(Local) Fri, 22 Oct, 2021

ముంబై కా మహారాజా… శరద్ పవార్!

November 27, 2019,   2:36 PM IST
Share on:
ముంబై కా మహారాజా… శరద్ పవార్!

మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ చాణక్యం సత్తా ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిని పూర్తిగా తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి అజిత్ పవార్ ను పావుగా ఉపయోగించారు. బీజేపీని కూడా దెబ్బకొట్టారు. ముంబైకా మహారాజా తరహాలో మరాఠా నేలను పరోక్షంగా పాలించబోతున్నారు. హిందూత్వ శివసేనతో సెక్యులర్ కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందనేది ప్రశ్న.

 పవార్ ఎత్తుకు బీజేపీ చిత్తయిపోయింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, సాయంత్రానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. శరద్ పవార్ డైరెక్షన్ లో అజిత్ పవార్ రాజీనామా అస్త్రం సంధించడం కమలనాథులకు షాకిచ్చింది. శివసేనకు చెక్ పెట్టబోయి బీజేపీ బొక్కబోర్లా పడింది. ఉద్ధవ్ థాకరే చిరకాల కోరిక నెరవేరింది. మరాఠా నేలను ముఖ్యమంత్రి హోదాలో పాలించడానికి మార్గం సుగమం అయింది. ఇక కూటమి ప్రభుత్వ రిమోట్ కంట్రోలో శరద్ పవార్ చేతిలో ఉంటుంది. మరాఠా చాణక్యుడు శరద్ పవార్ ప్రధాని మోదీ, అమిత్ షాలకు చెక్ పెట్టిన రాజకీయ దురంధరుడిగా ఇప్పుడు ఖ్యాతి పొందారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు మెజారిటీ సీట్లు ఇచ్చినా, ఉద్దవ్ థాకరే ఎదురు తిరిగారు. సేనకు సీఎం పదవి కోసం పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాలేదు. అంత వరకు బాగానే ఉంది. కానీ, శుక్రవారం రాత్రి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల తుదివిడత చర్చలు ముగిసిన తర్వాత, మర్నాడు గవర్నర్ ను కలవాలని భావించారు. ఇంతలో శరద్ పవార్ మాస్టర్ ప్లాన్ వేశారు. తన అన్నకొడుకు అజిత్ పవార్ చేత ఫడ్నవీస్ కు మద్దతు అనే గాలం వేయించారు. అంతే, ఆయన్ని గుడ్డిగా నమ్మిన బీజేపీ నాయకులు ప్రభుత్వ ఏర్పాటుకు సై అన్నారు. శనివారం ఉదయం ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, మంగళవారం వీరిద్దరూ రాజీనామా చేశారు. అజిత్ పవార్ రాజీనామా చేసి మళ్లీ ఎన్సీపీలోకి వెళ్లడం అనేది అనూహ్యంగా జరిగింది కాదు. అది కూడా శరద్ పవార్ గేమ్ ప్లాన్ లో భాగమే అని మంగళవారం సాయంత్రానికి అందరికీ అర్థమైంది.

మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇది కార్పొరేట్ భారతానికి హెడ్ క్వార్టర్స్ వంటిది. బడా కంపెనీలకు కేంద్రం. రిజర్వ్ బ్యాంకుకు కూడా ఇదే ప్రధాన కేంద్రం. స్టాక్ ఎక్సేంజీ రాజధాని కూడా ఇదే. అలాంటి నేతలపై ఇకమీదట శరద్ పవార్ దే రాజ్యం. సీఎం ఉద్ధవ్ థాకరే అయినా పవార్ మాటే శాసనంగా ప్రభుత్వం నడిచే అవకాశం కనిపిస్తోంది. దటీజ్ పవార్. అయితే ఇది ఐదేళ్లూ ఉంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.