(Local) Sat, 06 Jun, 2020

భద్రాద్రి రాముడి చరిత్ర!

June 25, 2019,   7:04 PM IST
Share on:
భద్రాద్రి రాముడి చరిత్ర!

"రామ రామ రామ" అనే తారక మంత్రం ఒక బోయవాడిని వాల్మీకి మహర్షిగా మార్చింది. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే చాలు విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుంది అంటారు మన పెద్దలు. ఒక రామ నామలో ఎంత మహిమ వుందో మనకి అర్థం అవుతుంది. అలాంటి రామచంద్రులవారిని మనము ఒక విగ్రహ మూర్తిగా కనులారా చూస్తూ ఆయన్ని పూజిస్తున్నాం అంటే దానికి గల కారణం ఆ రామ భక్తుడు భద్రుడు. బంగారు లేడి కావాలని సీతమ్మ తల్లి కోరగా నేను వెళ్తా అని చెప్పిన లక్ష్మణుని సీతమ్మకి కాపలా ఉంచి తానే ఆ లేడిని తీసుకురావడానికి వెళ్లిన రామచంద్రుడి తిరుగాడిన ప్రదేశం. సీతమ్మ నారా చీర ఆరేసుకున్న గుర్తులు, భిక్ష రూపధారి అయి వచ్చి అమ్మను ఎత్తుకెళ్లిన రావణుడి అహంకార ఆనవాలు  కళ్ళకు కట్టినట్టు మనకు కనిపించే ఒకే ఒక క్షేత్రం భద్రాచలం. ఈ రోజు ఆ రామ క్షేత్రం గురించి తెలుసుకుందాం. 

రామావతారం:

అస్సలు రామ అవతారం భూమి మీద మనుష్య రూపంలో రావడానికి కారణం రావణుడు. బ్రహ్మ గారి గురించి తప్పసు చేసి ఆయన్ని  ప్రసన్నం చేసుకొని తనకి మరణం లేకుండా రావణబ్రహ్మ వరం కోరుకున్నాడు. అపుడు బ్రహ్మగారు ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు ఆ వరం కాకుండా ఇంకేదైనా కోరుకో అని చెప్పగా, రావణుడు దేవా,కిన్నెరా,యక్ష, అంటూ...తనకి మరణం లేకుండా ప్రసాదించమని వేడుకోగా బ్రహ్మగారు తధాస్తు అని అన్నారు. కానీ ఇందులో విచిత్రం ఏంటి అంటే రావణుడి ఈ సృష్టిలో ప్రతి జీవి గురించి ప్రస్తావిస్తాడు ఒక్క మనుష్యుని గురించి తప్ప. అందుగల కారణం రావణుడి కి మనుష్యుడు అంటే అల్పప్రాణి అని విశ్వాసం. ఈ రావణ సంహారం కోసం వచ్చిన అవతారమే రామావతారం. మనుష్య ప్రాణి యెక్క విలువలు తెలియజేయటానికి ఏ  విధంగా మానవ జీవితం నడవాలి అనేది తెలిపేదే రామ చరితం. అలాంటి ఈ రామ అవతారం కేవలం దుష్ట సంహారం కోసం కాకుండా మనుష్య నడవడిక, వారి జీవిత విలువలు తెలపటానికి తాను మనుష్య అవతారంలో కేవలం మనుష్యునిగా ఆచరించి వ్యవహరించాడు ఆ రామచంద్రుడు. 
 
రాముడు భద్రగిరి పై ఎందుకు వెలిశారు : 

మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. శ్రీ రాముడు రామావతారం ముగిసిన తర్వాత యుగాల తరబడి తపస్సు చేస్తున్న తన భక్తుడు భద్రుడు కోసం ఈ ప్రదేశంలో వెలిశాడు. రాముడు అవతారం ముగిసి వైకుంఠం చేరిన చాలాకాలం తర్వాత  శ్రీ మహా విష్ణువు భక్తునికిచ్చిన మాటకోసం మళ్ళీ వైకుంఠంనుంచి  రామావతారంలో వచ్చి ఇక్కడ వెలిశాడుకనుక ఈ రాముణ్ణి వైకుంఠ రాముడంటారు.  దానికి సంబంధించిన కధ ఏమిటంటే...
మేరు పర్వత పుత్రుడైన  భద్రుడు రాముడుని తనపై నివాసం ఏర్పరచుకోవాలని తపస్సు చేశాడు.  ఆ సమయంలో రాముడు సీతని కోల్పోయి వెతుకుతూ వుంటాడు.  అందుకని సీతని తీసుకువచ్చిన తర్వాత భద్రుని కోరిక తీరుస్తానని మాట ఇచ్చి సీతాన్వేషణలో వెళ్తాడు రాముడు. తర్వాత అవతార పరిసమాప్తికూడా అవుతుంది. భద్రుడు మాత్రం తన  తపస్సు కొనసాగిస్తాడు.  ఆ తపశ్శక్తికి వైకుంఠవాసుడికి భద్రుడి కోరిక గుర్తువచ్చి, భద్రుడికి దర్శనం ప్రసాదిస్తారు. అలా స్వామి భద్రుని దర్శనం ప్రసాదించి వరము కోరుకొనమనగా, అపుడు భద్రుడు స్వామిని    నువ్విప్పుడు నాకు దర్శనమిచ్చిన విధంగా కాకుండా అలనాటి రామావతారంలో తక్షణమే తన శిరస్సుపై సదా నివసించమని కోరగా హడావుడిలో స్వామి కుడిచేతిలో వుండవలసిన సుదర్శన చక్రం ఎడమ చేతికి, ఎడమ చేతిలో వుండవలసిన శంఖు కుడి చేతికీ మారి రామచంద్రుల వారు సీత సమేత లక్ష్మణునితో సహా భద్రగిరిపై వెలిశారు.    

స్థల పురాణం: భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు.. ఘనమైన చరిత్ర కూడా ఉంది. 1730 (17వ శతాబ్దం) ప్రాంతంలో... భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట! తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం... భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట! ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్‌దాస్‌ శిష్యుడైన శ్రీ రామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం.. భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674లో ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు!

ఈ విషయం నవాబ్‌ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా... ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట! ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు... తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు. సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉండే.. పర్ణశాలలో.. రామాయణ కాలంలో శ్రీరాముడు.. సీత.. లక్ష్మణుడున్న పర్ణశాల.. రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ.. జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకొనే ఆధారాలు చూడొచ్చు.

ఈ ఆలయంలో శ్రీపాంచరత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్యపూజలు.. ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.