(Local) Sun, 20 Jun, 2021

"కరీంనగర్‌ లో కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమేనా...?"

September 27, 2019,   11:03 AM IST
Share on:

125 ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన  కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ జవసత్వాలను కోల్పోతుందా...? ఇప్పటికే రాష్ట్రస్థాయిలో బలహీనపడిపోవడంతో పాటు... శాసనసభా, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన అధికార టీఆర్ఎస్ దెబ్బకు... ఆ పార్టీ శ్రేణుల్లో భవిష్యత్తుపై నైరాశ్యం నెలకొందా...? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపిలు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో... ప్రధాన నేతలంతా ఒక్కొక్కరుగా హస్తానికి చేయిచ్చి వెళ్లిపోతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌కు అసలా పరిస్థితెందుకొచ్చింది...? నాయకత్వ లోపమా... అంతర్గత విభేదాలా... వరుస ఓటములా...ఇటు రాష్ట్రంలో కొనసాగుతున్న అధికార టీఆర్ఎస్ హవా, అటు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న కమల వికాస ఆకర్షణలా...? ఎందుకు కాంగ్రెస్‌ నీరుగారిపోతోందన్నదే ఇప్పుడు ప్రధానమైన చర్చ.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగు వెలిగింది. కానీ ఇఫ్పుడు... ఆపార్టీకి ఒక్కొక్కరుగా బడా నేతల నుంచి కిందిస్థాయి లీడర్ల వరకూ దూరమైపోతున్నారు. కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్టు... కాంగ్రెస్ కథ ఖతమైపోతుండటానికి పలు కారణాలుండవచ్చు కూడా. కాంగ్రెస్‌ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ అని అప్పుడప్పుడూ వి.హన్మంతరావు వంటి సీనియర్ లీడర్లు చెబుతుంటారు. ఇప్పుడా అంతర్గత ప్రజాస్వామ్యమే హద్దులు దాటి... అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీలు, మండలాలు, గ్రామాల వరకూ గమనించినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపు  రాష్ట్ర స్థాయి, మిగిలిన జిల్లాలు, మండలాలు, గ్రామాల విషయాన్ని పక్కనబెట్టి... ఉమ్మడి కరీంనగర్ జిల్లానే ఓ ఉదాహరణగా తీసుకుంటే... మరింత స్పష్టంగా అంతర్గత విభేదాలకు కాంగ్రెస్ పార్టీ ఓ కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తుంటుంది. దీంతో కాంగ్రెస్ ఖేల్‌ ఖతమైపోతోందన్న వార్తలూ మిన్నంటుతున్నాయి.

ఓవైపు రాష్ట్రంలో రెండోసారి కూడా అధికారపీఠమెక్కిన కారు దూసుకెళ్తుంటే... మరోవైపు కాంగ్రెస్ స్థానాన్ని బీజేపి భర్తీ చేస్తోందా అనే విషయం కూడా ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోని పలువురు ముఖ్య నేతలతో పాటు... ఇప్పటికే కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, కిందిస్థాయి శ్రేణులన్నీ అయితే టీఆర్ఎస్, లేదా బీజేపివైపు చూస్తుండటం... ఇప్పటికే పలువురు చేరిపోవడంతో... కరీంనగర్ కాంగ్రెస్ ఖాళీ అయినట్టుగానే కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్‌లోని కొందరు నేతల నుంచి ఆ పార్టీ సాంప్రదాయ వ్యాఖ్యలుగా మారినటువంటి... " కాంగ్రెస్ ఓ మహాసముద్రమనే" మాటలు వినిపిస్తుండటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. అయితే మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యం దెబ్బ తినకుండా ఉండటంతో పాటు... ఉత్తేజపర్చేందుకే అలాంటి వ్యాఖ్యలతో నూతనోత్సాహన్ని నింపే యత్నం చేస్తున్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్‌ అయిన ఆరెపెల్లి మోహన్‌, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కరీంనగర్ మాజీ మేయర్‌ డి. శంకర్‌, ఇతర పలువురు మాజీ కార్పోరేటర్లు, ఇతర నాయకుల్లో కొందరు గులాబీ కండువాలు... మరికొందరు కాషాయ కండువాలు కప్పుకున్న నేపథ్యంలో... రానున్న రోజుల్లో ఈ వలసలు మరింత ఉండే అవకాశం కనిపిస్తోంది. కొందరు జిల్లా కాంగ్రెస్ బాసుల నుంచే కాంగ్రెస్‌లో కొనసాగటం విషయంలో నైరాశ్యం కనిపిస్తున్న పరిస్థితుల్లో... జిల్లా బాసులతో పాటు... ఉమ్మడి జిల్లాలోని పెద్దపెల్లికి సంబంధించిన ఓ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి కూడా బీజేపి బాట పట్టేందుకు లైన్‌ క్లియరైనట్టుగా సమాచారం.

