(Local) Mon, 30 Nov, 2020

ముగిసిన కాశ్మీర్ జెండా ప్రస్థానం...

August 06, 2019,   11:50 AM IST
Share on:
ముగిసిన కాశ్మీర్ జెండా ప్రస్థానం...

భారతదేశంలో త్రివర్ణ పతాకంతో పాటు అధికారికంగా జెండాను ఎగరవేసే హక్కు ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూకశ్మీర్ మాత్రమే. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా జాతీయ పతాకంతో పాటు కశ్మీర్ జెండాను ఎగరవేస్తారు. ఎరుపురంగులో మూడు గీతలు, ఓ నాగలితో ఈ జెండాను రూపొందించారు. ఇందులో ఎరుపు రంగును త్యాగానికి, మూడు గీతలను మూడు మతాలకు(ముస్లింలు-బౌద్ధులు-హిందువులు) ప్రతీకగా రూపొందించారు.
కశ్మీర్ లో డోగ్రా రాజుల పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన రాజకీయ ఉద్యమంలో ఈ జెండా పురుడు పోసుకుంది. 1931, జూలై 13న శ్రీనగర్ సెంట్రల్ జైలు వద్ద ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరపడంతో 21 మంది చనిపోయారు. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి రక్తంతో తడిచిన తన చొక్కాను ఎరగవేశాడని స్థానికులు చెబుతారు. ఈ రోజును జమ్మూకశ్మీర్ లో మృతవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. దీంతో ఈ జెండాకు తుదిరూపునిచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తమ పార్టీ జెెండాగా మార్చుకుంది. 1952, జూన్ 7న అసెంబ్లీ దీన్ని రాష్ట్ర జెండాగా ఆమోదించింది.
అదే ఏడాది రాష్ట్ర అధికారాలను నిర్వచించే ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, జమ్మూకశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లాలు సంతకాలు చేశారు. జమ్మూకశ్మీర్ జెండా విషయంలో కూడా ఒక ఒప్పందం జరిగింది. త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా ఉంటే, ఇది రాష్ట్ర జెండాగా ఉంటుందని అంగీకారం కుదిరింది. రెండు జెండాలను ఎగరేసే అధికారం కూడా రాష్ట్రానికి దక్కింది.

జెండా రూపశిల్పి ఎవరు?

జమ్మూకశ్మీర్ జెండా రూపశిల్పి ఎవరనేదానిపై స్పష్టత లేదు. అయితే, మోహన్ రైనా అనే వ్యక్తి పేరు మాత్రం వినిపిస్తుంటుంది. ఈయన కళాకారుల కుటుంబానికి చెందిన వ్యక్తి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ జెండాను ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ కమ్యూనిజం భావజాలంతో స్ఫూర్తిపొందడమే అని కశ్మీర్ రాజకీయ విశ్లేషకులు గుల్ వాని బీబీసీకి చెప్పారు. ''ఈ జెండా రాజకీయ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది'' అని ఆయన తెలిపారు

ఆర్టికల్ 370 రద్దుతో ఇక మిగతా రాష్ట్రాలలాగే

జాతీయ జెండాతోపాటు సొంత జెండా కలిగి ఉండటానికి ఆర్టికల్‌ 370 జమ్ము కాశ్మీర్‌కు అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు జమ్ము కాశ్మీర్‌ ప్రత్యేక జాతీయ పతాకం కలిగి ఉండాలంటే.. పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు పౌరసత్వాలు, రెండు జాతీయ పతాకాలు, ప్రత్యేక రాష్ట్ర జెండా వంటివి జమ్ము-కాశ్మీర్ లో ఉండే అవకాశం లేదు.

 

సంబంధిత వర్గం
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.