(Local) Thu, 21 Nov, 2019

శ్రావణమాస విశిష్టత...

July 31, 2019,   11:37 AM IST
Share on:
శ్రావణమాస విశిష్టత...

జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే. అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి. ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన, అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన పతి మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు. పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా … పసుపు, కుంకుమ, పూలు, సగుంధాది మంగళ ద్రవ్యాలలోను, ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.