(Local) Sun, 20 Jun, 2021

రణరంగమైన ట్యాంక్ బండ్

November 10, 2019,   9:53 AM IST
Share on:
రణరంగమైన  ట్యాంక్ బండ్

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ ఆందోళన కార్యక్రమం రణ రంగంగా మారింది. ట్యాంక్ బండ్ పరిసరా ప్రాంతాల్లో కనిపించిన ప్రతి ఒక్కరిపై పోలీసులు లాఠీలతో రుళిపించారు. ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను తోసుకుని  ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. భారీ సంఖ్యలో కార్మికులు తరలిరావడంతో వీరిని అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో కార్మికులపై బాష్ప వాయువును ప్రయోగించారు. దొరికిన ప్రతి కార్మికున్ని వెంటాడి పోలీసులు లాఠీలతో కొట్టారు. చాలా మంది కార్మికులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ పోలీసులు వెంబడించి కొడుతూ చెదరగొట్టారు. మహిళలు, వృద్దులు అనే తేడా లేకుండా పోలీసులు లాఠీలను రుళిపించారు. అయినప్పటికీ మహిళా కార్మికులు బారికేడ్లను తోసుకుంటూ వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. కేసీఆర్ నియంతృత్వ పోకడలను నశించాలి.. నశించాలి..కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతం మారుమోగింది. మహిళలను సైతం  పోలీసులు ఈడ్చుకెళ్లారు. హిమాయత్ నగర్ లో దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రాణిగంజ్ వద్ద కార్మికులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. 

 కార్మికులకు మద్దతుగా ట్యాంక్ బండ్ పైకి వస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను మారియట్ హోటల్ దగ్గర పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించారు. కేసీఆర్ నిరంకుశ దోరణికి కార్మికులు చరమాగీతం పాడుతారని మందకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ ను ఆర్టీసీ కార్మికులే గద్దె దింపుతారని హెచ్చరించారు. ఇంతటి దమనకాండ సరైంది కాదని సూచించారు. అదే విధంగా  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు వివేక్ ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని వాహనం ఎక్కించారు. వివేక్ మాట్లాడుతూ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కార్మికులను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. 
రాష్ట్రంలో పరిస్థితులను ప్రభుత్వం దారుణంగా తయారు చేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారని ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు.  ఇంత నిర్బంధం దేశంలో ఎక్కడా లేదని, ఎప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని చూడలేదని వాపోయారు. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు  ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్టు వెల్లడించారు. 

స్థానికులకు తప్పని తిప్పలు
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దోమల్ గూడ, అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్ నగర్, ఇందిరాపార్కు, నారాయణగూడ, ఖైరతాబాద్, అసెంబ్లీ, బషీర్ బాగ్, లక్డీకాపూల్ పరిసరా ప్రాంతాల్లోని ప్రజలు  పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు . రహదారులు మూసివేసి, ట్రాఫిక్‌ మళ్లించడంతో కష్టాలుపడాల్సి వచ్చిందని  స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.విద్యావంతులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. 
పలువురు కార్మికుల అరెస్టులు
 ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కార్మికులపై కనీసం జాలి చూపకుండా పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌ పరి సర ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ట్యాంక్‌బండ్‌ రోడ్డును  పూర్తిగా మూసి వేసి వాహనదారులు అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పోలీసుల కళ్లుగప్పి ట్యాంక్‌బండ్‌ చేరుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, విద్యార్థులు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చేందుకు యత్నించగా. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పూర్తిగా మూసేశారు. అయినప్పటికీ కార్మికులు వాటిని లెక్కచేయకుండా దీక్ష చేసేందుకు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. పోలీసులు, లాఠీలతో ప్రజా ఉద్యమాలను అణిచి వేయలేరని కార్మికులు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.