అయితే తెలంగాణా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనంటూ ఇప్పటికే బీజేపి చెప్పడంతో పాటు... మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు  ఎంపీ సీట్లు గెల్చుకోవడంతో... కాషాయదళంలో నూతనోత్సాహం కనిపిస్తోంది. దానికి తోడు కరీంనగర్ వేదికగా పలు కార్యక్రమాల రూపకల్పనకు కూడా శ్రీకారం చుడుతుండటాన్ని ఆ కోణంలో చూసుకోవచ్చు. ఉద్యమకాలం నుంచి గులాబీపార్టీకి సెంటిమెంటల్‌గా కలిసివచ్చిందన్న ఆనందంలో ఉన్న టీఆర్ఎస్‌ శ్రేణులకు చెక్‌ పెట్టేలా... కాషాయరంగును నింపేందుకు కమలం నేతలు పావులు కదుపుతున్న పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. అందులో భాగంగా ఈమధ్యనే మానకొండూరు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నప్పటికీ... మళ్లీ బీజేపి వైపు వెళ్లడానికి కూడా యోచించినట్టు... అయితే ఎమ్మెల్యే రసమయి ఈమధ్య ఈటెల సమక్షంలో చేసిన వ్యాఖ్యలతో... భవిష్యత్తులో తనకే మంచి అవకాశాలుండవచ్చన్న యోచనలో గులాబీగూటి నుంచి కమలం చెంతకు వెళ్లే తన యోచనను విరమించుకున్నట్టుగా కూడా ఓ ప్రచారం జరుగుతోంది. అయితే... ఈ పరిణామాలన్నీ చూస్తుంటే... అయితే టీఆర్ఎస్, లేదా బీజేపి వైపు చాలామంది నేతలు చూస్తున్నట్టుగా కనిపిస్తుండగా... ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ మాజీ ఎంపీకి, ప్రస్తుత ఎమ్మెల్యేకు మధ్య పొరపచ్చాలున్నాయన్న ప్రచారం గతం నుంచీ జరుగుతున్నదే కాగా... సదరు ఎమ్మెల్యేకూ, కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ బాసుకూ మధ్యనున్న గ్యాప్‌ను కూడా ఓకే పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేసినట్టుగా గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడా పరిస్థితి కూడా లేకపోగా... మిత్రులుగా మారిన శత్రువులు... ఇప్పుడు మళ్లీ తాజాగా తలెత్తిన విభేదాలతో నువ్వెంతా అంటే నువ్వెంతా అన్న చందంగా ఒకే పార్టీలో రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరిస్తుండటంతో పాటు... పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే ఇప్పుడు పలువురు పార్టీ మారేందుకు కారణంగా కనిపిస్తోంది. పైగా... కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో పుంజుకునే అవకాశాలు కనిపించకపోగా.... బీజేపి, లేదా టీఆర్ఎస్‌లోకి వెళ్లితేనే రాజకీయ భవిష్యత్తుంటుందన్న యోచనలో కూడా పలువురు నేతలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే గతంలో అయితే టీఆర్ఎస్ లేదా బీజేపిగా ఉన్న పరిస్థితిప్పుడు...  బీజేపి లేదా టీఆర్ఎస్ అనే విధంగా తయారవుతుండటంతో... బీజేపి కూడా ఏస్థాయిలో పుంజుకుంటుందో స్పష్టం చేస్తోంది. అయితే బీజేపి తెలంగాణాలో బలపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో బలపడే విధంగా ముఖ్యనేతలపై మాత్రమే దృష్టి పెట్టకుండా... సెకండ్ క్యాడర్‌లో కార్యకర్తలతో మంచి అనుబంధమున్న నేతలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి... రెండేళ్ల ముందు నుంచి ఈ చేరికల పర్వాన్ని మరింత ఉధృతం చేసేట్టుగా కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుండగా... ఓవైపు బీజేపి, మరోవైపు టీఆర్ఎస్ దెబ్బలకు కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతున్న పరిస్థితి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరి 125 ఏళ్లకు పైబడ్డ వయసున్న మహాసంద్రంలాంటి కాంగ్రెస్ పార్టీ... రానున్న ఎన్నికల వరకైనా పుంజుకుంటుందా... టీఆర్ఎస్, బీజేపిల నుంచి తగులుతున్న దెబ్బలను దెబ్బతీసేలా రాజకీయంగా ఎదురుదెబ్బ తీయగల్గుతుందా అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.