్వర్తించిన సీహెచ్‌. విద్యాసాగర్‌రావు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగిడడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే అంశంతో పాటు... చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి. తెలంగాణాలో భారతీయ జనాతా పార్టీ బలపడాలని తహతహలాడుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి అభ్యర్థులు నలుగురు  ఎంపీలుగా గెలవడంతో... ఆ అత్యుత్సాహం ఆ పార్టీలో మరింతెక్కువగా కనిపిస్తోంది. దాంతో పాటే... రోజురోజుకూ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితేం బాగా లేకపోవడం... పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు... ఓవైపు శాసనసభలో, మరోవైపు శాసనమండలిలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి మరింత బలహీనంగా మారుతున్న పరిస్థితుల్లో బహుశా ఆ గ్యాపును తాము పూరించాలన్న యోచన బీజేపి అధిష్ఠాన శ్రేణులు చేస్తుండవచ్చు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడక్కడా దెబ్బలు తగిలినా... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మోడీ ఛరిష్మానో, అమిత్‌షా మంత్రాగమోగానీ... బీజేపి హవా కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అయితే ఆ పరిస్థితి తెలంగాణాలో మాత్రం ఆ స్థాయిలో కనిపించకపోవడానికి రాష్ట్ర బీజేపి నాయకత్వ లోపమో... అంతర్గత కలహాలో ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పుంజుకునేందుకు అడ్డంకులుగా మారాయన్న విశ్లేషణలూ జరుగుతూనే ఉన్నాయి. అయితే అదే సమయంలో నాల్గు ఎంపీ సీట్లను బీజేపి రాష్ట్రంలో గెల్చుకోవడంతో... బీజేపి శ్రేణుల్లో నూతనోత్సాహం కూడా కనిపిస్తోంది. ఈక్రమంలోనే... తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకొచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితిలోని అంతర్గత కలహాలు... ఉద్యమకారులను పక్కనబెట్టి... వ్యతిరేకులకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు... సంస్థాగతంగా తిరుగబావుటా ఎగురేస్తున్న రెబల్స్‌ వాయిస్‌... దాంతో పాటే రెండోసారి అధికారంలోకొచ్చాక ఎంతో కొంత పెరుగుతున్నట్టు కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ బలహీనపడటం వీటన్నింటినీ... క్యాచ్‌ చేసుకోవాలన్నది బీజేపి యోచనగా కనిపిస్తోంది. అంతవరకూ ఓకే. కానీ... బీజేపికి ఇప్పటివరకూ కూడా తెలంగాణా రాష్ట్రంలో పార్టీనెలా నడిపించాలన్న ఒక యాక్షన్ ప్లాన్‌గానీ... ఉద్యమ నాయకుడిగా రెండుసార్లు తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కేసీఆర్ వంటి కొండను ఎలా ఢీకొట్టాలన్న ఒక వ్యూహం కానీ స్పష్టంగా ఉందా అన్నది మాత్రం అర్థం కావడంలేదు.

తమ వ్యూహాలు తమకున్నట్టుగా బీజేపి నేతలు చెప్పుకోవచ్చుగాక... కానీ, టీఆర్ఎస్‌ను కాదని బీజేపికి తెలంగాణాలో అధికారం కట్టబెట్టాలన్న విశ్వాసాన్ని తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బీజేపి కల్పించగల్గుతుందా... అసలా దిశగా అడుగులేమైనా వేస్తోందా అన్నది ఇప్పటికైతే అనుమానంగానే కనిపిస్తోంది. ఈక్రమంలోనే... కేసీఆర్ సామాజికవర్గం ఆయనకు బలంగా నిల్చుంటున్న తరుణంలో... అదే సామాజికవర్గానికి చెందిన మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావును మరోసారి రాజకీయ కురుక్షేత్రంలోకి దింపిందా అనే చర్చ ఊపందుకుంది. కొన్నివర్గాలైతే... విద్యాసాగర్‌రావుకే రాష్ట్ర పగ్గాలప్పచెప్పి ... ఆయన్ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారంటుంటే... కేసీఆర్‌కూ, విద్యాసాగర్‌రావుకూ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో పార్టీకి నష్టం కల్గే అవకాశముండొచ్చన్న భావనతో అంత పెద్ద బాధ్యతలిస్తారా అనే వాదన కూడా వినిపించేవారు లేకపోలేదు.

