(Local) Mon, 27 Sep, 2021

రివ్యూ: మన్మథుడు 2

August 09, 2019,   3:12 PM IST
Share on:
రివ్యూ: మన్మథుడు 2

టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మథుడిగా పేరుగాంచిన హీరో అక్కినేని నాగార్జున. ఆ మాటలను నిజం చేస్తూ మళ్ళి మన్మథుడు 2 అంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే . ఇన్నాళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో 
మన్మథుడు 2 గా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో మెరవగా.. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్‌. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..? అస‌లు మ‌న్మ‌థుడుకి...మ‌న్మ‌థుడు 2కి సంబంధం ఏమైనా ఉందా? అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూడాల్సిందే..

కథ: పొర్చుగల్ లో తరాలుగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన సామ్ (నాగార్జున) తల్లి(లక్ష్మీ), అక్క(ఝాన్సీ)తో కలిసి అక్కడే స్వేచ్చా జీవితం అనుభవిస్తూ ఉంటాడు. హీరో స్యామ్‌ పెళ్లి అంటే దూరంగా ఉంటాడు కానీ అమ్మాయిలకు మాత్రం దగ్గరగా ఉంటాడు. వయసు దాటిపోతున్నా కూడా పెళ్లి చేసుకోడు. ఉన్న‌ట్టుండి సాంబ‌శివ‌రావు త‌ల్లి అత‌న్ని మూడు నెల‌ల్లో పెళ్లి చేసుకోమ‌ని అంటుంది. స‌రిగ్గా ఆ స‌మ‌యంలో త‌న కుటుంబ‌స‌భ్యుల ముందు త‌న ప్రేయ‌సిగా న‌టించ‌డానికి అవంతిక (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌)తో బేరం కుదుర్చుకుంటాడు. కొన్ని అనుకోని మలుపుల తరువాత సామ్ జీవితం తలకిందులవుతుంది. సామ్ జీవితంలో చేసిన తప్పులు ఏమిటి? తాను చేసిన ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు అనేది మిగతా కథాంశం.

ప్లస్ పాయింట్స్: నాగార్జున మన్మధుడు గా తన చార్మింగ్ గ్లామర్ తో ఆకట్టుకుంటాడు. ఆయనను ఈ చిత్రం లో చూసిన వారు ఎవరు ఆయనకు ఇంకొద్ది రోజులలో అరవై ఏళ్ళు వస్తాయంటే నమ్మరు. నాగ్ రొమాంటిక్ స‌న్నివేశాలతో పాటు, భావోద్వేగాలు కూడా చక్కగా పండించారు. వెన్నెల కిషోర్ క‌థానాయ‌కుడితోపాటే క‌నిపిస్తూ చ‌క్కటి వినోదాన్ని పండించారు. ఇక మూవీ ఆహ్లాదంగా సాగడంలో నటుడు వెన్నెల కిషోర్ కామెడీ చక్కగా పనిచేసింది. ఆయన కామెడీ టైమింగ్ తోపాటు, నాగార్జున కు ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. ముఖ్యముగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది. ఆధునిక భావాలున్న యువతిగా నటించిన రకుల్ కు ఇన్నాళ్లకు నటన పరంగా చెప్పుకోదగ్గ పాత్ర లభించింది చెప్పుకోవచ్చు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన రావూ రమేష్‌ తన మార్క్‌ చూపించాడు. ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దేవ దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్‌, సమంతలు తళుక్కుమన్నారు. 

మైనస్ పాయింట్స్: సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు. కథలో కొత్తదనం లేకపోవడం, ఇలాంటి కథ ఇంతకు ముందు అనేక తెలుగు హిందీ చిత్రాలలో చూసిన భావన కలగడం ఈ మూవీ ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. దర్శకుడు రాహుల్ రవీంద్ర మొదటి సగం కొంచెం ఆహ్లాదంగా నడిపినా రెండవ భాగంలో కథను తేల్చేశాడు.

సాంకేతిక విభాగం: సుకుమార్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధానబ‌లం. ముఖ్యంగా పోర్చుగ‌ల్ అందాల్ని సుకుమార్ కెమెరాలో బంధించిన తీరు ఆక‌ట్టుకుంటుంది.  విజువల్ గా చాలా బాగుందంటే కారణం ఒకటి నిర్మాణ విలువలు రెండోది సుకుమార్ టేకింగ్ , నాగార్జున ని చాలా బాగా చూపించాడు అలాగే రకుల్ గ్లామర్ ని బాగా ఒడిసి పట్టాడు సుకుమార్  ద‌ర్శకుడిగా రాహుల్ ర‌వీంద్రన్ తొలి సినిమా స్థాయిలో మెప్పించ‌లేక‌పోయారు. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ ఆహ్లాదంగా సాగింది. అలాగే పాటల సాహిత్యం మూవీ సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కగా కుదిరింది. రీ రికార్డింగ్ ఫరవాలేదు , ఎడిటింగ్ మాత్రం నిరుత్సహపరుస్తుంది.  అలాగే నాగ్,రకుల్ ని అందంగా చూపించడంలో కాస్ట్యూమ్ వర్క్ ఆకట్టుకుంటుంది.

తీర్పు: ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరిని అలరించే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ మన్మథుడు 2. మరీ నిరాశ పరిచే చిత్రం కాకపోయినప్పటికీ ఎక్కువగా ఆశించివెళితే నిరాశ తప్పదు.

రేటింగ్: 3/5

సంబంధిత వర్గం
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.