(Local) Mon, 27 Sep, 2021

ఆధ్యాత్మికత అంటే ఏమిటి ? అది మనకి ఎందుకు అంత ముఖ్యం ?

July 15, 2019,   10:39 PM IST
Share on:
ఆధ్యాత్మికత అంటే ఏమిటి ? అది మనకి ఎందుకు అంత ముఖ్య ...

మనిషి ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండాలను కోవటం వల్ల. తానూ తనవాళ్ళూ ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండటం కోసం మనిషి నిరంతరం ఆరాటపడుతుంటాడు.ఎల్లప్పుడూ కేవలం అందుకోసమే ప్రయత్నిస్తుంటాడు. ఏ ఆలోచన చేసినా, ఏ పనిచేసినా అది కాక మరో కారణం ఉండనే వుండదు. సుఖ శాంతుల కోసం మనిషి తనకు చాతనైనంత వరకు ఎన్నో ఏర్పాట్లు చేసుకొంటూ వున్నాడు. ఆ ఏర్పాట్లు చేసుకోవటానికి ఎంతో శ్రమ, బాధ పడుతూనే వున్నాడు. ఐనా జీవితంలో ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అశాంతీ, అలజడీ, దుఃఖమూ, భయమూ, విసుగూ ఎదురౌతూనే వున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటని చూసినట్లయితే ఈ క్రింది నాలుగు విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
మార్పు
మరణం
ప్రతికూలత
ఊహలు
ఈ నాలిగిటి వల్ల మనిషి అశాంతితో, అలజడితో, విసుగుతో, బాధతో, భయంతో ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో చివరికి మృత్యువు ఒడిలోకి జారి పోతుంటాడు. సామాన్యమైన వ్యక్తులంతా ఈ వూబిలో పడిపోయి వుంటారు.
మార్పు :- ఏదో ఒక వస్తువును కొన్నప్పుడు చాలా సంతోషంగానే, ఆనందంగానే వుంటుంది. ఐతే ఆ వస్తువుని జాగ్రత్త పరచడంలో అలసట, ఆందోళన, భయము పొంచి వుంటున్నాయి. కొంత కాలం తర్వాత మార్పు వల్ల ఆ వస్తువు పాతబడి పోతుంది. దాని స్థానంలో మరో కొత్తది కావాలనిపిస్తుంది. కొత్తది కొంటే పాతదాన్నేమి చేయాలి? ఇదో సమస్య. ఐనకాడికి అమ్మేయాలా?
ఎవరికైనా ఇచ్చేయాలా? లేకపోతే ఎక్కడ పెట్టాలి?ఇదొక ఎడతెగని అంతర్మధనం. ఈ రకమైన అంతర్మధనం, ఊగిసలాట కేవలం వస్తువుల విషయంలోనే కాక, బంధువులు, స్నేహితుల విషయంలో కూడా వర్తిస్తున్నది.సమస్యతో సహజీవనం చేయడం, సర్దుకు పోవడం తప్పనిసరిగా మారుతున్నది.
మరణం :- తాను మరణిస్తానేమోననే ఆందోళన ఉండనే వుంది. అలాగే తనవాళ్ళు మరణిస్తారనే భయము, అలజడి, దుఃఖము.
ప్రతికూలత :- తాను అనుకున్నది జరగనప్పుడు చికాకు, బాధ పడటమే కాకుండా, చిన్న, పెద్ద విషయాలలో కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మళ్ళీ మళ్ళీ గతించిన చేదు విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని బాధ పడుతుంటాడు.
ఊహలు :- భవిష్యత్తుకు సంబంధించిన విషయాల ఊహలతో సతమత మౌతుంటాడు.
ప్రతి మనిషీ ఎంతటి ప్రయత్నం చేసి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ మార్పుల వల్లా, మరణం వల్లా, ప్రతికూలతల వల్లా, ఊహలవల్లా బాధ, దుఃఖము, అశాతి, అలజడి, విసుగు, ఆందోళన అడుగడుగునా ఎదురౌతూనే వున్నాయిగదా! కానీ ఈనాడు కొత్తగా వచ్చిన సమస్యకాదు. అనాదిగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యే. ఐతే మేధావంతులైన ప్రాచీన మహర్షులు జటిలమైన ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి మహత్తరమైన అనుభవాలతో ఈ క్రింది పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించారు.
మనిషి తన ఆధీనంలో లేనటువంటి బాహ్య విషయాల ప్రభావానికి లోనవటం వలన తాను అంతర్గతంగా దుఃఖము, బాధ, విసుగు, అలజడి, ఆందోళన, భయము మొదలైన వికారాలను పొందుతున్నాడు. బాహ్య విషయాలు తన ఆధీనంలో లేనివి కనుక తాను తనకు అనుగుణంగా మార్చగలిగేవి కాదు. అందువల్ల వాటిని మార్చాలనే ప్రయత్నం ఎంత గొప్పగా చేసినా, కాలానుగుణంగా అది నిరుపయోగమే కాగలదు. ఐతే బాహ్య విషయాల ప్రభావానికి తాను లోనవటం వల్లనే గదా తాను దుఃఖము మొదలైన వికారాలకు గురౌతున్నది. కావున తాను ఏదోవిధంగా బాహ్య విషయాల ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగితే దుఃఖ పడవలసిన అగత్యం వుండదు. ఈ విధమైన దృక్పథంతో బాహ్య విషయాలను ప్రక్కన పెట్టి అంతర్గతంగా తమలో ఏమి ఉన్నదో, దుఃఖము, భయము మొదలైన వికారాలు అసలు ఎలా కలుగుతున్నాయో నిశితంగా పరిశీలించారు.
ఇదే అంతర్ముఖం అవ్వటం, అంతశ్శోధన చేయటం అనబడుతుంది. ఇప్పటివరకు తాను బహిర్ముఖుడై తనకు బాహ్య విషయాల వల్ల దుఖం కలుగుతున్నదని గ్రహించడం చేత, అసలు బాహ్య విషయాలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అలా చూస్తున్నప్పుడు తనకు గోచరమౌతున్న స్థూల విషయాలన్నీ పంచ భూతములతో నిర్మితమైనవిగనూ, తాను పంచభూతముల కంటే సూక్ష్మముగనూ, భిన్నముగనూ వున్నట్లు తెలియుచున్నది.
ఇప్పటివరకు స్థూల దేహమే తాననుకోవటం వలన దేహ సంబంధ మైన విషయాలు తనపై నాపాదించుకోవటం జరిగింది. ఇప్పుడు ఇతర విషయాల సరసన దేహం కూడా తనకు భిన్నంగా గోచరిస్తున్నది. అలాగే స్థూలమైన దేహం కంటే సూక్ష్మమైన ఇంద్రియాలు, అంతకంటే సూక్ష్మమైన మనస్సు, బుద్ధి, ప్రాణము తనకు గోచరమౌతున్నాయి కనుక ద్రష్టయైన తాను గోచరమౌతున్న దృశ్యానికి భిన్నముగా సూక్ష్మతమమై యున్నట్లు తెలియుచున్నది. ఈ విధంగా సాంఖ్యానమ్ చేసిన మహర్షులు ఆత్మ యొక్క విస్త్రుతత్వాన్ని వివరించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.