(Local) Wed, 20 Oct, 2021

కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 28వ అధ్యాయం

November 25, 2019,   11:39 AM IST
Share on:
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 28వ అధ్యాయం

శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తీకమాసం అధికఫలదాయకమైంది.

కార్తీకమాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.

కార్తీకపురాణం 28వ అధ్యాయం:

విష్ణు సుదర్శనచక్ర మహిమ:-

అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవుపొంది తనను వెన్నంటితరుముచున విష్ణుచక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకొచ్చి " అంబరీషా, ధర్మపాలకా! న తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో, ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి, కాని నిన్ను కష్టముల పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకువెళ్లి ఆ విష్ణుచక్రము ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ణానోదయముచేసి నీ వద్దకు వెళ్లమని చెప్పినాడు. కావున నీవే నకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్ఠగలవాడనైనను నీ నిష్కళంక భక్తిముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు" అని అనేక విధములుగా ప్రార్థించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి " ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనఃపూర్వక వందనములు, ఈ దూర్వాసముని తెలిసియో, తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొనితెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీకర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు,దైవము. నీవు శ్రీహరి చేతిలోనుండి అనేక యుద్ధములలో, అనేకమంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే ఉన్నవు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా ఏకమైననూ నిన్నేమియు చేయజాలవు. నీశక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలుసు. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించెను. 
నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి యున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను, శరణు వేడిన ఈ దూర్వసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్ధనలకు శాంతించి " ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను - దేవతలందరు ఏకమైగూడ చంపజాలని మూర్ఖులను నేను దనుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపారాధివగు నిన్ను రక్షించి, ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.
ఇతడు గూడా సామాన్యుడుగడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరిని చంపగలదుగాని, శక్తిలో నాకంటె ఎక్కువేమియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజశ్శక్తికంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నింఫియున్న నాతో రుద్రతేజస్సుగల దూర్వాసుడుగాని, క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న ఎదుటివాడు బలవంతుడై వున్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకినగలరు.
ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్ధియై వచ్చిన ఆ దూర్వసుని గౌరవించి నీ ధనమును నీవు నిర్వర్తింపుము" అని చక్రాయుధము పలికెను. ఆంబరీషుడు ఆ పలుకులనాలకించి, "నేను దేవ గో, బ్రాహ్మణాదులయందును, స్త్రీలయంసును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖముగా వుండవలెననే నా అభిలాష కావున శరణుగోరిన ఈ దూర్వసుని, నన్నూ రక్షింపుము. వేలకొలది అగ్ని దేవతలు, కోట్లకొలది సూర్యమండలములు ఏకమైననూ నీ శక్తినీ, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తన కుక్షియందున్న పదునాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు. అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శనచక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి" అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణుస్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక , పరధనములను ఆశపడక , పరస్త్రీలను, చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్య మహాపాతకములను చేయకుంటారో అట్టివారి కష్టములు నశించి, ఇహమందును పరమందునువారు సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కావున నిన్నూ దూర్వసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రతప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు. అని చెప్పి అతనిని ఆశీర్వదించి, అదృశ్యమయ్యెను.
28వ అధ్యాయము సమాప్తము.
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
కార్తీకమాస 28వ రోజు ఆచరించవలసిన దానధర్మలు - జపతపాది విధులు - ఫలితములు :
పూజించాల్సిన దైవము → ధర్ముడు
జపించాల్సిన మంత్రము → ఓం ధర్మయ కర్మనాశాయ స్వాహా
నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ
దానములు → నువ్వులు, ఉసిరి
ఫలితము → దీర్ఘకాల వ్వాధీహరణం

సంబంధిత వర్గం
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 27వ అధ్యాయం
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 27వ అధ్యాయం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.