(Local) Sat, 23 Oct, 2021

కర్నాటకలోమెడికల్ సీట్ల కుంభకోణం

October 13, 2019,   12:24 PM IST
Share on:
కర్నాటకలోమెడికల్ సీట్ల కుంభకోణం

కర్నాటకలో భారీ స్థాయి మెడికల్ సీట్ల కుంభకోణం చోటుచేసుకుంది. రూ 60 లక్షలకు ఒక  మెడికల్ కాలేజీ సీటు చొప్పున అమ్మకాలు జరిగాయని, ఈ విధంగా ఇది వైద్య విద్యలో భారీ స్కామ్ అయిందని ఆదాయపు పన్ను శాఖ (ఐటి) తెలిపింది. రెండు మూడు రోజుల క్రితమే నీట్ పరీక్షల అవకతవకలకు సంబంధించి ఐటి అధికారులు నాలుగు కాలేజీలపై దాడులు సాగించారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వరకు చెందిన కాలేజీలు కూడా సోదాలకు గురయ్యాయి. దీనితో పాటు మరో కాంగ్రెస్ నేత జాలప్ప కుమారుడి విద్యాసంస్థలపై కూడా ఐటి సోదాలు చేపట్టాయి. దీనితో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. నగదుకు మెడికల్ సీటు పేరిట వ్యవహారం సాగిందని, తాము నిర్వహించిన దాడులలో దీనికి సంబంధించి సాక్షాధారాలు లభ్యమయ్యాయని జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశపరీక్షలలో అవకతవకలకు బెంగళూరుకు కనెక్షన్ తేలినట్లు ఐటి వర్గాలు శనివారం తెలిపాయి.

ఈ నెల 9వ తేదీన ఐటి అధికారుల బృందాలు శ్రీ సిద్థార్థ మెడికల్ కాలేజీ, శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్  ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ సెంటర్, శ్రీ దేవరాజు అర్స్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్, ఆర్‌ఎల్ జాలప్ప హాస్పిటల్ అండ్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్లపై దాడులు జరిపాయి. వీటిలో మొదటి రెండు కాలేజీలు పరమేశ్వర ప్రధాన ట్రస్టీగా ఉన్న శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ట్రస్టు నిర్వహణలో ఉన్నవే. మరో రెండు జాలప్ప ఆధ్వర్యంలో ఉన్నాయని గుర్తించారు. వైద్య కళాశాలల ప్రవేశాలలో అవకతవకలపై అందిన సమాచారం, కొన్ని విద్యాసంస్థలు భారీగా సొమ్ము చేసుకున్నాయని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. దీని మేరకు వారు ఆయా విద్యాసంస్థలపై దాడులు సోదాలకు దిగారు. రాజస్థాన్‌లోనూ, కర్నాటకలోని ఈ విద్యాసంస్థలపైనా ఏకకాలంలో 32 ప్రాంతాలలో నీట్ అవకతవకలపై సోదాలు జరిగాయి.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.