(Local) Sun, 20 Jun, 2021

రోడ్డుపై గాయాలతో కోతి...కారు పంపిన ఎంపీ

November 19, 2019,   5:36 PM IST
Share on:
రోడ్డుపై గాయాలతో కోతి...కారు పంపిన ఎంపీ

ఈ మధ్య కాలంలో రోడ్డు మీద ఆక్సిడెంట్ అయిన ప్రజలు పెద్దగా పట్టించుకోని సంఘటనలు ఎన్నో... అయితే తమకు గాయాలైనా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పాపం నోరులేని జీవులు నోరువిప్పి తమ బాధను చెప్పుకోలేవు. మూగగా రోధించడం తప్ప అవేం చేయలేవు. పాపం వాటి గోస వినేదెవరు? వాటికి సహాయం చేసేదెవరు? మనుషులను మనుషులే పట్టించుకోలేని ఈ సమాజంలో పాపం నోరులేని ప్రాణుల పరిస్థితి గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది కదూ. పాపం ఓ కోతి రక్తపు గాయాలతో రోడ్డు పక్కన కదలలేని స్థితిలో పడి ఉంది. ఆ రోడ్డుపై వెళ్లేవాళ్లు వెళ్తున్నారు.. వచ్చేవాళ్లు వస్తున్నారు. కానీ, దానిని ఎవరు పట్టించుకోలేదు. అయితే  ఓ మహిళా జర్నలిస్ట్ దాని బాధ చూసి వెంటనే దాని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లోక్‌సభ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకాగాంధీకి ట్యాగ్ చేశారు. అది చూసి వెంటనే మేనకాగాంధీ స్పందించారు. కోతిని కాపాడటానికి తన పర్సనల్ కారు ఇచ్చి పంపారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. రైసినా రోడ్డులో ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ఫుట్‌పాత్‌పై ఓ కోతి గాయాలతో కదలలేని స్థితిలో పడి ఉంది. దాని నిస్సహాయ స్థితిని గమనించిన భరతి జైన్ అనే జర్నలిస్ట్ స్పందించారు. వెంటనే దానిని ఫోటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ మేనకా గాంధీకి ట్యాగ్ చేశారు. ‘ఈ ఫోటోలో ఉన్నకోతి గాయపడి కదలలేని స్థితిలో ఉంది. ఏదైనా ఎన్జీవో కానీ జంతు హక్కుల కార్యకర్తలు కాని ముందుకు వచ్చి దీనిని కాపాడండి’ అని ట్వీట్ చేశారు. 

ఆ ట్వీట్‌ను చూసిన వెంటనే మేనకా గాంధీ స్పందించారు. ‘నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు. తక్షణమే నేను కారును పంపిస్తున్నాను. కొన్ని క్షణాల్లో కారు అక్కడికి చేరుకుంటుంది. ఆ కోతికి సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి తగిన చికిత్స అందిస్తారు’ అని రీట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు మేనక సహృదయతను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఆపదలో ఆదుకునేవారే నిజమైన నేతలు. మీరు గ్రేట్ మేడం’ అని ప్రశంసిస్తున్నారు. 

 

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.