(Local) Mon, 27 Sep, 2021

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఐక్యతా రాగం ...కార్యకర్తలలో జోష్

August 28, 2019,   12:56 PM IST
Share on:
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఐక్యతా రాగం ...కార్యకర్తలలో ...

తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికలలోనూ సత్తా చాటలేక కాంగ్రెస్ చతికిలపడిపోయింది. దీంతో పాటు నేతల మధ్య వచ్చిన విబేధాలతో పార్టీని సమన్వయం చేసుకొని ముందుకు నడుపలేకపోయారు. నేతలంతా తానే ముందంటే తానే ముందని వాదోపవాదనలకు దిగటం బహిరంగంగా అందరికి తెలిసిన విషయమే. గాంధీభవన్ సాక్షిగా ఎన్నో సార్లు నేతలు గొడవ పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కుమ్ములాటలు మొదలయ్యే సరికి బీజేపీ బలం దొరికి పుంజుకోసాగింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ నేతలందరిని పార్టీలో చేర్చుకొని బలహీనం చేసింది. ఇక పరిస్థితి మొత్తం చేజారడంతో ఉన్న నేతలంతా పార్టీని కాపాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి మరింత చేజారక ముందే నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్టు సమాచారం. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనం. ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ప్రాజెక్టుల బాట పట్టారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇలా నేతలంతా కలిసి కట్టుగా ముందుకు సాగారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే నేతలంతా కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు పర్యటిస్తున్నారు. సోమవారం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును సందర్శించారు. ఆ తర్వాత మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. నేడు చనాకా కొరటా బ్యారేజీని పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, జానారెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి,  మాజీ ఎంపీలు వీహెచ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, రమేష్ రాథోడ్, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య కొన్నాళ్లు విబేధాలు నడిచాయి. మరో వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ పలుసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బహిరంగ విమర్శలే చేశారు. జానారెడ్డి తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని పలు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎవరి పంథా వారిదిగా ఇన్నాళ్లు నేతలంతా ఒంటరి ప్రయాణమే చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏకతాటిపైకి వచ్చి నేతలు పర్యటనలు చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ నేతలంతా ఐక్యతారాగంతో ఉన్నామని, తమ మధ్య విబేధాలు లేవన్నారు. ఇక నుంచి ప్రభుత్వం పై నిత్యం పోరాటాలు చేస్తామన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తాము ఎదురించేందుకు సిద్దమయ్యామన్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్తామన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త జోష్ వచ్చింది. 

ఇన్నాళ్లు విబేధించుకున్న నేతలు ఇప్పుడు కలిసికట్టుగా వచ్చి పోరాడుతుండడంతో కార్యకర్తలు, కింది స్థాయి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉందని చెప్పవచ్చు. దీంతో ఇప్పటి నుంచి నేతలు పలు పర్యటనలు చేస్తూ ప్రజలల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకొని అధికార పగ్గాలు చేపడుతుందని నేతలు భావిస్తున్నారు. ముందు పార్టీలో ఉన్న విబేధాలకు ఫుల్ స్టాప్ పెట్టి పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టాలని నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తలపెట్టిన రైతు పాదయాత్రకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. హైకోర్టు ద్వారా అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. ముందుగా నేతలంతా తమతమ జిల్లాలలో ఉన్న సమస్యల పై పోరాటం చేసి ఆ తర్వాత రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళికలు వేయనున్నారని సమాచారం. ఆనాడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు కూడా పాదయాత్రల ద్వారానే ప్రజలల్లోకి వెళ్లేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మరో వైపు పీసీసీ చీఫ్ ను మార్చినా, ఎవరికి పగ్గాలు అప్పగించినా నేతలంతా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతా పోటి పడి బజారుపాలయ్యే కన్నా, ఒక్కరికి పగ్గాలు అప్పగిస్తే వారు ఎవరైనా సరే సహకరించుకుంటూ ముందుకు పోవాలని కూడా నేతలు నిర్ణయించారని సమాచారం.

 2023 వరకు టీఆర్ఎస్ పై ఖచ్చితంగా ప్రజలల్లో విమర్శ పెరుగుతుందని కాంగ్రెస్ భావన. బీజేపీ తెలంగాణలో పాగా వేయడం కష్టమేనని కాంగ్రెస్ క్లారిటిగా ఉంది. వీటన్నింటి పై చర్చించిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి నుంచి ఐక్యమత్యంగా ఉండి, ప్రజా క్షేత్రంలో పని చేస్తే 2023 లో అధికారంలోకి రావడం సులువేనని నేతలు భావిస్తున్నారు. నేతలంతా నిజంగానే విబేధాలను పక్కకు పెట్టి పోరాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే ఐక్యతా రాగాన్ని నేతలంతా కొనసాగిస్తారా లేక మధ్యలోనే వదిలి పెడుతారా అనేది చూడాలి.

సంబంధిత వర్గం
రేవంత్ రెడ్డి సూచించిన కిరణ్ కుమార్ ఎవరంటే!
రేవంత్ రెడ్డి సూచించిన కిరణ్ కుమార్ ఎవరంటే!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.