(Local) Sun, 20 Jun, 2021

ఏపీలో కొత్త పథకాలకు పైసలేవీ?

October 19, 2019,   11:39 AM IST
Share on:
ఏపీలో కొత్త పథకాలకు పైసలేవీ?

ఆంధ్ర ప్రదేశ్ గత  ప్రభుత్వం  ఖాళీ ఖజానాను ఇచ్చారని జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు  చెబుతూ వచ్చింది . వేలకోట్ల రూపాయల బిల్లుల చెల్లింపును పెండింగులో పెట్టారని గణాంకాలను వివరిస్తోంది. ఉద్యోగుల వేతనాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు, సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతోంది. నవరత్నాలతో పాటు వాహన మిత్ర, రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, వివిధ వర్గాల కార్మికుల కు వేతనాల పెంపు ప్రకటనలు చేస్తున్నారు. కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. మరి, వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఇప్పుడు ఆంధ్ర ప్రజల ముందర వున్న ప్రశ్న.

నవ్యాంధ్రలో మే 30న జగన్ ప్రభుత్వం ఏర్పడింది. విజయవాడలో వేల మంది ప్రజలు, నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హామీ ఇచ్చిన ప్రకారం మొదట నవరత్నాలపై జగన్ దృష్టి పెట్టారు. వివిధ వర్గాలకు ఆర్థికంగా మేలు చేసే ప్రకటనలు వెలువరించారు. వేతనాల పెంపు, అమ్మ ఒడి, రైతులకు సాయం తో పాటు అందరికీ అన్నీ అనే విధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, నిధుల కొరత వేధిస్తున్నా కొత్త కొత్త పథకాలను జగన్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన వాటిని అమలు చేయడం మొదలుపెట్టారు. మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా పథకానికి నిధులను సమకూర్చడం ఆర్థిక శాఖకు తలకు మించిన భారమైంది. చివరకు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లాల్సి వచ్చింది. ఆర్ బి ఐలో బాండ్ల విక్రయం, ఇతరత్రా మార్గాల ద్వారా రైతు భరోసాకు నిధులను సమకూర్చారు. ఇది చాలదన్నట్టు, బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో చేనేత కార్మికులు, మత్స్యకారులు ఇతర వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆ పథకాలను అమలు చేస్తే మరికొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయనేది మాత్రం ప్రస్తుతానికి అంతుపట్టకుండా ఉంది.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మరో పథకం, వైఎస్సార్ రైతు భరోసా. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఇచ్చే 6 వేల రూపాయలకు మరో ఏడున్నర వేల రూపాయలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకు 13 వేల 500 రూపాయలు ఇచ్చే పథకం ఇది. నెల్లూరులో మంగళవారం నాడు ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు భరోసా పథకానికి అతి కష్టం మీద ఆర్థిక శాఖ నిధులను సమకూర్చింది. జగన్ ప్రభుత్వం మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ వద్దకు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. అలా 800 కోట్లు వచ్చాయి. ఆర్ బిఐలో బాండ్ల వేలం ద్వారా మరో వెయ్యి కోట్లు సమకూరాయి. వేజ్ అండ్ మీన్స్ ద్వారా మరో 1500 కోట్లు సమీకరించారు. అలా, మొత్తం మీద 3వేల కోట్ల రూపాయలను సిద్ధం చేశారు. అప్పటికే ఖజానాలో ఉన్న కొద్ది పాటి నిధులతో కలిపి రైతు భరోసా కిందర అన్నదాతల బ్యాంకు ఎకౌంట్లలోకి డబ్బులు జమ చేయగలిగారు. బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో కూడా జగన్ ఈ విషయం చెప్పారు. రైతు భరోసా నిధుల కోసం చాలా ఇబ్బంది పడ్డామని, ఇంకా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఎక్కుడన్నాయని ప్రశ్నించారు. అయినా, నేతన్న నేస్తం ఇతర కొత్త పథకాలను ప్రకటించారు. చేనేత కార్మికులకు ఏటా 24 వేల రూపాయలను బ్యాంకు ఎకౌంట్లో వేయబోతున్నారు. అలాగే మత్స్యకారులకు, జూనియర్ న్యాయవాదులకు, ఆర్థిక సహాయం, మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంపు, ఆర్టీసీలో 3677 కొత్త బస్సుల కొనుగోలుకు వెయ్యి కోట్ల రూపాయల అప్పు ఇవ్వాలని, డిస్కంలకు రుణం, బోర్ల తవ్వకానికి రాయితీలు వగైరా పథకాలను మంత్రివర్గం ఆమోదించింది. వీటికి వేల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించిన శ్వేత పత్రం ఇదే చెప్తోంది. తాము అధికారంలోకి వచ్చే నాటికి 3 లక్షల 61 వేల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. పెండింగు బిల్లులు చెల్లించడం పెద్ద సమస్యగా మారిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వృథా ఖర్చులు, దుబారా చేయడం వల్ల ఖజానా ఖాళీ అయిందని చెప్పారు.బుధవారం మంత్రివర్గ సమావేశం సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి చర్చ జరిగింది. నిధులు ఎక్కడ ఉన్నాయని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం 65 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో పెట్టి పోయిందన్నారు. వాటిని సర్దుబాటు చేయడానికి తల్లకిందులుగా తపస్సు చేస్తున్నామని అన్నారు. రైతు భరోసా పథకం కోసం ఐదు వేల కోట్లు సమీకరించడానికి తిప్పలు పడ్డామని వివరించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రులతో చెప్పారు. మరి, కొత్త పథకాలకు నిధుల సమీకరణ కోసం ఎలాంటి మార్గాలను అన్వేషిస్తారనేది ప్రశ్న.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.