(Local) Fri, 22 Oct, 2021

బోనాల పండుగ విశిష్టత...

July 09, 2019,   1:28 PM IST
Share on:
బోనాల పండుగ విశిష్టత...

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు బోనాల సంబరం షురూ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢమాసంలో  జరిగే అతిపెద్ద పండుగలో ఒకటి బోనాల పండగ. ఈ బోనాల జాతరని హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు. 

గజ్జె కట్టి.. ఘటాలు వూరేగించి.. 
తొట్టెలు కట్టి.. బోనమెత్తి.. 
బలిగంప ఇచ్చి.. 
పోతరాజు వేషాలేసి.. 
అమ్మవారిని అంబారీపై ఊరేగించి.. 
రంగంలో భవిష్యవాణి చెప్పడం వరకు..!! 
ఈ నెల రోజులు ప్రతి ఆది, సోమవారం నగరంలో ఒక్కోచోట బోనాల భక్తి పారవశ్యమే. ఆషాఢమాసం ప్రారంభమైన తొలి ఆదివారం నుంచి ఉత్సవాలు మొదలై ఒక్కో ఆదివారం ఒక్కోచోట బోనాలను నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని గోల్కొండ లో ఉన్న జగదాంబికా ఆలయంలో తొలి బోనం ఎత్తిన తరువాతనే వివిధ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ లో జరిగే బోనాల కి దాదాపుగా 500 ఏళ్ళ చరిత్ర ఉంది. గ్రామ దేవతైన అమ్మవారిని పూజించే అతిపెద్ద పండుగే బోనాల పండగ. మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం నుంచి బోనాలు ప్రారంభమై.. లష్కర్‌ బోనాలుగా పిలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, కట్టమైసమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీకి చేరతాయి. చివరి ఆదివారం గోల్కొండలోనే ఆషాఢ బోనాలు ముగుస్తాయి. ఆ తర్వాతి వారం నుంచి శివారు ప్రాంతాల్లో శ్రావణ బోనాల సందడి మొదలవుతుంది. మొత్తంగా రెండు నెలలపాటు నగరం ఆధ్యాత్మిక సంద్రంగా మారుతుంది.
 ఆషాడమాసంలో అనాదిగా ఇంటింటా జరుపుతున్న పండుగ.. నగర చరిత్రకు ప్రతీక.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మ.. స్మార్ట్‌ఫోన్‌ రోజూల్లోనూ బోనాల పండుగ ఏటేటా మరింత శోభను సంతరించుకుంటోంది. గుళ్లతో పాటూ పండుగ జరిగే ప్రాంతాల్లో వేపాకులతో వీధుల అలంకరణ.. జానపద శైలిలో అమ్మవారిని కీర్తించే పాటలతో మైకుసెట్ల హోరుతో నగరంలో సిసలైన పండుగ వాతావరణం కనిపిస్తుంది.

అంగరంగ వైభవంగా మొదటి వారం...శ్రీజగదాంబిక మహంకాళి బోనాలు
పూర్వకాలంలో ఓక కథనం ప్రకారం కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు గోల్కొండలో ని  శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లుగా చెప్పేవారు. ఆ తరువాత వచ్చిన ముస్లిం పాలకులు కూడా ఇక్కడ బోనాలు నిర్వహించడానికి అనుమతి అనేది ఇచ్చారు. మొదటగా గోల్కొండ కోటలో శ్రీజగదాంబిక మహంకాళి బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇక్కడి మందిరాన్ని ఎల్లమ్మ దేవాలయంగా భక్తులు పిలుచుకుంటారు. కోటపై ఈ ఆలయాన్ని తానీషా ప్రభువుల కాలంలో మంత్రులు అక్కన్న, మాదన్నల హయాంలో నిర్మించారని చెబుతుంటారు. నెలరోజులపాటు ప్రతి గురు, ఆదివారం ఇక్కడ బోనాల వేడుకలు జరుగుతాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆషాడంలో ఆఖరి ఆదివారం మళ్లీ ఇక్కడే బోనాలు ముగుస్తాయి.

రెండవ వారం....ఉజ్జయిని మహంకాళి బోనాలు  
గోల్కొండ బోనాలు ప్రారంభమైన తర్వాతి ఆది, సోమవారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. లష్కర్‌ బోనాలుగా పేరుగాంచిన ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నగరంతో పాటు చుటుపక్కల ప్రాంతాలనుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో ఆనాడు  ఈ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 వ సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే ఈ నగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేలమంది చనిపోయారు. ఆ వార్త తెలిసిన అతడు, తన సహా ఉద్యోగులు కలసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంతంలోని ప్రజలని రక్షించమని కోరుకొని, అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఒక ఆలయాన్ని కట్టిస్తామని మొక్కుకున్నారు. ఆలా 1815 లో సికింద్రాబాద్ తిరిగి వచ్చిన అతను మొక్కు ప్రకారం ఇక్కడే అమ్మవారికి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రతి ఆషాఢమాసంలో అప్పటినుండి బోనాల జాతర అనేది నిర్వహిస్తున్నారు.

లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందిన పాతబస్తీ బోనాలు ఇక్కడ ఆలయాల్లో 11 రోజుల పాటు సాగుతాయి. అభిషేకం, కలశ స్థాపన, ధ్వజారోహణ ఉంటాయి. అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం నుంచి అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై అలంకరించి భక్త జనసందోహం నడుమ వూరేగింపు కోలాహలంగా సాగుతుంది. 

లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలకు ప్రత్యేకత ఉంది. నిజాం హయాం.. 1835-40 కాలంలో అమ్మవారు స్వయంభుగా వెలిసినట్లు పెద్దలు చెబుతారు. 1907లో మూసీ వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ గంగమ్మకు పూజలు చేయడంతో అవి తగ్గుముఖం పట్టాయని చెబుతారు. మూడువందల ఏళ్ల కిందట బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారని చెబుతారు. అమ్మవారు ఇక్కడ బావిలో 10 అడుగుల దిగువన దర్శనమివ్వడం ప్రత్యేకత. నిజాం కాలంనుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు.

పోతురాజు:  ఈయన అమ్మవారి తమ్ముడు. పోతురాజు తోనే జాతర అనేది ప్రారంభం అవుతుంది. 

ఘటం:  ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్లి మూసీనది లో నిమర్జనం అనేది చేస్తారు.

రంగం: బోనాల జాతరలో చివరి రోజు జరిగే ముఖ్య ఘట్టం ఇది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఒక స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది. దీనినే రంగం అని అంటారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.