(Local) Wed, 21 Aug, 2019

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కోసం సవరణలు

June 09, 2019,   1:46 PM IST
Share on:

క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా పదవీ కాలం పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వం 60 ఏండ్లనాటి నిబంధనలకు సవరణలు చేసింది. ప్రదీప్ కుమార్ సిన్హా పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర నియామక కమిటీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. క్యాబినెట్ కార్యదర్శి పదవీకాలం రెండేండ్ల కాలపరిమితితో ఉంటుంది. ఆలిండియా సర్వీసెస్ (డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్) రూల్స్ - 1958 ప్రకారం ప్రభుత్వం క్యాబినెట్ కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. అయితే అది నాలుగు సంవత్సరాలు మించకూడదు. 2015 మే నెలలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సిన్హా పదవీకాలం 2017తో ముగిసినా, మరో ఏడాది ప్రభుత్వం పొడిగించింది. ఆ తర్వాత, 2018లో మరో ఏడాది కొనసాగించింది. ఈ సంవత్సరం జూన్ 12తో సిన్హా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. దీనికోసం 60 ఏండ్లనాటి నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీంతో ఈ పదవిలో అత్యధిక కాలం కొనసాగిన వ్యక్తిగా సిన్హా రికార్డు సృష్టించారు. సిన్హా 1977 బ్యాచ్‌కి చెందిన ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. సిన్హా కంటే ముందు క్యాబినెట్ కార్యదర్శి పదవిలో అత్యధిక కాలం కొనసాగిన అధికారిగా వైఎన్ సుక్తాంకర్ నిలిచారు. ఆయన మే 14, 1953 నుంచి జూలై 31, 1957 వరకు క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.