(Local) Wed, 11 Dec, 2019

ఇకపై శరవేగంగా పోలవరం ...

August 29, 2019,   5:20 PM IST
Share on:
ఇకపై శరవేగంగా పోలవరం ...

పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబుకు కుడి, ఎడమ కాలువల పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లో సభ్యునిగా కూడా సుధాకర్‌బాబును నియమించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావును అదనపు బాధ్యతల నుంచి తప్పించారు.

కాగా, పోలవరం.. నీటిపారుదల విభాగం ఈఎన్‌సీ పదవులను ఒక్కరే  నిర్వహిస్తుండటంవల్ల పనిభారం పెరిగి ప్రాజెక్టు పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ను నియమించాలంటూ జూలై 11, 2017న కేంద్ర జలవనరుల శాఖ అప్పటి కార్యదర్శి అమర్జీత్‌ సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం, పీపీఏ కూడా లేఖలు రాసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కారానికి, జలవనరుల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి  కేంద్రం పనులకు కొత్త ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. పోలవరం పనుల పర్యవేక్షణ, పీపీఏతో సమన్వయం, కేంద్ర జలవనరుల శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో పోలవరం ఈఎన్‌సీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపారుదల విభాగం ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును వాటి నుంచి తప్పించింది. పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను ప్రస్తుతం హెడ్‌ వర్క్స్‌ను పర్యవేక్షిస్తున్న సీఈ సుధాకర్‌బాబుకే పూర్తిగా అప్పగించింది. దీంతో నీటిపారుదల విభాగం ఈఎన్‌సీకి అదనపు భారం లేకపోవడంవల్ల ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   
 

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.