(Local) Mon, 17 Jun, 2019

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశం

June 10, 2019,   11:31 AM IST
Share on:

ఇటీవలే కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశం ఇవాళ జరగనుంది. 8 కీలక అంశాలపై నిర్ణయాలే ప్రధాన అజెండాగా... సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది.అన్నదాతలు, మహిళలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం సహా... పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పింఛన్లు 2వేల 250 రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఆ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.రైతులకు ఏడాదికి రూ.12వేల 500 చొప్పున పెట్టుబడి సాయం అందించే "రైతు భరోసా పథకాన్ని" అక్టోబర్‌ నుంచి అమలు చేయాలని భావిస్తున్న జగన్... మంత్రివర్గంలో చర్చించి ఈ నిర్ణయానికి పచ్చజెండా ఊపనున్నారు.

అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన జగన్... ఈ అంశంపైనా చర్చించి... విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నారు.ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం...(సీపీఎస్)ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చి ... తొలి సమావేశంలోనే ఈ అంశంపై చర్చించాలని సీఎం నిర్ణయించారు.

సీపీఎస్ రద్దుపై అధ్యయనం కోసం తెదేపా ప్రభుత్వం మాజీ సీఎస్ టక్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. టక్కర్ కమిటీ తమ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలోని సిఫార్సులపైనా కేబినేట్​ చర్చించనుంది.

ఆశ కార్యకర్తల వేతనం రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.హోంగార్డులకు జీతాల పెంపు పైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు... ఒప్పంద ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది.తిత్లీ, ఫొనీ తుపాను బాధిత రైతులకు అందిన పరిహారానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన సాయం... రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.వర్షాకాలం ప్రారంభమవుతున్నందునా... విత్తనాలు, ఎరువులు, మద్దతు ధర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.