(Local) Mon, 09 Dec, 2019

అమరావతిలో శ్రీవారి విగ్రహం ప్రతిష్టకు ఏర్పాట్లు

July 04, 2019,   1:37 PM IST
Share on:
అమరావతిలో  శ్రీవారి విగ్రహం ప్రతిష్టకు ఏర్పాట్లు

రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు గాను స్వామివారి విగ్రహం తయారీ పనులకు గురువారం జ‌రిగిన శిలా సంగ్ర‌హ‌ణం కార్య‌క్ర‌మంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీవైవి.సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి సమీపంలోని రాయలచెరువు రోడ్‌లో గల రామాపురం గ్రామం వద్ద శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జ‌రిగింది.

           ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ శ్రీవారి మూలమూర్తితోపాటు వకుళాదేవి, గరుడాళ్వార్‌, ద్వారపాలకులు, విష్వక్సేనులవారి విగహ్రాలను 18 మంది శిల్పులు కలిసి 6 నెలల వ్యవధిలో పూర్తి చేస్తారని తెలిపారు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో శ్రీవారి విగ్రహాన్ని రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల అమరావతిలోని శ్రీవారి ఆలయ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించానని, ఆలయాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి భక్తులు ఎక్కువగా ఉండే దళితవాడలు, బిసి కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. 

          శిల సంగ్రహణంలో భాగంగా ముందుగా పంచగవ్యంతో శిలను శుద్ధి చేసి వాస్తుహోమం, పరిహరణ, మహాశాంతిహోమం, అభిషేకం, హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు. వేదమంత్రాలతో శిలను చెక్కడం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పులు శ్రీ రాజేంద్రాచారి,  శ్రీ వేంకటేశాచారిని టిటిడి ఛైర్మన్‌ శాలువ, వస్త్రాలతో సన్మానించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత తిరుచానూరులో నూతనంగా నిర్మించిన శ్రీపద్మావతి నిలయం యాత్రికుల సముదాయాన్ని ఛైర్మెన్ పరిశీలించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.