(Local) Wed, 28 Jul, 2021

స్వేచ్ఛ ను హరిస్తున్న ప్రభుత్వాలు?

October 25, 2019,   4:40 PM IST
Share on:
స్వేచ్ఛ ను హరిస్తున్న ప్రభుత్వాలు?

స్వేచ్ఛ కోసం పరాయి పాలనపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం సాధించుకున్నాం. కానీ, దేశంలో స్వేచ్ఛ ఉందా...? అంటే సర్వత్రా లేదనే సందేహం కనిపిస్తోంది. దేశంలో ఎన్నో చట్టాలు సవరించాల్సిన ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టి… వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ ను ఎందుకు కాలరాస్తుందనే సందేహం రాజ్యంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ కలిగించే చట్టాలు అవసరమా…? అంటే అనవసరమంటున్నాయి ప్రభుత్వాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రపు హక్కు మరియు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఇకపై ఉంటుందా? లేదా? అని సామాన్యులు, సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా చట్టాలలో జరిగిన కొన్ని మార్పులు భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి అనడానికి నిదర్శనంగా నిలిచాయి.

భావప్రకటనా స్వేచ్ఛ హక్కును సరైన విధంగా ఉపయోగించకపోవడం వలనే ఇలాంటి మార్పులు జరిగాయా? లేదంటే ప్రభుత్వాల అవకతవకలను వేలెత్తి చూపడం సహించలేక నాయకులు పౌరుల గళాన్ని నొక్కేస్తున్నారా?స్వేచ్చా హక్కుల చట్టాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పుల వెనుక కారణాలేమిటి? ఈ అంశాలపై తెలుగు డైలీ 24 ప్రత్యేక కథనం.

సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో 2000 సంవత్సరంలో సమాచార సాంకేతిక చట్టం ద్వారా 66ఏ చట్టం తీసుకువచ్చారు. కానీ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మన పాలకులు దిట్ట అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2008లో యూపీఏ హయాంలో ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధినేత అవినీతికి పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాలలో విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ఈ పోస్టింగులు వలన కాంగ్రెస్ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ రాతలకు, నిరసనలకు అడ్డుకట్ట వేయాలని అప్పటి యుపిఎ ప్రభుత్వం ఐటీ చట్టం 66ఏ లో 3 ముఖ్యమైన మార్పులు చేసింది.

ఈ బిల్లు ఉభయసభలలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోద సమయంలో చట్టసభలో ఎలాంటి చర్చలు జరగకుండా ఆమోదం పొందడం గమనార్హం. భారతదేశ చరిత్రలో ఉభయ చట్ట సభలలో చర్చలు లేకుండా ఆమోదం పొందిన ఏకైక బిల్లు ఏదైనా ఉందంటే ఐటీ చట్టంలోని ఈ బిల్లు కావొచ్చు.
శివసేన అధ్యక్షుడు బాలథాక్రే మరణించినప్పుడు పార్టీ కార్యకర్తలు నగరంలో బంద్ చేసారు. సరిగ్గా 2 రోజుల తర్వాత 2012 నవంబర్ 19 శవయాత్రలో భారీగా స్తంభించిన ట్రాఫిక్ చూసి ఓ మహిళ సోషల్ మీడియాలో తాను పడిన ఇబ్బందులను వ్యక్తపరిచింది. పోస్టు పెట్టినందుకు ఆమెను, పోస్ట్ ను లైక్ చేసిన తన బంధువులను కూడా ఈ చట్టం ప్రకారం అరెస్ట్ చేసారు. అంతేకాకుండా బంధువుల ఆసుపత్రులపై దాడులు చేసారు.

మమతా బెనర్జీ పై కార్టూన్ ను షేర్ చేసిన ప్రొఫెసర్, యూపీ మంత్రి ఆజాం ఖాన్ ను కామెంట్ చేసిన విద్యార్థి అరెస్ట్... ఇలా కొనసాగుతున్న అరెస్టులపై ప్రశ్నిస్తూ... సమానత్వానికి హామీ ఇస్తున్న14, 19, 21 ఆర్టికల్స్ ను 66ఏ భంగం కలిగిస్తుందని 21 ఏళ్ళ ఢిల్లీ విద్యార్థిని శ్రేయ సింఘాల్ సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది.2012 సెప్టెంబర్ లో అవినీతికి వ్యతిరేకంగా వ్యంగ్య చిత్రాలు గీసిన కార్టూనిస్ట్ అసీం త్రివేది, 2012 అక్టోబర్ లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీని ట్విట్టర్ లో విమర్శించినందుకు రవి శ్రీనివాసన్ అరెస్టయ్యారు. అప్పటి ప్రజాప్రతినిధులు కూడా 66ఏ సెక్షన్ పై పిల్ దాఖలు చేసి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. 66ఏ సెక్షన్ పై ప్రజలు విజయం సాధించినా... అది విజయంగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రజాప్రతినిధులు దేశ ప్రజలపై, కులాలపై, మతాలపై, సంస్థలపై చేసే వివాదస్పద వ్యాఖ్యలకు వారిని బాధ్యులు చేయలేకపోయాయి ఇవే చట్టాలు. ఇది వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. వారికో రూల్,సామాన్యులకు ఒక రూల్ ఏంటని వాదిస్తున్నారు. వారు కూడా దేశప్రజలే కదా. రాజ్యాంగాన్ని వారివారి ప్రయోజనాలకు వినియోగించుకోకుండా ప్రతి పౌరుడికి వర్తింపచేయాలనే భావనలో ప్రజలు ఉన్నారు.స్వేచ్ఛ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా సామాజిక మాధ్యమాలకు ఆధార్ లింక్ చేయాలనే ప్రపోజల్ బయటకు వచ్చింది. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆధార్ లింక్ చేస్తే వ్యక్తిగత విషయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు అవుతుందని కొందరు భావిస్తున్నారు.మరి అలాంటప్పుడు  వ్యక్తిగత స్వేచ్ఛను హరించే చట్టసవరణలు అవసరమా...?

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.