(Local) Wed, 20 Oct, 2021

సిఎం సభలో అసైన్డ్ వాణి వినిపించేనా...?

November 14, 2019,   12:00 PM IST
Share on:
సిఎం సభలో అసైన్డ్ వాణి వినిపించేనా...?

ఆరు నెలలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లాలో ప్రధాన సమస్య అయిన అసైన్డ్ భూములు విషయంపై మాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదన్న ఆవేదన బాధితుల్లో ఉంది. రెవెన్యూ అధికారులు ఇష్టానుసారం పట్టా భూములను కూడా  నిషిద్ధ భూముల జాబితాలో చేర్చేశారు. అందువల్ల వీటి క్రయ విక్రయాలు సాధ్యపడడం లేదు. ఫలితంగా అవసరానికి అమ్ముకుందామనుకున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సమస్య అత్యధికంగా ఉంది. 

ప్రజలు ఎప్పుడో కష్టార్జిత సొమ్ము తో కొనుక్కున్న భూములను కూడా గతంలో  అసైన్మెంట్ జరిగిందంటూ ఇప్పుడు నిషిద్ధ భూముల జాబితా లో చేర్చడం వల్ల వారికి ఏమీ పాలుపోవడం లేదు. వీటిని నిషిద్ధ భూముల జాబితా నుండి తొలగించాల్సిందిగా తహశీల్దార్ లకు దరఖాస్తు చేసుకున్నా, కలెక్టర్ కు మొరపెట్టుకున్నా ఫలితం ఉండటం లేదు. నిషిద్ధ భూముల జాబితా లో చేర్చిన తహశీల్దారు వీటిని తొలగించడానికి ఇష్టపడడం లేదు. వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి ముడిపెడుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళితే ఆయన తహశీల్దారు రిపోర్టు కోరుతున్నారు. తహశీల్దారులు వాస్తవాలను వక్రీకరించి తప్పుడు రిపోర్టులు సమర్పించడం వల్ల కలెక్టర్ కూడా ఏమీ చేయలేకున్నారు.

అనేక తప్పులతో కూడిన ఆర్ఎస్ ఆర్ ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని తహసీల్దార్లు ప్రజలను పీడించుకు తింటున్నారు. భూమి స్వభావానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇచ్చే రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ డాక్యుమెంట్ ను తహశీల్దార్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ శాఖ రెండూ ప్రభుత్వానివే అయినప్పటికీ ఒకరి నివేదికను మరొకరు పట్టించుకోకపోవడం వల్ల అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. ఒక్క చీరాల నియోజకవర్గం లోనే  దాదాపు ఆరు వేల కి పైగా ఎకరాల భూమి అసైన్డ్ జాబితాలో ఉంది. జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందే దరఖాస్తుల్లో 60 శాతం అసైన్డ్ భూములకు సంబంధించినవిఉంటున్నాయి. ఆయన వాటిని ఆర్డీవోకు పంపుతారు. ఆర్డీవోలు తహశీల్దార్లకి పంపుతారు. తహశీల్దారు ఏమి రాస్తే వాటిని ఆర్డీవోలు గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఆర్డీవోలు ఎక్కడా  రికార్డులు పరిశీలించిన దాఖలాలు లేవు. 

ఒంగోలు ఆర్డిఓ రామకృష్ణారెడ్డికి పేరాలకి చెందిన 100 దళిత కుటుంబాలు తమ సమస్య గురించి మూడు నెలలుగా మొరపెట్టుకున్నా ఆయన స్పందించడం కూడా లేదు. చివరకు పేరాల విఆర్వో కూడా అసైన్డ్ బాధితుల  గోడు వినడం లేదు. కలెక్టర్ కోలా భాస్కర్ స్పందించి చర్యలు తీసుకోమని కిందిస్థాయి అధికారులకు రాస్తే బుట్టదాఖలు అవుతున్నాయి. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగానే వుంది. కానీ ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి సమస్య తీవ్రత వెళ్ళలేదు. రెవెన్యూ మంత్రి సుభాష్ చంద్రబోస్ కు కొద్దిగా విషయం అర్ధం అయినా ఆయన కూడా పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టడం లేదు. గురువారం ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై కూడా స్పందించి ఒక ప్రకటన చేస్తే బాధితులంతా ఆయనకు జేజేలు పలుకుతారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.