అయితే ఒకవేళ విద్యాసాగర్‌రావుకు అనుకున్నట్టే తెలంగాణా రాష్ట్ర బీజేపి పగ్గాలప్పజెప్పి... ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే... రాష్ట్ర పార్టీలో ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలు మరింత భగ్గుమంటాయా... లేక, వాటిని చెన్నమనేని అదుపులోకి తీసుకొచ్చి పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఏకతాటిపై నడిపిస్తారా అన్నది పార్టీకి సంబంధించిన విషయం కాగా... అసలు విద్యాసాగర్‌రావు... రాజకీయంగా కేసీఆర్‌ను ఢీకొట్టగల్గుతారా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. విద్యాసాగర్‌రావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర సహాయమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిననప్పటికీ... స్టేజ్‌పై ఒక మేధావి తరహాలో స్పీచులివ్వగల్గినప్పటికీ... కేసీఆర్ ప్రసంగాలను మించి మాస్‌ను ఆకట్టుకోగల్గుతారా అన్నది మరో ప్రశ్న. ఆవిషయంలో ఇప్పటికైతే కేసీఆర్‌ను ఓ ఛాంపియన్ అని కూడా చెప్పక తప్పదు. సాధారణంగా గవర్నరంటే రాజ్యాంగ అత్యున్నత పదవి. అలాంటి పదవి నుంచి అయితే కేంద్రంలో మంత్రిత్వశాఖలోకో... లేక ఇంకెక్కడైనా గవర్నర్‌గా వెళ్లడమో... లేక ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులే లక్ష్యంగా అడుగులు పడటం గతంలో పలువురిని గమనించినప్పుడు మనకు కనిపిస్తుంటుంది.

ఎందుకంటే ఒక్కసారి రాజ్యాంగ హోదా కలిగిన  గవర్నర్‌ వంటి అత్యున్నత పదవులను అలంకరించినవాళ్లు... మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం... అదీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి క్రియశీలకంగా వ్యవహరించడమంటే కొంత హోదా కూడా అడ్డువచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే అవన్నింటినీ పక్కనబెట్టేసి... ఇప్పుడు విద్యాసాగర్‌రావు మళ్లీ పార్టీ కార్యకర్తగా బీజేపి సభ్యత్వం తీసుకోవడంతో... తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లోకి చెన్నమనేని మరోసారిచ్చిన ఎంట్రీ చర్చకు తెరలేపుతోంది. ఈనేపథ్యంలో... అంతా అనుకున్నట్టే జరిగితే... తెలంగాణా రాష్ట్ర బీజేపి పగ్గాలు చెన్నమనేనికి అప్పజెప్పినా... లేక అప్పజెప్పకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా... లేదా పార్టీ పగ్గాలు మాత్రమే అప్పజెప్పి... ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మరొకరిపై దృష్టి సారించినా... విద్యాసాగర్‌రావు పాత్ర మాత్రం తెలంగాణా రాష్ట్ర బీజేపిలో మాత్రం ప్రధానమైందనే చెప్పకతప్పదు. 

ఈక్రమంలో... మరి మాజీ గవర్నర్‌... ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎంతవరకూ ఢీకొట్టగల్గుతారన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోండగా... సామాజికవర్గ సమీకరణలు, ఇప్పుడు రాష్ట్ర పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల నేపధ్యంలో... ఇంతకాలం పార్టీకి దూరంగా ఉండి గవర్నర్‌ వంటి అత్యున్నత హోదాలో పనిచేసిన వ్యక్తి చూపించే మెచ్యూరిటీ పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తుందనే యోచన... ఇలాంటి వ్యూహాలతోనే... బీజేపి అధిష్ఠానం సాగర్‌జీని తెలంగాణాలో మరోసారి క్రియాశీల రాకీయాల్లోకి దింపుతోందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

సంబంధిత వర్గం
ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.