(Local) Tue, 02 Mar, 2021

ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?

October 14, 2019,   1:34 PM IST
Share on:
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాలో తరచూ మాట్లాడుతున్న మంత్రుల్లో ఎవరూ తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లే అని యూనియన్ నాయకులు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే . కార్మికులపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రుల్లో పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాసయాదవ్ ఉన్నారు . అజయ్ మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమకారుడు కాదు ఆలా అని టిఆర్ఎస్ లోను లేరు. 2014లో ఆయన కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇటీవలే రవాణా శాఖ మంత్రి అయ్యారు. తలసాని శ్రీనివాసయాదవ్ తెలుగుదేశం పార్టీలో చాలా కాలం ఉన్నారు. టీడీపీ తరఫున గెలిచిన తలసాని, అసెంబ్లీకి రాజీనామా చేయకుండానే కేసీఆర్ ప్రభుత్వంలో చేరారు.

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను తెలంగాణకు వ్యతిరేకినని మీడియా ముఖంగా చెప్తున్నాను అని గతంలో బాహాటంగానే ప్రకటించారు.ఇప్పుడు పువ్వాడ అజయ్, తలసాని తరచూ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడం ,కార్మిక సంఘాల నాయకులను విమర్శించడం  వారికి మద్దతిచ్చిన ప్రతిపక్షాలపైనా మండిపడడం చేస్తున్నారు. ఈ మధ్య టిడిపి నుండి టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కార్మికులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సరెండర్ కావడం తప్ప కార్మికులకు మరో దారి లేదని నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆదివారం కూడా కార్మికులపై నిప్పులు చెరిగారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేని మంత్రులు ఇప్పుడు మాట్లాడటం ఏమిటని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మంత్రులు మాత్రం ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్ తర్వాత అంత చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్న హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇప్పుడు మౌనంగా ఉండడం గమనార్హం . అలాగే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ కూడా సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కార్మికుల డిమాండ్లపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారే తప్ప, సమ్మె చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించలేదు.తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలకపాత్ర, కాబట్టే, ఆనాడు ఉద్యమంలో వీరితో కలిసి పనిచేసిన నాయకులు, మంత్రులు సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అలాగని, తమ నాయకుడు కేసీఆర్ వైఖరిని ఖండించలేరు, కాబట్టే మౌనంగా ఉన్నారని జేఏసీ నాయకులు భావిస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.