(Local) Sat, 24 Jul, 2021

బిగ్ బాస్ హౌస్ లో “ఎర్రగడ్డ లవ్ స్టోరీ”.....

August 30, 2019,   12:36 PM IST
Share on:
బిగ్ బాస్ హౌస్ లో  “ఎర్రగడ్డ లవ్ స్టోరీ”.....

బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం మ‌రింత ర‌సవ‌త్త‌రంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్ప‌టికే ఐదు వారాలు పూర్తి కాగా… ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది స‌భ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి స‌భ్యుల మ‌ధ్య నామినేష‌న్ ప్ర‌క్రియ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్ అని తెలిపారు బిగ్ బాస్. తాజాగా ఇంటి స‌భ్యుల‌కి ‘ఛలో ఇండియా’ అనే టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్ ప్ర‌కారం గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల‌కి తిరిగి రావాల‌ని చెప్పారు బిగ్ బాస్.

బుధ‌వారం ఎపిసోడ్‌లో శ్రీన‌గ‌ర్‌, చండీఘ‌ర్ సంద‌ర్శించారు. ఇక గురువారం ఎపిసోడ్‌లో కోల్‌క‌త్తా, ముంబై, కొచ్చి, హైద‌రాబాద్ చుట్టొచ్చేశారు. ఒక్కో ప్రాంతంలో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ప‌లు టాస్క్‌లు ఇవ్వ‌గా వాటిని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. హనీమూన్ కపుల్స్‌గా నటించిన రవి, పునర్నవిలతో పాటు శ్రీముఖి, అలీ ప్రేమ మైకం నుండి పూర్తిగా బ‌య‌ట‌కి రాలేక‌పోతున్నారు. గురువారం ఎపిసోడ్‌లోను వారు అదే కొన‌సాగించారు. కోల్‌క‌త్తా చేరుకున్న ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ ఓ స‌ర‌దా టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న చేప‌ల‌ని ఒడ్డుపై ఉన్న బుట్ట‌లో వేయాల‌ని కోరారు. దీంతో రంగంలోకి దిగిన రాహుల్, అలీ రాజా బాగానే పోటీ ప‌డ్డారు. చివ‌రికి అలీ విజేత‌గా నిలిచాడు.

కోల్ క‌త్తా నుండి ముంబై వెళ్లే స‌మ‌యంలో ఇంటి స‌భ్యుల ముచ్చ‌ట్లు ప్రేక్ష‌కుల‌కి కాస్త విసుగు తెప్పించాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ముంబై చేరుకున్న త‌ర్వాత బిగ్ బాస్ .. ఇంటి కంటెస్టెంట్స్‌కి ‘స్టార్, కెమెరా, యాక్షన్’ అనే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఐదు నిమిషాల నిడివితో వీడియోను తీయాలన్నారు. ఇందులో లవ్, రొమాన్స్, యాక్షన్ ఎమోషన్స్ ఉండాలన్నారు. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ దర్శకుడుకాగా.. కేమెరామెన్ గా వరుణ్, అసిస్టెంట్‌గా రాహుల్.. నటీనటులుగా శ్రీముఖి, హిమజ, రవి, అలీ, మహేష్ ఉన్నారు. రియ‌ల్ సినిమా స్టైల్‌లోనే వీరు సినిమా తీసే ప్ర‌య‌త్నం చేయ‌గా, అది బెడిసి కొట్టింది.

‘ఎర్రగడ్డ లవ్ స్టోరీ’గా రూపొందిన ఈ షార్ట్‌ఫిలింని ద‌య‌చేసి ఎవ‌రు చూడొద్ద‌ని బాబా భాస్క‌ర్ ప్రేక్ష‌కుల‌ని కోరారు. ఆ త‌ర్వాత ముంబై నుండి కొచ్చి బ‌య‌లు దేరారు. కొచ్చిలో కొబ్బరికాయలకు పీచు తీసే టాస్క్ ఇవ్వ‌గా.. ఇందులో బాబా భాస్కర్, వరుణ్ పాల్గొన్నారు. బాబా భాస్కర్ పంటితో పీచు తీసి సత్తా చూపారు. ఇక ఆ త‌ర్వాత మ‌ళ్ళీ ట్రైన్‌లో బ‌య‌లు దేరి హైద‌రాబాద్‌కి చేరుకున్నారు. లివింగ్ ఏరియాలో కూర్చున్న ఇంటి స‌భ్యుల‌ని బిగ్ బాస్ ప్ర‌శంసించాడు. అంద‌రు చ‌క్క‌గా న‌టించారు. కాక‌పోతే వీరిలో ఏ ముగ్గురి ప‌ర్‌ఫార్మెన్స్ బాగుందో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని చెప్ప‌డంతో కెప్టెన్ శివ‌జ్యోతి .. బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ పేర్ల‌ని బిగ్ బాస్‌కి తెలియ‌జేసింది. బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ఎంపికైన ఈ ముగ్గురిలో ఒక‌రు కెప్టెన్ ఆఫ్ ది హౌజ్ అయ్యే అవ‌కాశం ఉండ‌నుండ‌గా, వీరికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. మ‌ట్టిలో మాణిక్యం అనే టాస్క్‌లో పాల్గొన్న ఈ ముగ్గురు బుర‌ద‌లో ప‌డి నానా హంగామా చేశారు. ఈ టాస్క్ నేటి ఎపిసోడ్‌లో ప్ర‌సారం కానుంది.
 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.