(Local) Thu, 14 Nov, 2019

రాంచీ టెస్టు, Day 1: రో'హిట్' షో.. టీమిండియా 224/3

October 19, 2019,   5:27 PM IST
Share on:
రాంచీ టెస్టు, Day 1: రో'హిట్' షో.. టీమిండియా 224/3

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో బ్యాడ్ లైట్ కారణంగా తొలి రోజు ఆటను నిలిపివేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(117), రహానే(83) పరుగులు చేశారు.224/3 స్థితిలో ఉన్నప్పుడు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా... నోర్జేకు ఒక వికెట్‌ లభించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే రబడా దెబ్బ కొట్టాడు. ఫామ్ లో ఉన్న మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేసి సఫారీలకు బ్రేక్ ఇచ్చాడు. తరువాత పుజారాను  అవుట్ చేసి భారత్ కు షాక్ ఇచ్చాడు. నెమ్మదిగా ఆడుతున్న కోహ్లీని అన్రిచ్ నొర్జే పెవిలియన్ పంపించాడు. దీంతో భారత్ 10 ఓవర్ల లోపే మూడు ప్రదాన వికెట్ లు చేజార్చుకొని కష్టాల్లో పడింది.
కానీ ఆ ఆనందాన్ని రోహిత్ శర్మ, రహానే సఫారీలకు ఎక్కువసేపు ఉంచలేదు. వీరిద్దరూ చక్కటి బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. మొదట నెమ్మదిగా ఆడిన రోహిత్ హాఫ్ సెంచరీ తరువాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. సెంచరీ ముందు రెండు సిక్సర్ లు బాది సఫారీలకు హెచ్చరికలు పంపి సిక్సర్ తోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసాడు.
రహానే హాఫ్ సెంచరీ:
కోహ్లీ అవుట్ అయ్యాక వచ్చిన రహానే కూడా కుదురుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రోహిత్ కు సహకారం ఇస్తూనే తను కూడా పరుగులు చేయడానికి రోహిత్ తో పోటీ పడ్డాడు. చూడచక్కనైన షాట్ లతో అర్థశతాకాన్ని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పారు.టెస్టుల్లో రహానేకు ఇది 21వ హాఫ్ సెంచరీ. 70 బంతుల్లో 8 ఫోర్లతో రహానే హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సిక్స్‌తో సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 6వది కావడం విశేషం.

ధోని రికార్డుని సమం చేసిన రోహిత్

ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా... రోహిత్ శర్మ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఒక సిరీస్‌లో భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో గవాస్కర్‌ తర్వాత ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.గవాస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు. 1977-78లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన గవాస్కర్‌.. ఆ తర్వాత 1978-79 సీజన్‌లో విండిస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు. అంతకుముందు 1970-71 సీజన్‌లో కూడా విండిస్‌పై ఒక్క సిరీస్‌లో గవాస్కర్‌ నాలుగు సెంచరీలు సాధించాడు.

ఆ తర్వాత రహానే కూడా సెంచరీకి చేరువయ్యాడు. ఈ సమయంలో బ్యాడ్‌ లైట్‌ కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక మ్యాచ్‌ తిరిగి కొనసాగించేందుకు వాతావరణం అనుకూలించే అవకాశం లేకపోవడంతో ఈరోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలిరోజు కేవలం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.