(Local) Wed, 24 Jul, 2019

ఒసాకాలో ట్రంప్‌ - మోది సమావేశం - చర్చలు సఫలం

June 29, 2019,   1:10 PM IST
Share on:

ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోది సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా భారత్‌ తమకు అత్యంత మిత్రదేశమని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకునేందుకు కట్టుబడివున్నామని చెబుతూ, రెండు దేశాల మధ్య అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదరనుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్పత్తి రంగానికి సంబంధించిన డీల్‌ ఇదని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అన్నారు. 
కాగా, ఇరువురూ ఇరాన్‌ వ్యవహారాలు, 5జీ నెట్‌వర్క్‌, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ దళాల విషయంలో పరస్పర సహకారం, ఉపఖండంలో శాంతి, ట్రేడ్‌ డెఫిషిట్‌ను అధిగమించడంపైనా చర్చలు సాగాయని, వైట్‌ హౌస్‌ ఓ ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడంపైనా మాటలు సాగాయని పేర్కొంది. 
చర్చలు సఫలం ఆయ్యాయని, వాణిజ్యపరంగా ఇండియా తీసుకుంటున్న చర్యలను ట్రంప్‌ స్వాగతించారని విదేశాంగ కార్యదర్శి విజయ గోఖలే మీడియాకు వివరించారు. 5జీ వాడకం విస్తృత పరిచేందుకు అమెరికా సహకరిస్తుందని ట్రంప్‌ హామీ ఇచ్చాడని, వివిధ అంశాల విషయంలో భారత్‌ చేపడుతున్న చర్యలపై ట్రంప్‌ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. 
ఎన్నికల ఫలితాల తర్వాత మోది, ట్రంప్‌ల మధ్య ఇదే మొదటి సమావేశం కాగా భారత ప్రజలు సరైన నేతనే ఎన్నుకున్నారని ట్రంప్‌ కితాబిచ్చారని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.