(Local) Tue, 26 Oct, 2021

గ్రామదేవతలకి బోనాలు ఎందుకు చేయాలి?

July 09, 2019,   8:13 PM IST
Share on:
గ్రామదేవతలకి బోనాలు ఎందుకు చేయాలి?

ఆషాడ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయి. గ్రామదేవతలుగా పూజించే పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెలు కాగా వీరికి తమ్మడు పోతురాజు.

ఆషాఢమాసమే బోనం ఎందుకు చేయాలి.... ?
ఆషాఢమాసంలోనే  వర్షాలు కురిసి వ్యాధులు విజృంబిస్తాయి. మరోవైపు గ్రామీణులు వ్యవసాయం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, తమ పిల్లా పాపా గొడ్డు గోదా, పాడి పంటా, చల్లగా కాపాడుతల్లీ అంటూ మొక్కులు తీర్చుకుంటారు. వర్షాలు విరివిగా కురవడం మూలాన క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపించి జన నష్టం కలగజేస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం కాని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. దానినే గత్తర వచ్చింది అనేవారు. ఇలా ప్రకృతి భయంకర వికృత చేష్టలు, బీభత్సాలు, వైపరీత్యాలు జన సామాన్యానికి అర్థమయ్యేవి కావు. ఈ ప్రకృతి వైపరిత్యాలను, ప్రకృతి బీభత్సాన్ని జయించి వాటిని నివారించుకునే నిమిత్తం మానవుడు భక్తిభావంతో గ్రామదేవతలను ప్రతిష్టించుకొని విశ్వాసంతో ఆరాధించడం మొదలుపెట్టారు. దీనినే శక్తి ఆరాధన, ప్రకృతి ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన అంటారు.

బోనం అంటే ఏమిటి?

బోనం అంటే భోజనం. అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం!!
అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం భోజనం! అందువల్ల ఆమెను కన్నకొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి బోనాల పండగ పేర ప్రతి ఆషాడంలో అమ్మతల్లికి జాతరలు జరుపుతుంటారు.
అమ్మ పెట్టే నైవేద్యం బువ్వ, ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో, ఊరేగింపుగా ఉరుమ్మడిగా కలిసి వెళ్ళి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పిస్తారు. జగదంబకు భక్తి, శ్రద్ధలతో నివేదించే అన్న కైంకర్యం. అమ్మవారికోసం వండిన అన్నంలో పసుపు లేదా పాలు, బెల్లం వంటి పదార్ధాలను కలిపిన నైవేద్యంగా బోనంగా పిలుస్తారు. ఈ వండిన బోనాన్ని మట్టి కుండల్లో పెట్టిన ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, మహిళలు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో వెళ్లి అమ్మవారికి నివేదిస్తారు. 

గ్రామదేవత ప్రాధాన్యం ఏమిటి?

గ్రామదేవతయే గ్రామానికి అధిష్టాన దేవత. గ్రామదేవతలను ఈ రోజున మనం మర్చిపోతున్నాం కాని మన సంస్కృతిలో గ్రామదేవతలకు పెద్దపీట వేశారు. గ్రామదేవతలు ఆదిశక్తి అంశలు, ప్రకృతి శక్తులు అంటుంది దేవీ భాగవతం. పేర్లు ఏవైనా కావచ్చు, ఆరాధానపద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒక్కటే. దేశమంతా ప్రతి ఊళ్ళో ఒకటే శక్తిని కొలుస్తోంది. మనం ఉండే ఊరి నుంచి ఇతర ప్రదేశానికో, లేక  మనం సొంత ఊరు వదిలి వేరే ఊరికి జీవనం కోసం వెళ్ళినా, ముందు గ్రామదేవతను ప్రార్థించి కదలాలి. కొత్తగా స్థిరపడే ఊళ్ళో, లేదా పట్టణంలో అక్కడి గ్రామదేవతను అనుమతి అడిగి, ఆవిడను దర్శించి ప్రవేశించాలి. గ్రామదేవత అనుమతి లేకుండా ఎవరూ కొత్త ఊర్లలోకి వెళ్ళలేరు. అందుకే ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజించాలి. 

మనమంతా రాత్రి హాయిగా పడుకున్న సమయంలో ఊరిలోకి ఏ దుష్టశక్తులు రాకుండా ఉండేందుకుగానూ ప్రతి రోజు రాత్రి గ్రామసంచారం చేస్తుంది గ్రామదేవత. మనకోసం అమ్మ నిద్రపోకుండా తిరిగుతుంటే మరి ఆమెను విస్మరించడం తగదు కదా. అందుకుగానూ ఆ చల్లనితల్లికి కృతజ్ఞలు చెప్పాలి. మన వెళ్ళిన పని పూర్తియై తిరిగి మన ఉంటున్న గ్రామం/పట్టణం లోకి రాగానే మళ్ళీ గ్రామదేవత దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. గ్రామదేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచు. మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగిన ముందుగా గ్రామదేవతకు ఆహ్వానం పంపాలి. సారె ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. దేశాధినేతలు మొదలైనవారికి ప్రొటొకాల్ ఉన్నట్లే, దీనికి కూడా ఉంది. ముందు కులదేవతకు ప్రాధాన్యం. గణపతి, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత,.... అలా ఉంటుంది.  ఆమెయే రాత్రి గ్రామసంచారం చేస్తూ గ్రామంలోకి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. గ్రామదేవతను ఎప్పుడూ విస్మరించకూడదు. తరుచుగా గ్రామదేవతను దర్శించుకోవాలి. 

గ్రామదేవతల ఆలయాలకు ప్రత్యేకించి ఆగమాలు ఉండవు. అక్కడి అమ్మవారిని అందరూ దగ్గరకు వెళ్ళి పూజించవచ్చు. ఆ సదుపాయాన్ని శాస్త్రమే కల్పించింది. ఆ అమ్మవారికి ఎవరి పూజ వారు చేసుకోవచ్చు. గ్రామదేవతలకు నివేదనగా చద్ది పెడతారు, చద్ది అంటే పెరుగన్నం. చద్ది పెట్టడం వలన అమ్మవారు చల్లగా చూస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయలు కూడా నివేదిస్తారు. అమ్మవారికి ఇచ్చే నైవేధ్యంలో ప్రధానంగా చద్ది, పుట్నాలపప్పు, బెల్లం, ఉల్లిపాయలు ఉంటాయి. ఈ రోజుకి కొన్ని గ్రామాల్లో ప్రజలు రాత్రి ఒకానొక సమయం దాటాక బయట తిరగరు. ఆ సమయంలో గ్రామదేవత సంచారానికి వస్తుందని చెప్తారు. తూర్పుగోదావరి జిల్లా 'లోవ' (విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్నది) అనే గ్రామానికి అధిదేవత తలుపులమ్మ తల్లి. అక్కడ సాయంత్రం ఒక నిర్ణీత సమయం దాటక మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు తలుపులమ్మతల్లి అక్కడ సంచరిస్తుందని, ఆ సమయంలో అక్కడ ఉంటే మరణం తప్పదని అక్కడి ప్రజలు చెప్తారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.