(Local) Tue, 21 Sep, 2021

దీపారాధన ఎలా చేయాలి!

July 11, 2019,   3:00 PM IST
Share on:
దీపారాధన ఎలా చేయాలి!

దీపారాధన అనేది హిందువులు దైనందిక జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీపం పరంజ్యోతి స్వరూపం. దీపారాధన వల్ల  మ‌న‌లో దాగి ఉన్న దైవీక శ‌క్తులు మేల్కొల్ప‌బ‌డ‌తాయి. శారీర‌క‌, మాన‌సిక బ‌లం క‌లుగుతుంది. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది. అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు. ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలీ, దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలీ మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలుదీనికి తోడు దీపం వెలిగించి మ‌నం దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోర్కెల‌న్నీ నెర‌వేరుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ... ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు.

దీపారాధన చేసేటపుడు దీపాన్నిఒట్టి నేలపై ఉంచరాదు. క్రింద అర‌టి ఆకు లేదా త‌మ‌ల‌పాకు, ప‌ళ్లెం ఉంచాలి. లేదా కింద శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి దానిపై దీపం పెట్ట‌వ‌చ్చు. 

దీపారాధనకు ఉపయోగించే తైలం ఆవు నెయ్యి లేదా న‌ల్ల నువ్వుల నూనె మాత్రమే వాడాలి. కొబ్బిరి నూనె, గేదె నెయ్యితో మరి ఏ ఇతర నూనెలు వాడకూడదు. 

దీపాన్ని వెలిగించేందుకు మూడు వ‌త్తులు వాడాలి. మూడు వత్తులు త్రిమూర్తుల స్వరూపం. 

ఐదు వ‌త్తులు ఉంచి దీపాన్ని వెలిగించవచ్చు ఆలా వెలిగించేటప్పుడు..అవి  తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, ఈశాన్య దిశ‌ల్లో వత్తుల‌ను ఉండే విధంగా చూసుకోవాలి

దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ముందుగా ఒక రెండు వత్తులను తీసుకుని దాని ఒకటిగా కలిపి వేరే దీపారాధన కుండీలో కానీ హారతి దాంట్లో పెట్టి దాని వెలిగించి, దానికి కుంకుమ పెట్టి అప్పుడు దాని ద్వారా దేవుడి ముందున్న దీపారాధన చేయాలి. 

దీపారాధన చేసిన వెంటనే దీపారాధన కుందికి కుంకుమ బొట్టు పెట్టి, ఆ తర్వాత ఆ కుందిలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ పోయాలి. 

ఎపుడైనా  వెలిగించిన దీపారాధనని నోటితో ఊద‌రాదు. దీపాన్ని కొండెక్కించాలి అంటే వ‌త్తిని చ‌మురులోకి జార్చాలి లేదా వెలుగుతున్న వ్ వత్తిపై కొద్దిగా నూనె పోయాలి.

దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని చదువుతారు...!

దీపం జ్యోతి పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!

భావం: దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే... కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి.


‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‌
భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‌ ఘోరాత్‌ దివ్యర్యోతి ర్నమోస్తుతే’!

భావం: ‘మూడు వత్తులను తీసుకుని, తైలంలో తడిపి, అగ్నిని జతచేసి శుభప్రదమైన, మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను’ అని రోజూ దీపానికి నమస్కరిస్తాం. చిన్న దీపం పెట్టి ‘అది నా ఇంటినే కాదు ముల్లోకాల్లోనూ వెలుగు నింపాల’న్నది ఎంత గొప్ప భావన! మరెంతటి ఉదాత్తమైన ఆలోచన! దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకీ, సత్వ రజ తమోగుణాలకూ, త్రిసంధ్యలకూ సంకేతంగా భావిస్తారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.