(Local) Wed, 24 Jul, 2019

ఏపీలో సెప్టెంబరు 5నుంచి ఇసుక కొత్త విధానం

July 05, 2019,   12:12 PM IST
Share on:

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొత్త విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా ఇసుకను విక్రయించనున్నారు. నూతన విధానం అమల్లోకి వచ్చేలోపు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇసుకను అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం లభిస్తున్న ధరల కంటే తక్కువకే ఇసుక లభించేలా ధర నిర్ణయం ఉండనుంది. ప్రభుత్వం అమ్మకాలు చేపట్టిన తర్వాత ధరలు పెరిగాయన్న అభిప్రాయం రాకూడదని, వినియోగదారులకు, ప్రభుత్వానికి పరస్పరం మేలు జరిగేలా ఇసుక నూతన విధానం ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

ఇసుక విధానంపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు. నగరాలు, పట్టణాల్లో అదనపు నిల్వపాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు సూచించారు. ఇసుకను చేరవేసే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరాలు అమర్చాలని ఆదేశించారు. దీనివల్ల ఇసుక మాఫియాను అరికట్టేందుకు అస్కారం ఉంటుందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల కోసం యాప్‌, వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేయగానే ఇసుకను ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కంకర నుంచి తీసే ఇసుకను ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.