(Local) Sun, 20 Jun, 2021

త్వరలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు

October 22, 2019,   1:37 PM IST
Share on:
త్వరలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన నవరత్నాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న సీఎం… ఇప్పుడు జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విషయంపై ఎలా వ్యవహరించి ముందుకు పోవాలన్న దానిపై ఇప్పటికే సీనియర్ మంత్రులతో చర్చించారని సమాచారం.
రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల విభజన విషయంలో జగన్ ఆలోచనపై సరికొత్త ప్రచారం మొదలైంది. గ్రేటర్ రాయలసీమలో భాగమైన 6 జిల్లాలను 12జిల్లాలుగా చేయాలని ప్రముఖ నేతలు సీఎం జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా, అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా, చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలుగా, కడప జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ జిల్లాలకు తోడు గ్రేటర్ రాయలసీమలో భాగమైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలను విభజించాలా లేకుంటే యథావిధిగానే సాగించాలా అన్న దానిపై మరోసారి సమావేశమై ఓ క్లారిటీకి రానున్నారని తెలుస్తోంది. స్థానిక జనాభా, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఆధారంగా జిల్లాల విభజన ఉండబోతున్నట్లు నేతలు చెబుతున్నారు.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటును పరిషత్ ఎన్నికల ముందు ఏర్పాటు చేయాలా లేకుంటే ముందే ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపై ప్రభుత్వం ఏటూ తేల్చుకోలేక పోతుంది. జిల్లాలు ఏర్పడితే దాదాపుగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడుతాయి. వీటి విషయంలో ప్రజల్లో ఏమైనా అభ్యంతరాలు వస్తే ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల నేతలతో సీఎం జగన్ మరోసారి సమావేశమై అక్కడి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకుని కొత్తగా ఏ జిల్లాలను ఏర్పాటు చేయాలన్న దానిపై ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.