(Local) Sat, 24 Jul, 2021

సబ్ ప్లాన్ నిధులకు రెక్కలు.. దారి మళ్లిన రూ. 43,079కోట్లు

November 23, 2019,   11:36 AM IST
Share on:
సబ్ ప్లాన్ నిధులకు రెక్కలు.. దారి మళ్లిన రూ. 43,07 ...

తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల పరిస్థితి దయనీయంగా ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారికి ఏ రంగంలోనూ ఆశించిన మేరకు అభివృద్ధి జరగడం లేదు. విద్య, ఉపాధి రంగాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన  హక్కులను కూడా  దళిత, గిరిజన వర్గాలకు అమలు చేయకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. రాజ్యాంగ పరమైన హక్కులు వారికి దక్కడం లేదు. ఆ వర్గాలకు బడ్జెట్ లో కేటాయించిన  నిధులను సక్రమంగా ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. నాలుగు దశాబ్ధాలుగా దళిత, బహూజనులు పోరాటం చేసి సాధించుకున్నసబ్ ప్లాన్ చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు తమ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు  అసెంబ్తీ సాక్షిగా ఎన్నో వాగ్ధానాలు చేశారు. కానీ అమల్లో శూన్యమని తేలింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా కోట్లాది నిధులను వెచ్చించి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రభుత్వం గతంలో పలుమార్లు ప్రకటించింది. 

దీంట్లో భాగంగానే సబ్ ప్లాన్ కు 2013 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన సబ్ ప్లాన్ చట్టాన్ని సవరించింది. దీనికి  ప్రత్యేక ప్రగతి పద్దు అని పేరు పెట్టి  2017, మార్చి నెలలో అసెంబ్లీలో సబ్ ప్లాన్ చట్టానికి మరోసారి కేసీఆర్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ చట్టంలో అయా ఆర్థిక సంవత్సరంలో ఖర్చుకాని నిధులను మరో ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయాలని (క్యారీ ఫార్వర్డ్) చట్టంలో పేర్కొంది. అదే విధంగా ఎస్సీల అభివృద్ధిశాఖను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. నిధుల కేటాయింపులు, ఖర్చు, క్వారీ ఫార్వర్డ్ అంశాలను ఎస్సీ అభివృద్ధిశాఖకే అప్పగించింది. ఒక్క క్వారీ పార్వర్డ్ తప్ప మిగతా అంశాలన్ని పాత చట్టంలోనే ఉన్నాయి. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధర్వంలో ప్రతి మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహించి, ఏయే శాఖల్లో సబ్ ప్లాన్ నిధులు సరిగ్గా అమలు చేయడం లేదో అయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలి.  అదే విధంగా జిల్లా స్థాయిలోనూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహించాలని చట్టంలో ఉంది. పైగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా చట్టంలో పేర్కొన్నారు. కానీ చట్టంలో పేర్కొన్న అంశాలపై ఇఫ్పటి వరకూ ఏ అధికారిపై కూడా చర్య తీసుకోలేదు. 

కేసీఆర్ ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్టాన్ని సవరించింది, కానీ సవరణకు ముందు నిధుల మళ్లింపు విషయంలో ఎలాంటి పద్దతులను ప్రభుత్వాలు పాటించాయో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అమలు చేసింది. పైగా ఖర్చు కానీ నిధులను వచ్చే ఏడాది ఖర్చు చేసిన దాఖల్లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు బడ్జెట్ ల్లో కేటాయింపులు దళిత, గిరిజనులకు భారీగానే  పెట్టింది. 2014 15 నుంచి 2018 19 ఆర్థిక సంవత్సరం నుంచి సబ్ ప్లాన్ నిధుల కింద ఎస్సీలకు రూ. 56,979కోట్లు  ఎస్టీలకు రూ. 33,623కోట్లు బడ్జెట్ కేటాయించింది.  సబ్ ప్లాన్ నిధులను అయా సామాజిక వర్గాల జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని చట్టంలో పేర్కొన్న విధంగా కేటాయింపులు జరిగాయి.. కానీ ఖర్చుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఎస్సీలకు రూ.33,361కోట్లు ఖర్చు చేయగా, రూ.23,618కోట్లు నిధులను ప్రభుత్వం ఎస్సీలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. అదే విధంగా ఎస్టీలకు రూ.14,162కోట్లు ఖర్చు చేయగా, రూ.19,461కోట్లు ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్లించింది. ఈ లెక్కనా ఎస్సీల  41.45శాతం సబ్ ప్లాన్ నిధులు, ఎస్టీల 57.88 శాతం మేరకు నిధులను దారి మళ్లించిందని అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది.  దీన్నిబట్టి ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి పద్దును ప్రభుత్వం ఏ విధంగా వినియోగిస్తుందో అర్థమౌతుంది.  ఈ ఆర్థిక సంవత్సరం (2019 20) బడ్జెట్ లోనూ ఎస్సీలకు రూ. 9118.50 కోట్లు, ఎస్టీలకు రూ. 5237.11కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ కేవలం రూ.40.30కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దీన్నిబట్టి కేసీఆర్ ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమానికి ఏ మేరకు దృష్టి పెడుతుందో అర్థమౌతుంది. 


సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వాలు ఏ విధంగా దారిమళ్లించాయో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పాటిస్తుంది. కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను ఔటర్ రింగు రోడ్డు, హుసేన్ సాగర్ శుద్ధీకరణ, ఇందిరమ్మ ఇళ్లు, తదితర పనులకు మళ్లించింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.7875కోట్లు మళ్లించిందని తెలిసింది. అదే విధంగా ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు వేలాది కోట్ల నిధులను మళ్లించింది. కళ్యాణ లక్ష్మి పథకం మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉండేది. ఒకవేళ అప్పట్లో మళ్లించినా కూడా వారి సంక్షేమం కోసమేనని అనుకోవచ్చు. కానీ ఆ పథకాన్ని అన్ని కులాలకు విస్తరించింది. అయినప్పటికీ సబ్ ప్లాన్ నిధులనే ప్రభుత్వం వినియోగిస్తుంది. ఆసరా పింఛన్లు కూడా అన్ని వర్గాలకు ఇస్తున్నారు. కానీ వాటికి సబ్ ప్లాన్ నిధుల్లోనే కోత పెడుతున్నది. 

వాస్తవానికి సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థికాంశాలకు మాత్రమే వినియోగించాలని చట్టంలో పొందుపర్చారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌళిక వసతులు, సంక్షేమ హస్టళ్లల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వెచ్చించాలి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాల్లోనూ దళిత వాడల్లోని పాఠశాలల మౌళిక వసతులకు మాత్రమే సబ్ ప్లాన్ నిధులను వెచ్చించాలి. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలకు ఖర్చు చేయాలి. కానీ విచిత్రమేమంటే గడిచిన ఐదేళ్లల్లో స్వయం ఉపాధి కోసం దళిత, గిరిజన నిరుద్యోగులు 4,04857 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,21,161 మందికి మాత్రమే ఉపాధి కల్పించింది. వీరికి కేవలం రూ.1347.48కోట్లు ఖర్చు చేసింది. ఇక ప్రభుత్వం దళిత, గిరిజనులకు భూ పంపిణీ చేశామని చెబుతున్నది. గత ఐదేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా  5,708 మంది లబ్ధిదారులకు 14,702.23 ఎకరాలను పంపిణీ చేసింది. దీని కోసం రూ.64.162లక్షలు మాత్రమే వెచ్చించింది. ఈ లెక్కనా నిరుద్యోగులు, భూపంపిణీ రెండు కలిపి కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు బదిలీ చేసిన నిధుల్లో 15శాతం కూడా ఖర్చు చేయలేదని తెలుస్తుంది. 

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని నాల్గు దశాబ్దాలుగా దళిత, బహుజన సంఘాలు దేశ వ్యాప్తంగా పోరాటం చేశాయి, వీరి పోరాట ఫలితంగానే స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ  1980 85లో ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఆర్థిక స్వాలంభన కోసం వెచ్చించాలని 6వ పంచవర్ష ప్రణాళికలో పొందుపర్చారు. దేశ వ్యాప్తంగా అయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం సబ్ ప్లాన్ నిధులను కేటాయించాలని పేర్కొన్నారు. కానీ గడిచిన 39ఏళ్లల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కగా అమలు చేయలేదు. 6వ పంచవర్ష ప్రణాళిక ఇందిరాగాంధీ ప్రభుత్వం పేర్కొన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీయార్ కూడా సబ్ ప్లాన్ నిధులను అమలు చేస్తామని బీరాలు పలికారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఈ నిధులను ఒక ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ ఇన్నేళ్లల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కనీసం నోడల్ ఏజెన్సీలను కూడా ఏర్పాటు చేయలేదు.మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2013 మే లో అసెంబ్లీలో చట్టం చేసింది. అప్పటికీ సబ్ ప్లాన్ ను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దాని తర్వాత కర్ణాటక రాష్ట్రం అదే సంవత్సరంలో జూలై నెలలో సబ్ ప్లాన్ చట్టబద్ధత చేస్తూ బెంగుళూరు డిక్లరేషన్ అనే డాక్యుమెంట్ ను తయారు చేసింది. దీనిద్వారా ఆ రాష్ట్రంలోని 24.1శాతం ఎస్సీ, ఎస్టీలకు  రూ.60,691కోట్లు కేటాయించి, రూ.55,331.82కోట్లు కర్ణాటక ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన రాష్ట్రం దేశంలోనే కర్ణాటక ఒక్కటేనని చెప్పవచ్చు.

 సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయాల్సిందే : డీబీఎఫ్

రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు.

నిధులను మళ్లించడం నేరం : డీఐఏ

సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం నేరమని, చట్ట విరూద్ధమని దళిత్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ అన్నారు. నిధులను దళిత, గిరిజనులకు ఖర్చు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. 

 
ఎస్సీలకు బడ్జెట్ లో కేటాయించిన ఎస్సీపీ నిధులు (కోట్లల్లో)

సంవత్సరం    కేటాయింపులు     ఖర్చులు దారిమళ్లింపు    
2014-15        .7579             2,936        4643    
2015-16         8,089            4682        3407    
2016-17         10,484              4545        5939    
2017-18        . 14,375             10178        4197    
2018-19         16,452              11,020        5432        
2019-20        . 9118.50 ………        ……...            
మొత్తం        66097.50        33,361        23,618

ఎస్టీలకు కేటాయించిన  టీఎస్పీ నిధులు (కోట్లల్లో)
సంవత్సరం    కేటాయింపులు    ఖర్చులు    దారిమళ్లింపు
2014 15        4,559            2,832            1,727
2015 16        5,035            1,814            3,221
2016 17         6,171            2,786            3,385    
2017 18         8,165.88               3,546            4,619
2018 19         9,693            3,184            6,509
2019 20        5, 237.             …            ……..
మొత్తం        38,860.88        14,162            19,461

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.